ఇక ఈ సీజన్‌లో అత్యంత చెత్త ఆటను కనబరుస్తున్న మాజీ విజేత ముంబై ఇండియన్స్ శనివారం జరిగే మరో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ అన్నింటిలోనూ ఓడి అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకొంది. దీంతో రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లోనైనా ముంబై ఖాతా తెరుస్తుందా లేదా అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. రోహిత్ శర్మ ఇటు కెప్టెన్ అటు బ్యాట్స్‌మన్‌గా ఘోరంగా విఫలమవుతున్నాడు. జట్టును ముందుండి నడిపించలేక పోతున్నాడు. అతని వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా అతను తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తాడా లేదా అనేది సందేహమే.
లక్నోతో జరిగిన కిందటి మ్యాచ్‌లో ముంబైకి ఘోర పరాజయం ఎదురైంది. 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ముంబై విఫలమైంది. దీంతో జట్టుకు 36 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. ఇషాన్ కిషన్, బ్రెవిస్, రోహిత్, సూర్యకుమార్, పొలార్డ్ తదితరులు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తేనే ఈ మ్యాచ్‌లో ముంబైకి గెలుపు అవకాశాలు ఉంటాయి. లేకుంటే మరో ఓటమి ఖాయం. ఇక రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాలతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ప్లేఆఫ్‌కు మరింత చేరువ కావాలని భావిస్తోంది. జోస్ బట్లర్, పడిక్కల్, శాంసన్, రియాన్ పరాగ్, హెట్‌మెయిర్ తదితరులతో రాజస్థాన్ చాలా బలంగా ఉంది. దీంతో ఈసారి కూడా రాజస్థాన్‌కే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.