ముంబై : ఐపిఎల్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్‌కింగ్స్‌లకు సోమవారం జరిగే పోరు కీలకంగా మారింది. నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాల్సిన పరిస్థితి ఇరు జట్లకు నెలకొంది. ఇక ముంబై ఇండియన్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో సిఎస్‌కె చివరి బంతికి సంచలన విజయం సాధించింది. సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ తన మార్క్ బ్యాటింగ్‌తో చెన్నైకి సూపర్ విక్టరీ సాధించి పెట్టాడు. ఈ గెలుపు సిఎస్‌కె ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక పంజాబ్ కూడా వరుస ఓటములతో సతమతమవుతోంది. బ్యాటింగ్ వైఫల్యం జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. జట్టును ముందుండి నడిపించడంలో కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఘోరంగా విఫలమవుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఘోర పరాజయం చవిచూసింది. ఢిల్లీ బౌలర్ల ధాటికి ఎదురు నిలువలేక పంజాబ్ 115 పరుగులకే ఆలౌటైంది. సీనియర్లు బెయిర్‌స్టో, ధావన్‌లు తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచలేక పోతున్నారు. యువ ఆటగాడు షారూక్ ఖాన్ కూడా నిరాశ పరుస్తున్నాడు. లివింగ్‌స్టోన్, వికెట్ కీపర్ జితేష్ శర్మ మాత్రమే కాస్త నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు.
ఈ సీజన్‌లో పంజాబ్ ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడి కేవలం మూడింటిలో మాత్రమే గెలిచింది. నాలుగింటిలో ఓటమి పాలైంది. ఇక సిఎస్‌కె ఏడు పోటీల్లో రెండు విజయాలే సాధించింది. పాయింట్ల పట్టికలో ఇరు జట్లు అట్టడుగు స్థానంలో కొనసాగుతున్నాయి. దీంతో సోమవారం జరిగే మ్యాచ్‌ను రెండు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని తహతహలాడుతున్నాయి. సిఎస్‌కె జట్టులో పలువురు స్టార్ ఆటగాళ్లు ఉన్నా ఫలితం లేకుండా పోతోంది. వరుస ఓటములతో అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఈ మ్యాచ్‌లోనైనా డిఫెండింగ్ చాంపియన్ సిఎస్‌కె తన స్థాయికి తగ్గ ఆటను కనబరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే మరోసారి జట్టుకు పరాజయం తప్పక పోవచ్చు.