అధ్యక్ష బరిలో ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు (మా) ఆదివారం జరుగనున్నాయి. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఇక ‘మా’ ఎన్నికల్లో అటు ప్రకాశ్‌రాజ్ ప్యానల్, ఇటు మంచు విష్ణు ప్యానల్ పోటీ చేస్తున్నాయి. ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేస్తూ జోరుగా ప్రచారాన్ని నిర్వహించారు. ఇక రెండేళ్లకు ఒకసారి జరిగే ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, ఇద్దరు జాయింట్ సెక్రటరీలతో పాటు ట్రెజరర్, 18 మంది ఈసీ మెంబర్లతో కలిపి మొత్తం 26 మందిని ఎన్నుకోనున్నారు.
ఇక ప్రస్తుతం ‘మా’లో మొత్తం 925 మంది సభ్యులు ఉండగా 883మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. రాత్రి వరకు ‘మా’ ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు. ‘మా’ ఎన్నికల అధికారి వి.కృష్ణమోహన్ మాట్లాడుతూ “మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుండి మథ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 2 గంటల తర్వాత వచ్చే వారికి ఓటు వేసే అవకాశం ఉండదు”అని తెలిపారు.
‘మా’ ఎన్నికల కోసం జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో 3 గదుల్లో 12 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలను పురస్కరించుకొని జూబ్లీ హిల్స్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.