మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయకుటుంబాలలో కేసిఆర్ సర్కారు రెండు రోజుల ముందుగానే నూతన సంవత్సర సంబరాలు నింపుతోంది. రైతుబంధు పథకం ద్వారా 70.54లక్షల రైతుల ఇంట సంక్రాంతి వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తొంది. యాసంగి పంటల సాగుకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం పదో విడత రైతుబంధు నిధల విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ పధకం కింద బుధవారం నుంచి రైతుల బ్యాంకు ఖాతాలను నేరుగా నిధులు జమ చేయనుంది. కోటి 53 లక్షల 53 వేల ఎకరాలకు యాసంగి రైతుబంధు నిధులు అందనున్నాయి. మొత్తం పదో విడతతో రూ.65,559.28 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పనుంది. గత వానాకాలం 65 లక్షల మంది అర్హులయిన రైతులకు రూ.7434.67 కోట్లు రైతుబంధు నిధులు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేసింది.
అన్నం పెట్టే అన్నదాత యాచించే స్థితిలో కాదు శాసించే స్థానంలో ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షగా ఈ పథకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత క్రమంలో అమలు చేస్తోంది.దేశంలో రైతు కేంద్రంగా పాలన సాగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణగా నిలిచిపోయింది. దేశంలోని తమిళనాడు, కర్ణాటక , కేరళ, మహరాష్ట్ర తదితర రాష్ట్రాల రైతలు తమ రాష్ట్రాల్లో కూడా రైతుబంధు తరహా పథకాలు అమలు చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై వత్తడి తెస్తున్నాయంటే ఈ పథకం ఫలితాలు వ్యసాయరంగాన్ని ఏవిధంగా మారుస్తున్నాయో స్పష్టమవుతుందంటున్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు పథకాన్ని స్పూర్తిగా తీసుకుని జాతీయ స్థాయిలో మోడి ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం అమలు చేస్తోంది. అయితే కేంద్రం పిఎం కిసాన్‌ను కంటితుడుపు పథకంగానే రైతుకు రూ.6వేలుగా అమలు చేస్తోంది. ఈ పథకం ప్రారంభం నుంచి ఒక్క పైసా పెంచకపోగా ఉన్న రైతుల సంఖ్యను కూడా కుదిస్తూ వస్తోంది.
అయితే కేసిఆర్ సర్కారు రైతుల సంక్షమమే లక్షంగా రాజకీయాలకు అతీతంగా ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ప్రారంభంలో ఉన్న రైతుల సంఖ్య అనూహ్యంగా పెంచుతూ వస్తోంది. 2018లో ప్రారంభమైన ఈ పథకం కింద అర్హత గల రైతుల ఏటా ఐదారు లక్షల మంది చేరుతున్నారు. పట్టాదారు పాస్ బుక్కు ఉన్న ప్రతిరైతుకు రైతుబంధు పధకంలో చేరి లబ్దిపోందే అవకాశం కల్పిస్తోంది. ఎకరానికి రూ.8వేలతో ప్రారంభించిన ఈ పథకం నాలుగేళ్లలోనే ఎకరానికి రూ.10వేలకు పెరిగింది.
రైతుబంధు, రైతుభీమా, సాగుకు ఉచిత కరంటు, సాగునీళ్లు రైతుల హక్కుగా ఎలుగెత్తి చాటుతున్న రైతుసర్కారుగా చరిత్ర సృష్టిస్తోంది.
దేశాన్ని పాలిస్తున్న పాలకులకు రైతుల పట్ల చిత్తశుద్ధికి రైతుబంధు పథకం పెద్ద సవాళ్లు విసురుతోంది. అబద్దపు హామీలతో గద్దెనెక్కిన నరేంద్రమోడీ ఎనిమిదన్నరేళ్లయినా ఒక స్పష్టమయిన వ్యవసాయ విధానాన్ని రూపొందించ లేకపోయారన్న విమర్శలు ఎదుర్కొంటోంది. ఉపాధిహామీకి వ్యవసాయం అనుసంధానం, 60 ఏళ్లు నిండిన రైతులకు ఫించను, పంటలకు మద్దతుధరల విషయంలో స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలు, 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు వంటి హామీల విషయంలో దేశ రైతాంగాన్ని దారుణంగా మోసంచేశారన్న అభిప్రాయాలు ప్రజల్లో బలపడుతున్నాయి.
రైతుల విషయంలో పాలకుల దృక్పధం మారాలని రాష్ట్రవ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. యాసంగి పంటల సాగులో నిమగ్నమవుతున్న రాష్ట్ర రైతాంగానికి బుధవారం నుంచి రైతుబంధు పథకం కింద అందనున్న నిధులు అర్ధికంగా ధైర్యం కల్పిచనున్నాయి.తొలిరోజు ఒక ఎకరం రైతుల ఖాతాలను నిధుల జమతో ప్రారంభించి ప్రతిరోజు ఎకరం వంతున పెంచుకుంటూ పోనున్నాను. సంక్రాంతి నాటికి ఈ పథకంలో ఉన్న రాష్ట్రంలోని రైతులందరికీ నిధులు అందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆర్ధిక ,వ్యవసాయ శాఖలకు చెందిన ఉన్నత స్థాయి అధికారులు ప్రతిరోజు ఈ పథకం ద్వారా నిధుల జమను పర్యవేక్షించనున్నారు.