Monday, December 23, 2024

సంచారులపై కమిషన్లు ఏమి చేశాయి?

- Advertisement -
- Advertisement -

సంచార జాతి ప్రజల అభివృద్ధి కోసం 2006లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా బాలకృష్ణ రేణుకే కమిషన్ వేసి 2008లోనే నివేదికలు తీసుకుంది. కానీ నిర్ణయం చెప్పలేదు. అలాగే బిజెపి పార్టీ అధికారంలోకి రాగానే 2015లో భీకురామ్ ఇదాటే కమిషన్ వేచింది. ఈ ప్రభు త్వం కూడా 2018లో నివేదికలు తీసుకుంది. ఇలా దేశంలో రెండు ప్రధాన పార్టీలు ఈ సంచార జాతి ప్రజల సమస్య సాధన కోసం జాతీయ స్థాయిలో కమిషన్ వేసి నిర్ణయం తీసుకోకపోవడం పైన సంచార జాతి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. స్వాతంత్య్రం వచ్చి వజ్రోత్సవాలు జరుపుకున్న ఈ దేశంలో ఇంకా మాకు న్యాయం ఎప్పుడు అందుతుంది అని ఎదురు చూస్తున్న సంచార జాతి ప్రజలను చులకనగా చూస్తున్న నేటి పాలకులను ఏమనాలో తెలియని నోరులేని అమాయక జీవులు ఈ సంచార జాతి ప్రజలు.

తరాలు గడిచినా, యుగాలు మారినా ఈ భూమిపై ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత దేశంలో కుల వ్యవస్థ నిర్మితమై ఉంది. కులాల మధ్య అంతరాలు, అడ్డుగోడలు ఉన్నాయి. పుట్టుకతోనే కులం ఆపాదించబడుతుంది. వ్యక్తి ప్రతిభ, సామర్థ్యం బట్టి తనకు నచ్చిన వృత్తిని ఎంచుకోవడం న్యాయం. కాని మన దేశంలో ఏ కులంలో పుడితే ఆ కులం వారి వృత్తినే చేయాలి అనే గత 3000 ఏండ్ల దేశ చరిత్ర చెపుతుంది. ఇంకా ‘కుల వృత్తి మానకురా గువ్వల చెన్న’ అనే సామెత కూడా విన్నాం. చరిత్రలో మన దేశాన్ని పాలించిన స్వదేశి రాజులుగాని, పరదేశి ముస్లిం రాజులు గాని, బ్రిటిష్ వారు గాని కుల వ్యవస్థనే కొనసాగించారు తప్ప, మార్చే ప్రయత్నం చేయలేదు. స్వాతంత్య్రం వచ్చాక ఏర్పాటు చేసుకున్న భారత రాజ్యాంగంలో కూడా కుల నిర్మూలన గూర్చి ఎక్కడా ప్రస్తావించ లేదు. కాని ఆర్టికల్ 17 ప్రకారం కేవలం అంటరానితనం నిషేధించబడిందని చెప్పబడింది.

అలాగే ఆర్టికల్ 15 ప్రకారం కుల, మత, లింగ వివక్షకు తావు లేదనీ చెప్పబడింది. కాని ఇప్పటి వరకు అమలు కాలేదనే నిజం మన కళ్ళ ముందున్న వాస్తవం. ఎందుకంటే నేటి మన 75 ఏళ్ళ స్వాతంత్య్ర దేశంలో సంచార జాతి ప్రజలకు ఇప్పటికీ 98% మందికి రేషన్ కార్డు, ఓటర్ కార్డు లేక తినటానికి తిండి లేక, ఉండటానికి ఇళ్ళు లేక, చేయటానికి పని లేక, చేతిలో చిల్లి గవ్వ లేక సమాజంలో నిర్లక్ష్యానికి, చీదరింపులకు, అవమానాలకు, వివక్షకు గురయ్యే అటువంటి జాతులు దేశం మొత్తంలో ఇంకా 1000 పైగా సంచార కులాలు ఉన్నాయి.

దేశ జనాభాలో 12 శాతం నుండి 15 శాతం వరకు సంచార జాతి ప్రజలు ఉన్నారనే విషయాన్ని 2008లోనే బాలకృష్ణ రేణుకే జాతీయ కమిషన్ నివేదికల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అందించారు. అలాగే భీకురామ్ ఇదాటే కమిషన్ కూడా ఇంచుమించు ఇలాంటి నివేదికనే ఇచ్చిందనేది నిజమని నమ్ము తున్నారు.ఈ విముక్త సంచార జాతుల అభివృద్ధి కోసం కావలసిన 72 ప్రత్యేక ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి బాలకృష్ణ రేణుకే అందించటం జరిగింది. వీటిని కేంద్ర ప్రభుత్వం అమలు చేసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరింది. కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వదిలేసింది. ఇప్పుడున్న బిజెపి ప్రభుత్వం మాత్రం ఆ కమిషన్ నివేదికలు పట్టించుకోకుండా.. సంచార జాతి ప్రజల అభివృద్ధి కోసమని కేంద్ర ప్రభుత్వం సీడ్ పథకమును రూపకల్పన చేసింది. ఈ పథకం క్రింద 2021-2022 నుండి 2025-2026 వరకు రూ. 200 కోట్ల నిధులు కేటాయించినట్లు ప్రకటించింది. ఈ పథకాల కోసం సంచార జాతి ప్రజలు ఇలా దరఖాస్తు చేసుకోవాలని ప్రచారం జరుగు తున్నది. కానీ ఈ ప్రచారం అధికార ప్రకటన అవునో, కాదో ఇంకా తెలియవలసి ఉంది.

పథకాలు ఇలా ఉన్నాయి

1. విద్యార్థుల ఉద్యోగ నైపుణ్యం శిక్షణకోసం రూ. 2,50,000/ 2. కుటుంబ ఆరోగ్య బీమా కోసం రూ. 5,00,000 3. ఇంటి నిర్మాణం కోసం 5,00,000 4. జీవనోపాధి కోసం రూ. 5,00,000 అని ఇలా ప్రచారం చేస్తున్నారు.
కానీ దేశ వ్యాప్తంగా సంచార జాతి ప్రజల జనాభా ఇంచు మించుగా బాలకృష్ణ రేణుకే కమిషన్ నివేదిక ప్రకారం దాదాపుగా దేశ జనాభాలో 12% నుండి 15 శాతం ఉన్నట్టు తెలుస్తున్నది. అంటే సంచార జాతి జనాభా దాదాపు 17 నుండి 21 కోట్ల మంది కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు రూ. 200 కోట్లు. అది కూడా 5 ఏళ్ళ కోసం అంటే కేంద్ర ప్రభుత్వానికి సంచార జాతి ప్రజల పట్ల ఉన్న శ్రద్ధ ఏపాటిదో కనబడుతున్నది.

అది కూడా సంచార జాతి ప్రజలు ఎవరు? అనే నిర్ధారణ కూడా ప్రకటించలేదు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచార జాతి ప్రజలు ఎవరు అనే ప్రశ్న అలాగే ఉంది. అధికార నిర్ణయం ఇంకా జరగనే లేదు. దేశ వ్యాప్తంగా సంచార జాతి ప్రజలపైన శాత్రియ ప్రక్రియ ద్వారా జాతీయ కమిషన్ నివేదికలు సిద్ధంగా ఉన్నా పట్టించుకోకుండా అర్థం పర్ధం లేని పథకాలు పెట్టి సంచార జాతి ప్రజలను అయోమయానికి గురిచేయ్యటం న్యాయంగా ఉందా అని కేంద్ర ప్రభుత్వాన్ని సంచార జాతి ప్రజలు అడుగుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలలో సంచార జాతి ప్రజల అభివృద్ధి కోసం వేసిన కమిషన్ నివేదికల ఆధారంగా కమిషన్ చేసిన ప్రతిపాదనలు అమలు చేసి న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా రు. సంచార జాతుల అభివృద్ధి కోసం కమిషన్ చేసిన కొన్ని ముఖ్యమైన ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి.

జనాభా లెక్కల సేకరణలో విముక్త జాతుల జనాభా వివరాలను సేకరించాలి. దేశంలో ప్రతి రాష్ట్రంలో జాతి, కులాల జాబితా తయారు చేయాలి. రాష్ట్ర, జిల్లా స్థాయి సలహా మండలిలో విముక్త జాతులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసే బిసి, మహిళా, మానవ, వివిధ కమిషన్‌లలో విముక్త, సంచార జాతి ప్రజలకు అవకాశం కల్పించాలి. ఈ జాతులకు ఆధార్, రేషన్, ఓటరు కార్డులు మంజూరు చేయాలి. అలాగే కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి. స్థిర నివాసాలు ఏర్పాటు చేసి కనీస సదుపాయాలు కల్పించాలి. విద్య కోసం తగిన విధంగా ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి. ఉపాధి కోసం కుటీర, చిన్న, పరిశ్రమల ఏర్పాటు చేసి తగిన ఆర్థిక సహాయం గ్రాంట్‌గా అందించాలి. అలాగే కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలలో సబ్ ప్లాన్ రూపొందించాలి. మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. షెడ్యూల్డ్ కులాల, జాతుల అత్యాచార నిరోధ చట్టం 1989 విముక్త జాతులు, కులాలకు వర్తింప చేయాలి.

విముక్త జాతి, కులాలకు అనుకూలంగా రాజ్యాంగాన్ని పార్లమెంట్ లోను, రాజ్యసభ లోను సవరణలు చేసి నామినేటెడ్ పదవుల్లో 10% తగ్గకుండా తప్పకుండ రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్స్ అవకాశం ఇవ్వాలి. ఈ విముక్త జాతుల అభివృద్ధి, సంక్షేమం దృష్టిలో ఉంచుకొని పార్లమెంట్, రాజ్యసభ సభ్యులకు ఇచ్చే లోకల్ డెవలప్‌మెంట్ ఫండ్‌లో 10% విముక్త జాతుల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టేలా చూడాలి. ఈ విముక్త జాతుల కోసం విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాల్లో ప్రత్యేకంగా జనాభా ప్రాతిపదికన 10% నుండి 15% వరకు రిజర్వేషన్స్ కల్పించాలి. కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలలో విముక్త జాతుల సమస్యలు, స్థితిగతులను అధ్యయనం చేయడానికి రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లను ఏర్పాటు చేయాలి.

విముక్త జాతులలో ఉన్న నైపుణ్యాలను, వైవిధ్యాలను కాపాడేం దుకు, ప్రదర్శించేందుకు రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల స్థాయి లో అకాడెమీలు, సముదాయాలు ఏర్పాటు చేయాలి. సంచార జాతుల జనాభా 17 కోట్ల నుండి 21 కోట్లు ఉన్నట్టు బాలకృష్ణ రేణుకే కమిషన్ నివేదిక ద్వారా తెలుస్తున్నది. అంటే దాదాపుగా దేశంలో 4 లేక 5 రాష్ట్రాలతో సమానమైన జనాభా అన్నట్టు. అయినా పట్టించుకున్నవారే లేరు. కారణం వారు అణగారిన, అట్టడుగు, అమాయక ప్రజలు కాబట్టి. మరి దేశంలో ఎక్కడుంది ప్రజాస్వామ్యం? ఏమి చేస్తున్నది ప్రభుత్వ యంత్రాంగం? పాలకులు కంటి తుడుపు చర్యగా 1947 నుండి 2022 వరకు తొమ్మిది కమిషన్లు వేసినా ఈ సంచార జాతి ప్రజలకు న్యాయం జరగలేదు.

ఈ దేశంలో ఇంకా అడుక్కుంటూ, పూట పూటకు కూటి కోసం కోటి కష్టాలు అన్నట్టుగా జీవితాలను వెళ్లదిస్తూ దినం ఒక యుగంగా, మనిషి పుట్టుక మీద విరక్తితో ఎందుకు పుట్టామురా దేవుడా అని బాధపడే ఈ సంచార జాతి బిడ్డల గోస పరిశీలన చేసి, పాలకులు మానవత దృక్పథంతో ఆలోచన చేసి, మిగిలి ఉన్న ఈ జాతి పిల్లల భావి భవిష్యత్తు కోసం బాలకృష్ణ రేణుకే కమిషన్ సమర్పించిన నివేదికను అమలు పరిచి, దేశ వ్యాప్తంగా ఉన్న ఈ సంచార, విముక్త జాతి కులాలకు రాజ్యాంగ బద్ధంగా, జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాల్లో 10 శాతం నుండి 15 శాతం వరకు రిజర్వేషన్లు కల్పించి, రాజ్యాంగపరంగా గుర్తింపు ఇచ్చి, సంచార జాతి ప్రజలు ఈ వ్యవస్థలో భాగమేనని ఈ ప్రజాస్వామ్య సమాజంలో గౌరవంగా జీవించే సమ న్యాయం అందిస్తారని ఆశిస్తూ…

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News