Friday, November 22, 2024

సులభ్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో ప్రజా శౌచాలయాల ప్రారంభకుడు, సులభ్ కాంప్లెక్స్ వ్యవస్థాపకుడు, టాయిలెట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగడించిన బిందేశ్వర్ పాఠక్ మంగళవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఒకనాడు పిల్లనిచ్చిన మామగారిచేత దూషణ, తిరస్కరణలు ఎదుర్కొన్న పాఠక్ తరువాతి కాలంలో అనేక ప్రభుత్వ, పౌర పురస్కారాలు పొంది దేశ విదేశాల్లో కీర్తిప్రతిష్టలు ఆర్జించారు. మంగళవారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం గుండెపోటుకు గురై 80 ఏళ్ల పాఠక్ కన్నుమూశారు.

1970లో సులభ్‌ను స్థాపించిన పాఠక్ బహిరంగ మలవిసర్జనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి విశేష కృషి చేశారు. బీహార్‌లోని వైశాలి జిల్లాకు చెందిన రాంపూర్ బఘేల్ గ్రామంలో ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన బిందేశ్వర్ పాఠక్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కళాశాల విద్య తర్వాత కొన్ని చిరు ఉద్యోగాలు చేసిన పాఠక్ 1968లో బీహార్ గాంధీ శతజయంతి ఉత్సవాల కమిటీ ,ఉందిప భంగి ముక్తి(పారిశుధ్య కార్మికుల విముక్తి) విభాగంలో చేరి దేశంలో పారిశుధ్య కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడారు.

తన పిహెచ్‌డి థీసిస్‌లో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటించి పారిశుధ్య కార్మికులతో మమేకమై వారితోనే కలసి జీవించారు. 1970లో సులభ్ ఇంటర్నేషనల్ అనే సామాజిక సేవా సంస్థను స్థాపించి మానవతా సిద్ధాంతాలకు సాంకేతిక సృజన జోడించి ప్రజా జీవితంలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం దేశంలో రైల్వే స్టేషన్లు, పుణ్యక్షేత్రాలతోసహా 1600 పట్టణాలలో 9 వేలకు పైగా సులభ్ కాంప్లెక్స్‌లు పని చేస్తున్నాయి. ప్రజల నుంచి నామమాత్రపు చార్జీలతో నడిచే ఈ సులభ్ కాంప్లెక్స్‌ల ద్వారా 2020లో రూ. 490 కోట్ల వార్షికాదాయం సంస్థకు లభించింది.

పాఠక్ అందచేస్తున్న సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్‌ను అందచేసింది. ఎనర్జీ గ్లోబ్ అవార్డు, దుబాయ్ ఇంటర్నేషనల్ అవార్డు, స్టాక్‌హోమ్ వాటర్ ప్రైజ్, ఫ్రెంచ్ సెనేట్ నుంచి లెజెండ్ ఆఫ్ ప్లానెట్ అవార్డు వంటి అంతర్జాతీయ అవార్డులు ఆయనకు లభించాయి. 2014లో సర్దార్ పటేల్ ఇంటర్నేషనల్ అవార్డు పొందిన పాఠక్ పోప్ జాన్ పాల్ 2 నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News