టోక్యో ఒలింపిక్స్‌కు తెరలేచింది
కనువిందు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు
టోక్యో: జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న విశ్వ క్రీడలు ఒలింపిక్స్‌కు శుక్రవారం తెరలేచింది. ప్రపంచ వ్యాప్తంగా 205 దేశాలకు చెందిన క్రీడాకారులు ఈ మెగా క్రీడల్లో పాలుపంచుకుంటున్నారు. ఇక శుక్రవారం ఆరంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కరోనా భయం నేపథ్యంలో ఈసారి ప్రేక్షకులు లేకుండానే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రీడల్లో పాల్గొంటున్న ఆయా దేశాల క్రీడాకారులు మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్నారు. భారత బృందానికి బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్, భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్‌దీప్ సింగ్ సారథ్యం వహించారు. ఇక ఆరంభోత్సవ వేడుకలను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ టివిల్లో తిలకించారు. ప్రతిసారి భారీ ఎత్తున జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కరోనా కారణంగా సాదాసీదాగా నిర్వహించక తప్పలేదు.
బాణాసంచా పేల్చి..నృత్య ప్రదర్శనలు.. లైట్‌షోల మధ్య ఆరంభోత్సవ కార్యక్రమం సాగింది. కాగా ఈ వేడుకలకు పరిమిత సంఖ్యలో అభిమానులు, రాజకీయ ప్రతినిధులు హాజరయ్యారు. జపాన్ చక్రవర్తి నరుహిటో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్; అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జపాన్ కళాకారులు నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు, ఫైర్‌వర్క్ కనువిందు చేశాయి. ఇదిలావుండగా ఈ క్రీడల్లో భారత్ తరఫున 127 క్రీడాకారులు బరిలోకి దిగారు. బ్యాడ్మింటన్, షూటింగ్, ఆర్చరీ, వెయిట్‌లిఫ్టింగ్, హాకీ, టిటి. బాక్సింగ్, రెజ్లింగ్, టెన్నిస్ తదితర క్రీడాంశాల్లో భారత అథ్లెట్లు పోటీ పడుతున్నారు. ఈసారి కూడా సింధుపై భారీ ఆశలు ఉన్నాయి. కిందటి ఒలింపిక్స్‌లో సింధు రజతం సాధించిన విషయం తెలిసిందే.