ఆశలు నిలిపిన సింధు, మేరీకోమ్, మనికా బాత్రా
టోక్యో: ఒలింపిక్స్‌లో ఆదివారం ఇండియాకు నిరాశ తప్పలేదు. బ్యాడ్మింటన్‌లో సింధు, బాక్సింగ్‌లో మేరీ కోమ్, టేమ్ టెన్నిస్‌లో మనికా బాత్రా తప్ప మిగతా వాటిలో మన వాళ్లు దారుణంగా విఫలమయ్యారు. ఆదివారం రెండు మెడల్ ఈవెంట్స్‌లోనూ ఇండియన్స్ కనీసం ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. బాక్సింగ్, టెన్నిస్‌లో మిశ్రమ ఫలితాలు రాగా.. షూటింగ్, హాకీ, టెన్నిస్‌లో దారుణమైన ఫలితాలు వచ్చాయి.
ప్రీక్వార్టర్స్‌లో మేరీ కోమ్
అటు బాక్సింగ్‌లో మేరీ కోమ్ శుభారంభం చేసింది. రౌండ్ ఆఫ్ 32లో మహిళల 51 కేజీల ఫ్లై వెయిట్ కేటగిరీలో విజయం సాధించింది. ఆదివారం డొమినికాకు చెందిన హెర్నాండెజ్ గార్సియా మిగులినాతో జరిగిన బౌట్‌లో 4:1 తేడాతో గెలిచి రౌండ్ ఆఫ్ 16లో అడుగుపెట్టింది. మూడు రౌండ్లలోనూ మేరీ కోమ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
సింధు శుభారంభం
భారత్ తరఫున రెండో రోజు బ్యాడ్మింటన్‌లో పివి సింధు శుభారంభం అందించింది. తొలి రౌండ్ మ్యాచ్‌లో ఆమె ఇజ్రాయెల్ ప్లేయర్ సెనియా పొలిక్‌పై 21-7, 21-10 తేడాతో ఈజీగా గెలిచింది. ఇక టెన్నిస్‌లో మనికా బాత్రా సంచలనం సృష్టించింది. రెండో రౌండ్‌లో 20వ సీడ్ ఉక్రెయిన్ ప్లేయర్ పెసోట్స్కాపై 4-3 గేమ్స్ తేడాతో విజయం సాధించింది. తొలి రెండు గేమ్‌లను కోల్పోయినా కూడా మనికా అద్భుతంగా పోరాడి 3, 4తోపాటు 6, 7 గేమ్స్ గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. గంట పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో4-11, 4-11, 11-7, 12-10, 8-11, 11-5, 11-7 తేడాతో మనికా బాత్రా గెలిచింది.
మిగతా వాటిలో నిరాశే..
ఆదివారం ఉదయాన్నే జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మను బాకర్, యశస్వి దేశ్వాల్ ఫైనల్ చేరడంలో విఫలమయ్యారు. బాకర్ 12, యశస్వి 13వ స్థానంతో సరిపెట్టుకున్నారు. అటు పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత షూటర్లు దీపక్ కుమార్ 26, డిఎస్ పన్వర్ 32 స్థానాలకే పరిమితమయ్యారు.
తొలి రౌండ్‌లోనే సానియా జోడీ ఓటమి
ఇక టెన్నిస్‌లో సానియా, అంకితా రాణా జోడీ తీవ్రంగా నిరాశ పరిచింది. తొలి రౌండ్‌లోనే ఈ డబుల్స్ జోడీ ఇంటి దారి పట్టింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో ఉక్రెయిన్‌కుచెందిన కిచునాక్ లియుద్ మ్యాలా-కిచునాక్ నదియా జోడీ చేతిలో 0-6, 7-6, (10-8) తేడాతో సానియా మీర్జా, అంకితా రైనా జోడీ ఓడిపోయింది.
పురుషుల బాక్సింగ్ 63 కేజీల విభాగం రౌండ్ ఆఫ్ 32లో భారత్‌కు చెందిన కౌశిక్ 1-4 తేడాతో బ్రిటన్ బాక్సర్ మెక్ కార్మాక్ చేతిలో ఓడిపోయాడు. టేబుల్ టెన్నిస్ మెన్స్ సింగిల్స్ జ్ఞానేశ్వరన్ సత్యన్‌కు షాక్ తగిలింది. అతడు హాంకాంగ్ ప్లేయర్ లామ్ సియు హాంగ్ చేతిలో 3-4 గేమ్స్ తేడాతో ఓడిపోయాడు. తన కంటే తక్కువ ర్యాంక్ ప్లేయర్ చేతిలో సత్యన్ ఓడిపోవడం షాక్‌కు గురిచేసింది. స్విమ్మింగ్‌లో భారత స్విమ్మర్ మానా పటేల్ నిరాశ పరిచింది. మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగం హీట్ 1లో ఆమె రెండో స్థానంలో నిలిచి సెమీ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న మానా పటేల్ ‘యూనివర్సిటాలిటీ కోటా’ కింద ఈ విశ్వ క్రీడల్లో పోటీ పడుతోంది.
Tokyo Olympics 2020: Mary Kom opened in 51 kg category