టోక్యో: జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌ను ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది. జపాన్‌లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో అక్కడ అత్యయిక(ఎమర్జెన్సీ)ని విధించారు. ఇదిలావుండగా ఈ నెల 23నుంచి ఒలింపిక్ క్రీడలు జరుగనున్నాయి. కాగా, క్రీడాకారుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకులు లేకుండానే క్రీడలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. గురువారం ఈ విషయాన్ని ఒలింపిక్ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.
టోక్యోతో సహా ఇతర నగరాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, ఇలాంటి స్థితిలో ప్రేక్షకుల సమక్షంలో క్రీడలను నిర్వహించడం సాధ్యం కాదని ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ అధ్యక్షురాల సికో హషిమోటో తెలిపారు. ఇది బాధాకరమైన అంశమే అయినా అథ్లెట్లు, సహాయక సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని విచారం వ్యక్తం చేశారు. మరోవైపు క్రీడలను ప్రత్యక్షంగా చూడాలని టికెట్లను కొన్న వారికి ఆమె క్షమాపణలు చెప్పారు. జపాన్‌లో డెల్టా వేరియంట్ తీవ్రంగా వ్యాపిస్తోందని, ఇలాంటి స్థితిలో కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదన్నారు. కాగా ఈ నెల 23న ప్రారంభమయ్యే ఒలింపిక్ క్రీడలు ఆగస్టు 8 వరకు కొనసాగనున్నాయి.
Tokyo Olympics 2021 to be held without Audience