టోక్యో: ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే కరోనా కలకలం సృష్టిస్తోంది. క్రీడలకు వేదికగా నిలిచిన టోక్యో నగరంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఆదివారం ముగ్గురు అథ్లెట్లు కరోనా బారిన పడ్డారు. వీరితో పాటు మరో ఏడుగురికి కరోనా సోకినట్టు క్రీడల నిర్వాహకులు వెల్లడించారు. ఇక ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో ముగ్గురు క్రీడాకారులు కరోనా బారిన పడడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. నిర్వాహకులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా కేసులు బయటపడుతుండడంతో ఒక్కసారిగా ఆందోళన వాతావరం ఏర్పడింది. ఇక దక్షిణాఫ్రికాకు చెందిన హాకీ క్రీడాకారులు కరోనా బారిన పడినట్టు తెలిసింది. అయితే అథ్లెట్ల వివరాలను ఇచ్చేందుకు నిర్వాహకులు నిరాకరించారు. కాగా, ఎన్ని అవరోధాలు ఎదురైనా షెడ్యూల్ ప్రకారం క్రీడలను నిర్వహించేందుకు జపాన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఎలాంటి ప్రతికూల పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారు స్పష్టం చేశారు.
Tokyo Olympics athlete Covid-19 infections