నిరాశ పరిచిన దీపిక.. గురితప్పిన మను బాకర్
టోక్యో: ఒలింపిక్ పతకం సాధించాలనే భారత ఆర్చర్ దీపికా కుమారి కల ఈసారి కూడా నెరవేరే పరిస్థితి లేకుండా పోయింది. శుక్రవారం జరిగిన మహిళల ఆర్చరీ వ్యక్తిగత విభాగం క్వార్టర్ ఫైనల్లో దీపిక ఓటమి పాలైంది. దీంతో ఆర్చరీలో భారత్‌కు పతకం లభిస్తుందని ఆశలు పెట్టుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. ఇక దీపిక ముచ్చటగా మూడోసారి ఒలింపిక్ బరిలోకి దిగిన ఒక్కసారి కూడా పతకం సాధించడంలో విఫలమైంది. ఇక తాజా ఒలింపిక్స్‌లో కూడా క్వార్టర్ ఫైనల్ దశలోనే ఓటమి పాలైంది. కొరియా ఆర్చర్ యాన్‌సాన్‌తో జరిగిన పోరులో దీపికకు ఘోర పరాజయం చవిచూసింది. టాప్ సీడ్ యానసాన్ 60 తేడాతో దీపికను చిత్తు చేసింది. అంతకుముందు ప్రీ క్వార్టర్ ఫైనల్లో మాజీ ప్రపంచ నంబర్‌వన్ సెనియా పెరోవాపై దీపిక విజయం సాధించింది. ఇక షూటింగ్‌లోనూ భారత్‌కు నిరాశే మిగిలింది. స్టార్ షూటర్ మను బాకర్ మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఫైనల్‌కు చేరడంలో విఫలమైంది. పేలవమైన ప్రదర్శన కనబరిచిన మను బాకర్ 15వ స్థానంతో సరిపెట్టుకుంది. మరో షూటర్ రహి సర్నోబత్ 32 స్థానానికి పరిమితమైంది. బాక్సింగ్‌లో సిమ్రన్‌జిత్ కౌర్ పరాజయం పాలైంది. అథ్లెటిక్స్‌లో ద్యుతిచంద్ కనీసం సెమీఫైనల్‌కు కూడా అర్హత సాధించలేక పోయింది. 100 మీటర్ల విభాగంలో ద్యుతి చంద్ 45వ స్థానంలో నిలిచింది.
Tokyo Olympics: Deepika Kumari defeated by Korean Archer