Friday, November 22, 2024

చంద్రగ్రహణ వేళ

- Advertisement -
- Advertisement -

Tolerating the YCP aggression is causing trouble for Chandrababu

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉద్వేగాన్ని ఆపుకోలేక విలపించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతను కలగజేసింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన రెండవ రోజే ఈ సంఘటన జరగడం అందరికీ దిగ్భ్రాంతిని కలిగించింది. తనను శాసనసభలో దూషిస్తున్నారు అని, తన భార్య భువనేశ్వరిని సైతం అసభ్యంగా మాట్లాడినారంటూ తీవ్ర విచారంతో శాసనసభ సమావేశాలను చంద్రబాబు బహిష్కరించాడు. అంతేకాదు తాను తిరిగి ముఖ్యమంత్రి అయ్యాకే శాసనసభలోకి ప్రవేశం చేస్తానని శపథం చేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్ లో కేవలం 175 మంది శాసనసభ్యులు ఉన్న అసెంబ్లీ లో గత ఏడేళ్ల కాలం నుంచి నేటి వరకు జరుగుతున్న వ్యవహారాలు కానీ, సభ్యుల ప్రసంగాలు కానీ, ప్రజాస్వామ్యవాదులకు రుచించేవిగా లేవు. ఆ మధ్య ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ గెరిల్లా వార్ ఫేర్ అన్న పదం తరచుగా వినిపించేది. బహుశా ఆ పదాన్ని అధికార, ప్రతిపక్ష నాయకులు తిట్లు, దుర్భాషలు, బూతులు కలిపి విమర్శలు చేసుకోవడంగా అర్థం చేసుకున్నట్లు ఉన్నారు. కొడాలి నాని, పేర్ని నాని, కన్నబాబు, అంబటి రాంబాబు, రోజా, కొమ్మారెడ్డి పట్టాభిరాం, దేవినేని ఉమా, బుద్ధా వెంకన్న, లోకేష్, వంగలపూడి అనితలు తరచుగా తమ విమర్శలలో అవసరం లేకపోయినా దుర్భాషలు చొప్పిస్తున్నారు.

ఈ బృందానికి అదనంగా అయ్యన్నపాత్రుడు జత కలిశాడు. నర్సీపట్నం రాజకీయాలను దాటి ఇతర విషయాలను పట్టించుకోని అయ్యన్న కూడా ఈ మధ్య అదుపు తప్పుతూ తరచూ దుర్భాషలతో అగ్గి రాజేస్తున్నాడు. పై బృందం తమ విమర్శలో ఎంత సంయమనం పాటిస్తే అంతగా ఆంధ్రప్రదేశ్‌లో తేలిక వాతావరణం ఏర్పడి ఆరోగ్యకరమైన రాజకీయాలను చేసుకోవచ్చును. రాజకీయ గెరిల్లావార్ ఫేర్‌లో చంద్రబాబు మనస్సు గాయపడినట్లుంది. అయినప్పటికీ కెమెరాల ముందు చంద్రబాబు ఆపుకోలేకపోయిన దుఃఖానికి అసెంబ్లీలో జరిగిన వ్యవహారమే కారణం కాబోదు. చంద్రబాబు ధైర్యాన్ని చెదరగొట్టడానికి దారితీసిన మరికొన్ని కారణాలను కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత రాజకీయాలలో చంద్రబాబు అత్యంత నిస్సహాయుడు. సమయం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అన్నట్లు చంద్రబాబు గత కొన్ని నెలలుగా అత్యంత దయనీయ స్థితిలో రాజకీయాలను నెట్టుకొస్తున్నాడు. గతంలో ఆయన రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే దాదాపు ఒక దశాబ్దం పాటు దేశ రాజకీయాలలో చక్రం తిప్పి తనదైన ముద్ర వేసిన అపర చాణక్యుడు.

యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ హోదాలో దేశ ప్రధానులుగా దేవేగౌడ, ఐకె గుజ్రాల్ ని నియమించినవాడు. అటు ఎన్‌డిఎ కన్వీనర్ హోదాలో ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్‌పేయి ఎంపికకు భాగస్వామ్య రాజకీయ పక్షాలను సమన్వయం చేసిన వాడు. రాష్ట్రపతిగా అబ్దుల్ కలాంను సూచించిన దార్శనికుడు. చంద్రబాబు ఎంతటి ప్రతిభావంతుడైన అవకాశవాద రాజకీయాలతో ప్రస్తుతం ఆయన గత కాలపు భుజకీర్తులు వెలసిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసిపి దూకుడును తట్టుకోవడం చంద్రబాబుకు ఇబ్బందిని కలిగిస్తున్నది. స్థానిక పరిపాలన సంస్థలు, పట్టణ, నగరపాలక సంస్థల కు జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 13 నగర పాలక సంస్థలు అధికార పార్టీ వశం కావడం జరిగింది. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనే కుప్పం మునిసిపాలిటీని వైసిపి గెలుచుకోవడం బాబుకు రాజకీయంగా ఇబ్బందిని కలుగచేసింది. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం కార్పొరేషన్‌ల పై తెలుగుదేశం పార్టీ ఆశలు పెట్టుకుంది.

గుంటూరు జిల్లాలోని ఒక ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గా ఎంపిక చేసినా గుంటూరు ఓటర్లు కార్పొరేషన్ ఎన్నికల్లో పట్టం కట్టక పోవడం, తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచే సామాజిక వర్గం మెజారిటీ గా ఉన్నప్పటికీ విజయవాడ కార్పొరేషన్‌లో ఓడిపోవడం చంద్రబాబును దిగ్భ్రాంతికి గురి చేసింది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై విశాఖ ప్రజలు తమ ఆగ్రహాన్ని అధికార వైసిపిపై చూపిస్తారని ఫలితంగా విశాఖపట్నం కార్పోరేషన్‌లో మెజారిటీ స్థానాలు తెలుగుదేశం పార్టీకి వస్తాయని చంద్రబాబునాయుడు వేసిన అంచనాలు తలకిందులు కావడం జరిగింది. మిగిలిన 10 కార్పోరేషన్‌లో కూడా గౌరవప్రదమైన స్థానాలు లభ్యం కాకపోవడం టిడిపికి శరాఘాతంగా మారింది. తిరుపతి పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కనీసం పోటీని కూడా ఇవ్వలేకపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో వరుసబెట్టి జరిగిన ఎన్నికలలో వచ్చిన ఫలితాలు చంద్రబాబును రాజకీయంగా అయోమయానికి గురి చేశాయి. ఆయనకు మానసికంగా మరో దెబ్బ రాజధాని అమరావతి రూపంలో తగిలింది. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాతగా అమరావతి రూపశిల్పిగా చరిత్ర పుటలలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన చంద్రబాబు వైభవం మసకబారి పోయింది.

రాజధాని ఉద్యమం ఎంత ఎగదోసిన 29 గ్రామాలను దాటి రాలేకపోతున్నది. న్యాయస్థానం టు దేవస్థానం యాత్ర కూడా ఆశించిన ప్రయోజనం కలిగించడంలో అంతగా సఫలీకృతం కాలేకపోతున్న విషయం కూడా చంద్రబాబును విచలిత మనస్కుని చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యంత దుర్భరమైన పరిస్థితులు ఉంటే జాతీయంగా కూడా చంద్రబాబుకు అండగా నిలిచి ఆదుకునే రాజకీయ పార్టీలు గానీ, బాబు కోసం కదిలి వచ్చే నాయకులు కానీ లేకపోవడం అత్యంత విషాదం. ఆ మధ్య బోసిడికే పదం సృష్టించిన కలకలం అందరి స్మృతి పథంలో ఉండే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై అధికార వైసిపి నాయకులు చేసిన దాడిని గురించి ఫిర్యాదు చేయడానికి చంద్రబాబు ఢిల్లీ వెళితే ఒక్క రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తప్పించి ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులు ఒక్కరు కూడా ఆయనను కలవలేదు. ఒకప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన చంద్రబాబుకు అత్యంత చేదు ఫలితాలు రుచి చూపించిన సంఘటన ఇది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లు చంద్రబాబు రాజకీయ జీవితంతో పోల్చుకుంటే చాలా తక్కువ స్థాయి జూనియర్లు.

వారిద్దరూ కూడా చంద్రబాబుకు అపాయిట్‌మెంట్ ఇవ్వకపోవడం గమనార్హం. బాబుకు రాజకీయ వ్యూహ నిపుణుడు గొప్ప పేరు ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చివరి నిమిషం వరకూ జగన్ నేతృత్వంలోని వైసిపి అధికారంలోకి వస్తుందని అంచనాలు ఉండేవి. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అధైర్యపడకుండా అటు నరేంద్రమోడీ ఇమేజ్‌ను ఇటు జనసేన పవన్ కళ్యాణ్ తోడ్పాటును పొంది మితిమీరిన ఆత్మ విశ్వాసంతో ఉన్న జగన్‌ను ఎదుర్కోవడం జరిగింది. ఎన్నికల ప్రచారం ముగింపుకు వచ్చేసరికి క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసి కాపులకు బిసిలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తానని సరైన సమయంలో హామీ ఇవ్వడం చంద్రబాబు ఫ్రీ పోల్ మేనేజ్‌మెంట్ చతురతను తెలియజేస్తోంది.

ఆ ఎన్నికల్లో అత్యంత నైపుణ్యంతో తగిన వ్యూహాలను అమలు చేసి వెంట్రుకవాసిలో బాబు అధికారంలోకి రాగలిగారు. అంత సూక్ష్మంగా ప్రజల నాడిని పసికట్టగలిగిన అదే చంద్రబాబు అనాలోచితంగా తనతో కలిసి వచ్చిన పొత్తు పార్టీలను వదులుకొని 2019 ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయడం చంద్రబాబు రాజకీయంగా చేసిన ఘోర తప్పిదంగా విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ చుట్టుముట్టిన రాజకీయ విపత్కర పరిస్థితులను చూసి తన నిస్సహాయతను దుఃఖించాల్సిన అవసరం చంద్రబాబుకు లేదు. ఆయన ఎప్పుడూ చెపుతుంటారు, సంక్షోభాలకు కృంగిపోను వాటిని అవకాశాలుగా మలుచుకుని మరింత పైకి ఎదుగుతానని. భవిష్యత్తు ఆశాజనకంగా ఉండటానికి ఈ ఆత్మ విశ్వాసం చాలు.

                                                                                        * రత్నకుమారి
                                                                                        9398122089

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News