Saturday, December 28, 2024

మార్పు ఇంటి నుంచే మొదలు కావాలి

- Advertisement -
- Advertisement -

Toll free number 181 for resolving women's issues

మహిళల పట్ల మగవారి ఆలోచన విధానాల్లో మార్పు రావాలి
ఏడాది కాలంలో 65 శాతం సమస్యలకు పరిష్కారం
పోలీస్‌స్టేషన్ వెళ్లాల్సిన అవసరం లేదు.. 181కు కాల్ చేస్తే చాలు
రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి

హైదరాబాద్ : రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో సఖి కేంద్రాలున్నాయని, మహిళలు పోలీసుస్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా 181 టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి తమ సమస్య చెప్పుకోవచ్చని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మహిళా సమస్యలపై టి- సాట్ స్టూడియో వేదికగా జరిగిన ప్రత్యేక ప్రత్యక్ష్య ప్రసార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. టి సాట్ సీఈఒ రాంపురం శైలేష్ రెడ్డి తొలుత తన కార్యాలయంలో టి శాట్ నిర్వహణ తీరుపై ఛైర్‌పర్సన్‌కు వివరించారు. అనంతరం జరిగిన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ మహిళలు ప్రతి పనికి మగవారిపై ఆధార పడకుండా స్వతంత్రంగా ఎదిగే నైపుణ్యాన్ని, స్వీయరక్షణ పెంచుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేక శ్రద్ధతో మహిళా కమిషన్ ఏర్పాటు చేసి మహిళలకు భరోసా కల్పించారని గుర్తు చేశారు.

కమిషన్ ఏర్పడిన సంవత్సర కాలంలో 492 సమస్యలు కమిషన్ దృష్టికి రాగా 306 సమస్యలకు పరిష్కారం చూపామని, 50 జంటలు కౌన్సిలింగ్ కోసం వస్తే 30 జంటల ఇబ్బందులు పరిష్కరించి వారి కుటుంబాలు కలిసి జీవించేలా కమిషన్ పనిచేసిందన్నారు. పోలీస్‌స్టేషన్లలో మహిళలను విచారించే సమయం సాయంత్రం ఆరు గంటలలోపే ఉండాలని ఫోన్ కాలర్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ పోలీసు శాఖ డిజితో మాట్లాడి సమయ వేళ్లల్లో ఖచ్చితమైన ఆదేశాలివ్వాలని సూచిస్తానని చెప్పారు. జిల్లాల్లో షీ టీమ్స్ పెంచాలని, ఉమెన్ జైల్స్ తదితర మహిళలకు సంబంధించిన రక్షణ విషయాల్లో ఇప్పటికే పోలీసు శాఖకు పలు సూచనలు చేశామన్నారు. మహిళల పట్ల మగవారి ఆలోచన విధానాల్లో మార్పు రావాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. మార్పు ఇంటి నుంచి మొదలై సమాజ మార్పునకు దోహదపడాలని సూచించారు.

రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో సఖి కేంద్రాలున్నాయని, మహిళలు పోలీసు స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా 181 టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి తమ సమస్య చెప్పుకోవచ్చని సూచించారు. ‘ఆడపిల్ల వద్దనే భావన నుంచి ఆడ పిల్ల ముద్దు’ అనే అభిప్రాయానికి వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను చైతన్య పరిచిందన్నారు. కార్యక్రమంలో కమిషన్ సెక్రటరీ కృష్ణకుమారి, లీగల్ కౌన్సిలర్ సునీతదేవి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News