భారీగా బిడ్లు దాఖలు చేసిన దిగ్గజ సంస్థలు
హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్)పై టోల్‌ట్యాక్స్ వసూలు ద్వారా ఏడాదికి రూ. 600ల నుంచి రూ.700ల కోట్ల ఆదాయం లభిస్తుందని హైదరాబాద్ నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండిఏ) అంచనా వేస్తోంది. ఆ మొత్తం కంటే ఎక్కువకు టెండర్లు కోట్ చేసిన సంస్థకే టోల్ బాధ్యతలను అప్పగించనున్నట్టు తెలిసింది. పలు జాతీయ సంస్థలు ఓఆర్‌ఆర్ టోల్‌పై ఆసక్తి చూపడంతో ఇప్పటికే దిగ్గజ సంస్థలు ఓఆర్‌ఆర్ టోల్ కోసం బిడ్లు వేసినట్టుగా తెలిసింది. టెక్నికల్ బిడ్లను పరిశీలించి అర్హత ఉన్న సంస్థలను హెచ్‌ఎండిఏ అధికారులు ఎంపిక చేసినట్టుగా సమాచారకం. గతంలో ఈగల్ ఇన్‌ఫ్రా సంస్థ టోల్ బాధ్యతలు చూస్తుండగా, ఆ సంస్థ టెండర్ గతేడాది సెప్టెంబరుతో ముగిసింది. కొవిడ్ లాక్‌డౌన్ కారణంగా నష్టం వచ్చిందంటూ ఆ సంస్థ చేసిన విజ్ఞప్తి మేరకు టెండర్ గడువును ఏడాది కాలం పొడిగించారు.
ఆ సమయం కూడా ముగిసిపోవడంతో అధికారులు కొత్తగా టెండర్లను ఆహ్వానించారు. ఈగల్ సంస్థ హెచ్‌ఎండిఏకు నెలకు రూ. 24.20 కోట్లు చెల్లిస్తుండగా అప్పట్లో రూ. 26 కోట్లను కోట్ చేసిన సంస్థకు టెండర్ ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అప్పట్లో రోజుకు 1.20 లక్షల వాహనాలు ఔటర్‌పై ప్రయాణించేవి ప్రస్తుతం ఆ సంఖ్య 1.40 లక్షలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఏడాదికి రూ. 600ల నుంచి రూ.700 కోట్ల ఆదాయం వస్తుందని హెచ్‌ఎండిఏ అంచనా వేస్తోంది. గతంలో నెలకోసారి చెల్లింపులు కాకుండా ఏడాదిలో కొన్ని విడతల్లో చెల్లింపులు చేసేలా ఈ సారి టెండర్ నిబంధనలను హెచ్‌ఎండిఏ సవరించింది. ప్రస్తుతం ఎవరికీ టెండర్ వచ్చింది, ఎంతకు కోట్ చేశారన్న విషయాన్ని తెలియచేయడానికి ఓఆర్‌ఆర్ టోల్ బాధ్యతలను చూసే ఎస్‌ఈ రవీందర్ నిరాకరించారు. తనకు పైనుంచి ఉత్తర్వులు ఉంటేనే తెలియచేస్తానని ఆయన తెలిపారు.