హైదరాబాద్: రేపటి నుంచి టోల్‌ట్యాక్‌లు పెరుగనున్నాయి. ఈ మేరకు జాతీయ రహదారుల అథారిటీ రంగం సిద్ధం చేసింది. సగటున 4.5 శాతం వరకు టోల్ ట్యాక్సులు పెరుగనున్నాయి. అయితే హైవేలపై ఉన్న టోల్‌గేట్లతో పాటు ఓఆర్‌ఆర్‌పై కూడా ఈ టోల్ చార్జీలు పెరగనున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలతో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయి. తాజాగా టోల్ ఛార్జీలను పెంచడంతో కూరగాయలు, నిత్యవసరాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం జాతీయ రహదారులపై ప్రతి కిలోమీటర్‌కు రూ.2.19గా ఉండగా తాజాగా పెంపుతో అది 3 రూపాయలకు పెరుగుతుంది. తెలంగాణలో ఉన్న జాతీయ రహదారులపై 32 టోల్‌గేట్లు ఉన్నాయి. వాటి ద్వారా రూ.1800 కోట్లకుపైగా టోల్‌ట్యాక్స్ వసూలు అవుతుంది. 9 ఏళ్లలో కేంద్రం టోల్చార్జీలను 300 శాతం పెంచగా, ఏటా 5 నుంచి -10 శాతం వరకు కేంద్రం టోల్ ట్యాక్సులను పెంచుతోంది. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు ఏటేటా పెరుగుతున్నాయి.
టారిఫ్ ధరలు రూ.10ల నుంచి రూ.60ల వరకు పెంపు
జాతీయ రహదారులపై తిరిగే అన్ని రకాల వాహనాల (బైక్ మినహా) టారిఫ్ ధరలను రూ.10 రూ.60ల వరకు ఎన్‌హెచ్‌ఏఐ పెంచింది. ఈ క్రమంలోనే ఎన్ హెచ్ 65 మీదుగా హైదరాబాద్ టు విజయవాడ వెళ్లిరావడానికి వాహనదారులు భారీ మొత్తంలో టోల్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ హైవేపై రూ. 465 చెల్లిస్తున్నారు. అయితే, ఏప్రిల్ 01వ తేదీ నుంచి రూ.490 చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఈ లెక్కన రూ.25 టోల్ ఛార్జీని అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఈ రూట్ లో పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్‌ప్లాజాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ హైవేపై ఒకవైపు ప్రయాణానికి రూ.310 చెల్లిస్తుండగా, ఇకపై రూ.325లు చెల్లించాలి. మినీబస్సులు, లైట్ మోటార్ వాణిజ్య, సరకు రవాణా వాహనాలు, భారీ, అతి భారీ వాహనాలపై ప్రస్తుతం వసూలు చేస్తున్న మొత్తానికి అదనంగా 5 శాతం కట్టాలి.
ఓఆర్‌ఆర్‌పై కొత్త టోల్‌చార్జీల అమలు
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 29 టోల్‌ప్లాజా ఛార్జీలను పెంచింది. జాతీయ రహదారుల రుసుము (రేట్లు, వసూళ్ల నిర్ణయం) రూల్స్, 2008 ప్రకారం, ఫీజు రేట్లు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డుపై టోల్ చార్జీలు ఏప్రిల్ 1 నుంచి మార్చి 31, 2024 వరకు అమల్లో ఉండేలా ధరలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అధికారులు నిర్ణయించారు.
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతియేటా పెంచే టోల్ చార్జీల నిబంధనల మేరకు ఓఆర్‌ఆర్‌పై కొత్త టోల్‌చార్జీలను అమలు చేయనున్నారు. నగరం చుట్టు 158 కి.మీ పొడవునా ఉన్న ఓఆర్‌ఆర్‌పై 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు ఉన్నాయి. కొత్తగా మరో మూడు ఇంటర్‌ఛేంజ్‌లను నిర్మిస్తున్నారు.