Sunday, December 22, 2024

వరద బాధితులకు సినీ ప్రముఖుల విరాళం

- Advertisement -
- Advertisement -

గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయారు. వీరిని ఆదుకోవటానికి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కష్టపడుతున్నాయి. వీరికి తెలుగు చిత్ర పరిశ్రమ బాసటగా నిలుస్తోంది.
మెగాస్టార్ రూ.కోటి విరాళం…
మెగాస్టార్ చిరంజీవి తన వంతు సాయంగా ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షలు.. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షలను వరద బాధితుల సహాయార్థం విరాళంగా ప్రకటించారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తమ వంతు సాయం అందించటానికి హీరో చిరంజీవి ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఈక్రమంలో చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు సాయంగా రూ.కోటి విరాళాన్ని అందించారు.

“తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం వుంది. ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాలలో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను” అని పేర్కొన్నారు చిరంజీవి.

రెండు రాష్ట్రాలకు పవన్ రూ.6 కోట్ల భారీ విరాళం…
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా సంభవించిన విధ్వంసాన్ని చూసి చలించిపోయిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ భారీ విరాళం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి విరాళం అందించారు. అలాగే పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నందున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద ముంపు బారిన పడ్డ 400 పంచాయతీలకు.. ఒక్కో పంచాయతీకి రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ.4 కోట్లు విరాళం అందజేశారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ ఇరు తెలుగు రాష్ట్రాలకు కలిపి వ్యక్తిగతంగా రూ. 6 కోట్ల భారీ మొత్తాన్ని విరాళంగా ప్రకటించడం విశేషం.

రెబల్ స్టార్ భారీ సాయం…
రెబెల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అండగా నిలబడేందుకు ముందుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం ప్రభాస్ 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు కోటి రూపాయలు, తెలంగాణకు కోటి రూపాయల చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రభాస్ విరాళం ఇచ్చారు.
రామ్‌ చరణ్ కోటి విరాళం…
వరద భీభత్సంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఊహించని విధంగా ఆస్తినష్టం జరిగింది. ఈ క్రమంలో హీరో రామ్‌చరణ్ సైతం తనవంతుగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఇందులో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.50 లక్షలు, తెలంగాణ ప్రభుత్వానికి రూ.50 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. “వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా, అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇది. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను”అని పేర్కొన్నారు రామ్‌చరణ్.

అక్కినేని కుటుంబం, గ్రూప్ కంపెనీస్ సాయం…
వరద బాధితులని ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో యాభై లక్షల రూపాయలను విరాళంగా అందించాయి అక్కినేని కుటుంబం, గ్రూప్ కంపెనీస్. “ఈ సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తాము. వరద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ప్రజలకు తక్షణ సహాయం చేరాలని కోరుకుంటున్నాం. బాధిత ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాం”’అని అక్కినేని కుటుంబం పేర్కొంది.

అల్లు అర్జున్ కోటి విరాళం…
సామాజిక సేవలతో పాటు, ఎవరికైనా ఆపద వస్తే ఆపన్నహస్తం అందించే వారి జాబితాలో ముందుంటారు హీరో అల్లు అర్జున్. ఇంతకు ముందు పలు మార్లు తన సహాయంతో మంచి మనసు చాటుకున్న ఈ కథానాయకుడు మరోసారి తన ఉదారతను చూపాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరద ముంపులో చిక్కుక్కుని సహాయం కోసం ఎదురుచూస్తున్న వరద బాధితుల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అహర్నిశలు శ్రమిస్తూ వారిని ఆదుకుంటున్నాయి. ఇక వరదల వల్ల సర్వం కోల్పోయిన బాధితుల కోసం హీరో అల్లు అర్జున్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి తన వంతు సహాయంగా కోటి రూపాయల విరాళం అందించారు.

వైజయంతీ మూవీస్ విరాళం…
వరద బాధితుల సహాయార్థం ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 20 లక్షలు విరాళాన్ని ప్రకటించింది.
అలీ దంపతుల సాయం…
“తెలుగు రాష్ట్రాలకు వరదల వల్ల ఎంతగా నష్టం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల పరిస్థితిని చూసి నేను, నా భార్య జుబేదా ఎంతో బాధపడ్డాం. మా వంతుగా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఆరు లక్షల రూపాయలను (ఆంధ్రప్రదేశ్‌కు 3 లక్షలు, తెలంగాణకు 3 లక్షలు) ముఖ్యమంత్రి సహాయనిధికి అందచేస్తాం”అని ప్రముఖ నటుడు అలీ అన్నారు.
సిఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు…
వరద బాధితులను ఆదుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాన్ని అందించిన మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్ తదితరులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News