సాగు చట్టాల నిలిపివేతపై కేంద్ర మంత్రి తోమర్
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను ఏడాది నుంచి ఏడాదిన్నర వరకు నిలుపుదల చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను ఉన్నతమైన ప్రతిపాదనగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అభివర్ణించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు త్వరలోనే పునరాలోచించుకుని తమ నిర్ణయాన్ని తెలియచేయగలరన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
11 విడతల చర్చలు జరిగినప్పటికీ ప్రభుత్వం, 41 రైతు సంగాల మధ్య జరిగిన చర్చలు అసంపూర్తిగానే మిగిలాయి. 10వ విడత చర్చల సందర్భంగా ప్రభుత్వం ఒక మెట్టు దిగి వ్యవసాయ చట్టాలను ఏడాది నుంచి ఏడాదిన్నర పాటు నిలిపివేస్తామన్న ప్రతిపాదన ముందుకు తెచ్చింది. కాగా..దీన్ని రైతు సంఘాలు తిరస్కరించాయి. 11వ విడత చర్చలలో ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై పునరాలోచించి తమ తుది నిర్ణయాన్ని తెలియచేయవలసిందిగా రైతు సంఘాలను కోరింది. రైతు సంఘాలకు ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చిందని, తమలో తము చర్చించుకుని తమ తుది నిర్ణయాన్ని వారు తెలియచేస్తారని ఆశిస్తున్నామని తోమర్ తెలిపారు.
కాగా.. 11వ విడత చర్చల అనంతరం ఇక తదుపరి చర్చలు ఉండబోవని తోమర్ సూచనప్రాయంగా వెల్లడించారు. అయితే ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై రైతుల తుది నిర్ణయాన్ని తెలుసుకోవడానికి వారితో సమావేశమవుతానని ఆయన చెప్పారు. కాగా.. జనవరి 26న దేశ రాజధానిలో తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీ అనంతరం రైతు సంఘాలు తమ తుది నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియచేసేదీ లేనిదీ వేచిచూడాల్సి ఉంది. ఇలా ఉండగా..వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ జనవరి 27న రైతులు, వ్యవసాయ సంఘాలతో రెండవ విడత చర్చలు జరపనున్నది.