న్యూఢిల్లీ : ఎడతెరిపిలేని వర్షాలతో సరఫరా దెబ్బతిని కూరగాయల ధరలు చాలా ప్రాంతాల్లో భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఢిల్లీ వంటి నగరాల్లో కిలో టమాటా రూ.200 దాటి పోయింది. ఇదే విధంగా మిగతా కూరగాయల ధరలు కూడా పెరిగాయని వ్యాపారులు వెల్లడించారు. భారీ వర్షాలతో పంట పండే భూముల్లో నీరు నిలిచిపోయింది. దీంతో నేల అడుగున పండే ఉల్లి, అల్లం తోపాటు నిల్వ ఉండని టమాటా వంటి కూరగాయల పంటలు దెబ్బతింటున్నాయని వ్యాపారులు చెప్పారు. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ డేటా ప్రకారం దేశం మొత్తం మీద టమాటా సరాసరి టోకు ధర సోమవారం రూ. 104.38 వరకు పలికింది. స్వాయి మధోపూర్‌లో గరిష్ఠ ధర కిలో రూ. 200 కాగా, రాజస్థాన్ చురులో కనీస ధర కిలోకు రూ. 31 వరకు ఉంది. మెట్రో నగరాల్లో టమాటా ధరలు పరిశీలిస్తే కోల్‌కతాలో కిలో రూ.149, ముంబైలో రూ. 135, చెన్నైలో రూ. 123, ఢిల్లీలో రూ. 100 వరకు ఉన్నాయి. టమాటా, ఇతర కూరగాయల ధరలు నాణ్యత, విక్రయ స్థలం బట్టి పెరుగుతున్నాయి.
గత రెండు రోజులుగా ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తుండడంతో సరఫరా మరింత దెబ్బతింటుందని, భారీ వర్షాలు ఇలాగే కొనసాగితే ఇంకా ధరలు పెరుగుతాయని అజాద్ పూర్ టొమాటో అసోసియేషన్ అధ్యక్షులు , అశోక్ కౌశిక్ పేర్కొన్నారు.అజాద్‌పూర్ మండీలో సోమవారం టమాటా ధర కిలో రూ. 100 నుంచి 160 వరకు ఉంది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కూడా ఇదే డిమాండ్ సాగుతోంది. అజాద్‌పూర్ హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో 160 వంతున అమ్ముతున్నారని, రిటైల్‌గా కిలో రూ. 170 వరకు ఉంటోందని కౌశిక్ పేర్కొన్నారు. ఢిల్లీలో మరికొందరు కిలో రూ. 200 వంతున అమ్ముతున్నారని పశ్చిమ విహార్ లోని స్థానిక రిటైల్ వ్యాపారి జ్యోతిష్ ఝా చెప్పారు. ఉల్లి, అల్లం, బంగాళా దుంపలు, ఫ్రెంచి బీన్స్, కాలీఫ్లవర్, క్యాబేజి, రేట్లు కూడా కొంత పెరిగాయని చెప్పారు. చాలా కూరగాయలు కిలో రూ. 60 కు పైగానే ఉన్నాయి. ఉదాహరణకు బెండకాయ కిలో రూ. 80 వరకు ధర పలుకుతోంది. అలాగే దోస కిలో రూ. 60 ఉంటోంది. కాలీఫ్లవర్ కిలో రూ.180 వరకు పెరిగింది. అల్లం ధరలు కిలో రూ.240 నుంచి 300 వరకు పెరిగాయి.