సంపన్నుల నుండి సామాన్యుల వరకు దాదాపు ప్రతి రోజు వినియోగించే కూరగాయలలో టమాటా ఒకటి. సొలనేసి కుటుంబానికి చెందిన ఈ విదేశీ కాయగూర ప్రపంచంలో మొదట ఎక్కడ పెరిగిందో సరిగ్గా తెలియనప్పటికీ అమెరికాలోని పెరువియా, మెక్సికో ప్రాంతాల నుండి విస్తరించిందంటారు. 1850లలో భారతదేశంలో ప్రవేశించినట్లుగా భావించే టమాటాకి ‘సీమ వంగ’, ‘రామ ములగ’ అనే తెలుగు పేర్లున్నప్పటికీ చాలా మంది తెలుగు వారికి ఈ విషయం తెలియదు. టమాటా సాగులో భారతదేశం ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉంది. మన దేశంలో బంగాళాదుంపలు, ఉల్లిపాయలు తరువాత టమాటాలు అతి ముఖ్యమైన పంట. గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, తమిళనాడు, ఒడిషా, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలలో టమాటా సాగు చేస్తున్నారు.
భారత దేశంలో గత సంవత్సరం టమాటా ఉత్పత్తి మొత్తం 204.25 లక్షల టన్నులు కాగా, 2,744.32 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అతిపెద్ద టమాటా- ఉత్పత్తిదారుగా అవతరించింది. నిన్నమొన్నటి వరకూ చుక్కల్ని తాకిన టమాటా ధర ఒక్కసారిగా పడిపోయింది. సెప్టెంబర్, అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలతో పంటలు దెబ్బతిని ధర అమాంతం పెరిగితే ఇప్పుడు కొనేవాళ్లు లేక పారబోయాల్సి వస్తోంది.డిమాండ్, సరఫరాలో అంతరం, వర్షపాతం, ఉత్పత్తి కాలానుగుణత, చీడపీడల వల్ల దిగుబడి తక్కువగా ఉండటం, రాబడి తక్కువగా ఉండటం వల్ల రైతులు టమాటా సాగుకు విముఖంగా ఉండడం లాంటి కారణాల వలన ధరలలో హెచ్చుతగ్గులు సంభవిస్తుంటాయి. దీనితో పాటు దేశవ్యాప్తంగా విస్తరించిన టమాటా సాగు జూన్ నుండి ఆగస్టు, అక్టోబర్ నుండి నవంబర్ లాంటి నెలల్లో మందకొడిగా ఉండడం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతుంది. తెలుగు రాష్ట్రాలలో మొన్నటి వరకు రూ. 70 నుండి రూ. 100 చేరువైన కిలో టమాటాను ఇప్పుడు వ్యవసాయ మార్కెట్లలో కనీసం రూపాయి ధరకి కూడా కొనడం లేదు.
మూడు నెలల క్రితం అకాల వర్షాలతో పంటలు నష్టపోవడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రధానంగా కర్నూలు, మదనపల్లి మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున సరఫరా అయ్యే టమాటాలో అంతరాయం ఏర్పడి ధరలు అమాంతం పెరిగాయి. అయితే సాధారణ పరిస్థితి నెలకొని డిసెంబర్‌లో కొత్త పంట చేతికి వచ్చే సరికి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. టమాటా, ఉల్లిపాయలు, బంగాళాదుంపల పంటలకు ప్రత్యేకమైన పంటకాలం ఉండటంతో ఇవి పంటల లభ్యత ఆధారంగా ధరల హెచ్చుతగ్గులను సృష్టిస్తాయి. ఈ పంటల సాగు ఎక్కువభాగం కొన్ని రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమై ఉన్నందున ఈ ప్రాంతాల్లో ఆయా కాలంలో వచ్చే దిగుబడి, మార్కెట్ అంశాలు లేదా వాతావరణంలో సంభవించే మార్పులు దేశవ్యాప్తంగా ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అనిశ్చిత రుతుపవనాలు, తెగుళ్లు లేదా వ్యాధుల వలన పంట దిగుబడి తగ్గడంతో అది ఉత్పత్తి చక్రం అనిశ్చితికి దారితీసి గణనీయంగా ధర అస్థిరతకు కారణమవుతుంది.ప్రత్యేకంగా టమాటా పాడైపోయే స్వభావం, పరిమిత నిల్వ సామర్థ్యాలు, మౌలిక సదుపాయాల లేమి కూడా ధరల హెచ్చుతగ్గులను తీవ్రతరం చేస్తాయి. వీటన్నిటికి తోడు డిమాండ్ -సరఫరాలో అంతరం కూడా ధరల హెచ్చుతగ్గులపై ప్రభావం చూపుతాయి.
టమాటా ధరలలో అధిక అస్థిరత రైతులకు ఆదాయంలో అనిశ్చితికి దారితీస్తుంది. పంట చేతికి వచ్చిన సందర్భాలలో కూడా ఆ తర్వాత ధరలు భారీగా పతనమైతే మంచి దిగుబడి వచ్చినా రైతులు నష్టపోయే అవకాశం ఉంటుంది. దీని పర్యవసానంగా ఇది తరువాతి సీజన్‌లో ఈ పంటలను వేయకుండా రైతులను నిరుత్సాహపరుస్తుంది. ఇక్కడ చక్రీయ ద్విగ్విషయం (సైక్లికల్ ఫినామినా) గురించి వివరంగా చెప్పాలంటే, 2021లో తమ దిగుబడులకు ధర తక్కువ పలకడం వల్ల రైతులు టమాటోలను తక్కువ విస్తీర్ణంలో నాటి సోయా, పత్తి , మొక్కజొన్న వంటి ఇతర పంటల వైపు మళ్లారు. దీని చక్రీయ ప్రభావం సీజన్‌లో ధరల అస్థిరతకు, తరువాతి నెలల్లో సరఫరా కొరత కారణంగా అధిక ధరలకు దారితీసింది. మార్కెట్, వాతావరణ పరిస్థితులకు కూడా రైతులు నష్టపోతుంటారు. ఈ అనిశ్చితి వారిని తీవ్ర మనోవేదనకు గురిచేస్తుంది. ప్రత్యేకించి చిన్న, సన్నకారు రైతులు ఆర్థిక ఒడిదొడుకులను తట్టుకునే పరిమిత సామర్థ్యం కలిగి ఉంటారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండి, టమాటాకు మంచి డిమాండ్ ఉంటుందన్న ఆశాభావంతో రైతులు వారివారి ఆర్ధిక స్థోమత మేరకు విస్తారంగావేసి అధిక దిగుబడి సాధించిన సందర్భాలలో కూడా మార్కెట్లో అధిక సరఫరా కారణంగా ధరలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ పరిస్థితులలో రైతులు తమ శ్రమ ఫలించి మంచి దిగుబడి వచ్చినప్పటికీ, మంచి లాభాలు అటుంచి గిట్టుబాటు ధర కూడా దక్కకపోవడంతో హతాశులవుతారు.
ఎంతో శ్రమకోర్చి తమ ఉత్పత్తులను పొలాల నుండి మార్కెట్లకు తరలిస్తే, రవాణా ఛార్జీలు కూడా దక్కకపోతే, నష్టానికి అమ్ముకోలేక ఇతర గత్యంతరం లేక రోడ్లపై పారబోయాల్సిన దుస్థితి తలెత్తుతుంది. టమోటాలు, ఉల్లిపాయలు, బంగాళదుంపల ధరల అస్థిరత నుండి రైతులు, వినియోగదారులకు ఊరట కలిగించడానికి ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ కమిటీలతో పాటు మరిన్ని ప్రైవేట్ మండీల సంఖ్యను పెంచడం, గరిష్ట ఉత్పత్తి సమయాలలో ధరల క్షీణత కారణంగా నష్టాలను నివారించేందుకు దేశవ్యాప్తంగా శీతల గిడ్డంగుల (కోల్ స్టోరేజీ) మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడం, సరఫరాను స్థిరీకరించేందుకు, నష్టాల వల్ల ఉత్పన్నమయ్యే అనిశ్చితి కారణంగా వ్యవసాయదారులను ఆర్థిక నష్టాలనుండి రక్షించే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని విస్తృతంగా అమలు చేయడం, దళారుల ప్రమేయాన్ని వీలైనంత మేర తగ్గించి ప్రభుత్వ వ్యవస్థలు మధ్యవర్తిగా వ్యవహరించడం లాంటి చర్యల ద్వారా వినియోగదారుల ప్రయోజనాలను కాపాడడమే కాకుండా రైతులకు ఆహారం, ఆర్థిక భద్రత కల్పించడం సాధ్యమవుతుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే కాయగూరను మనందరి కోసం ఎంతో శ్రమకోర్చి సాగు చేసే రైతుల ప్రయోజనార్థం ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టి వారికి బాసటగా నిలవాలి.
యేచన్ చంద్రశేఖర్
88850 50822