Monday, December 23, 2024

కేరళలో టమోటో ఫ్లూ కలకలం

- Advertisement -
- Advertisement -

Tomato flu outbreak in Kerala

మనతెలంగాణ/హైదరాబాద్ : మరో అంతుచిక్కని వ్యాధి కలకలం మొదలైంది. కేరళలో వెలుగు చూసిన టమాటో ఫ్లూ గురించి వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 80 మంది చిన్నారులకు ఈ అరుదైన వైరల్ వ్యాధి సోకింది. కొన్ని మరణాలు కూడా నమోదయ్యాయి. కేరళలోని కోల్లాం ప్రాంతంలో ఈ వ్యాధి విస్తరిస్తుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరోవైపు ఈ ఇన్‌ఫెక్షన్ ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు.

టమాటో ఫ్లూ అంటే

ఇది అరుదైన వ్యాధి. ఇంతకు ముందు ఏయే దేశాల్లో, ప్రాంతాల్లో సోకిందనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే ఏ కారణం చేత వ్యాపిస్తుంది అనేదానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. పిల్లల శరీరంపై ఎర్రటి రంగులో దద్దుర్లు, బొబ్బలతోపాటు తీవ్రమైన జ్వరం వస్తున్నాయి. అంతేకాకుండా దురద, డీహైడ్రేషన్, దగ్గు, తుమ్ములు, ముక్కుకారడం, కాళ్లు-చేతుల రంగుమారడం, ఒళ్లు నొప్పులు, కీళ్ల వాపులు, అలసట లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలు చికెన్ గున్యా మాదిరిగానే ఉన్నాయి. పిల్లల శరీరంపై వస్తున్న దద్దుర్లు టమాటా మాదిరిగా ఉంటున్నాయి. అందుకే ఈ వ్యాధికి టమాటా వైరస్ అని పేరు పెట్టారు. అంతుచిక్కని ఈ వ్యాధి నియంత్రణకు పరిశుభ్రత చాలా ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా ఐదేళ్లలోపు చిన్నారుల మీదే ఈ ఫీవర్ ప్రభావం కనిపిస్తోంది. కేరళలోని కోల్లాంతో పాటు దక్షిణ ప్రాంతాలైన అర్యన్‌కావు, అంచల్, నెడువతుర్ ప్రాంతాల్లోనూ కేసులు నమోదు అవుతున్నాయి. టమాటో ఫ్లూ పై పరిశోధనల అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఇన్‌ఫెక్షన్ సోకిన పిల్లలకు.. ఇతర పిల్లలను దూరంగా ఉంచాలని, డీహైడ్రేషన్ కాకుండా జాగ్రత్తపడాలని, అలాగే వైద్య పర్యవేక్షణలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

సరిహద్దులో నిఘా

ఈ మిస్టరీ వ్యాధి కలకలంతో.. సరిహద్దు రాష్ట్రం తమిళనాడు అప్రమత్తం అయ్యింది. ఇరు రాష్ట్రాల ప్రయాణాలపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ ఇన్‌ఫెక్షన్ వేగంగా వ్యాప్తిస్తుండడంతో జాగ్రత్తగా ఉండకపోతే తీవ్ర నష్టం తప్పదని వైద్యాధికారులు చెప్తున్నారు. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కొయంబత్తూరు(తమిళనాడు) ప్రవేశించే దారుల గుండా పరీక్షలు మొదలుపెట్టారు. ప్రయాణికులు.. ముఖ్యంగా పిల్లలను పరిశీలించేందుకు ఇద్దరు ప్రత్యేక వైద్యాధికారులను నియమించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News