కోల్‌కతాలో కిలో రూ 82పైనే
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో టమాటల ధరలు విపరీతంగా పెరిగాయి. దేశ రాజధాని మార్కెట్లలో టమాట ధరలు ఒక్క నెల వ్యవధిలో 44 శాతం ఎగబాకాయి. ఇప్పుడు కిలో రూ 46గా పలుకుతోంది. ముంబైలో టమాటల ధరలు కిలోకు రూ 72 కాగా , కోల్‌కతాలో ఈ ధర కిలోకు రూ 82 అయింది. ఇక చెన్నైలు ఇంతకు ముందు కిలోకు రూ 73 వరకూ ఉన్న ధర ఇప్పుడు తగ్గి రూ 58కు చేరుకుంది. అయితే కొన్ని ప్రాంతాలలో టమాటల ధరలు రూ వంద దాటాయని మార్కెట్ ధరల వివరణలతోనే వెల్లడైంది. దక్షిణ భారతదేశంలో పంట దిగుబడి తగ్గడం, ఇందుకు ప్రధాన కారణాలుగా వడగాడ్పులు, సుదీర్ఘ కాలపు వేడిమి తీవ్రత కారణమని వెల్లడైంది. పంట తగ్గడంతో సరఫరాలపై ప్రభావం పడి వినియోగదారులకు టమాట ఎక్కువ ధరకు చేరుకొంటోంది. మే నెలలో ఢిల్లీలో టమాట ధరలు కిలోకు రూ 30 అంతకు తక్కువగా పలికాయి. అయితే ఇప్పుడు దాదాపు రూ 50 దశకు చేరుకుంటున్నాయి. అయితే మదర్ డైరీ స్టోర్స్ ఇతర సూపర్ మార్కెట్లలో రేట్లు రూ 60 దాటింది. వినియోగదారుల విభాగం వెబ్‌సైట్ ధరలను తక్కువగా చూపుతోంది. అయితే సరఫరా తక్కువగా ఉండటంతో వీధులలో తిరిగి అమ్ముకునే వారు రూ 60 చొప్పున విక్రయిస్తున్నారు.