న్యూఢిల్లీ : టొమాటో ధర ఒక్కసారి భగ్గుమనడానికి మోడీ ప్రభుత్వ తప్పుడు విధానాలే కారణమని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. వర్షాల కారణంగా టొమాటో సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని, దాంతో అనేక నగరాల్లో రిటైల్‌మార్కెట్లలో ధర ఆకాశానికి అంటుతోందని హోల్‌సేల్, రిటైల్ వ్యాపారస్తులు ఆరోపిస్తున్నారు. టొమాటో ధర పెరగడంపై మీడియా కథనాన్ని ట్విటర్‌లో జత చేస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ప్రధాని మోడీని తీవ్రంగా విమర్శించారు.
టొమాటో, ఉల్లి, బంగాళా దుంపల ధరలను అదుపు చేయడం తమ అత్యధిక ప్రాధాన్యంగా ప్రధాని మోడీ చెబుతుంటారని, కానీ ఆయన తప్పుడు విధానాలే ఈ పరిస్థితికి దారి తీశాయని ఆరోపించారు. “మొదట రోడ్లపై టొమాటోలు పారవేయబడ్డాయి… ఆ తరువాత కిలో రూ. 100 కు అమ్మకం అవుతున్నాయి.” అని ఆయన ఎద్దేవా చేశారు. నిత్యావసరాల ధరలు పెరగడంపై కాంగ్రెస్ కేంద్రాన్ని తీవ్రంగా విమర్శించింది. సామాన్య ప్రజానికానికి ఊరట కలిగించండని కేంద్రాన్ని కోరింది.