Monday, December 23, 2024

టమాటే బంగారమాయే!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వ్యవసాయ రంగంలో పంటల సాగు.. విస్తీర్ణం.. ఉత్పత్తి.. ప్రణాళికల్లో కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలు సామాన్యుడి పాలిట శాపంలా మారుతున్నాయి. చుక్కలు తాకుతున్న టామాటా ధరలే అందుకు అద్దం పడుతున్నాయి. గత రెండు వారాలుగా దేశమంతటా టామాటా ధరలు మండిపోతున్నాయి. ధరల నియంత్రణలో మోడి సర్కారు ప్రేక్షక పాత్ర వహిస్తోందన్న విమర్శలు మిన్నంటుతున్నాయి . వ్యవసాయ ,ఉద్యాన శాఖలతోపాటు మార్కెటింగ్ ,వినియోగదారుల మంత్రిత్వ శాఖలను తన గుప్పిట్లో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం పని తీరులో మాత్రం పేరుగొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా మారింది . ప్రపంచ దేశాల్లో టమాటా పంట సాగు ఉత్పత్తిలో చైనా ప్రధమ స్ధానంలో ఉండగా ,ఇండియా ద్వితీయ స్థానంలో ఉంది. దేశంలో బంగాళా దుంప ,ఉల్లి తర్వాత టామాటా మూడవ ముఖ్యమైన పంటగా ఉంది. జాతీయ స్థాయిలో టామాటా సాగు ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాలే కీలకంగా ఉన్నాయి. ఆంధప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాల నుంచే దేశంలోని టామాటా ఉత్పత్తిలో 20 శాతం వాటా ఈ రాష్ట్రాల నుంచే ఉంది.

దేశవ్తాప్తంగా ఏటా 193.97లక్షల మెట్రిక్ టన్నుల టామాటా పంట దిగుబడి ఉండగా, అందులో తెలంగాణ నుంచి 901.53వేల మెట్రిక్ టన్నులు ,ఆంధప్రదేశ్ నుంచి 3146.96వేల మెట్రిక్ టన్నుల పంట పదిగుబడి లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా 4048.44 వేల మెట్రిక్ టన్నుల పంట దిగుబడితో జాతీయ స్థాయిలో 20.87శాతం ఈ రెండు రాష్ట్రాలే టమాటా పంట దిగుబడిని అందిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల తర్వాత 2511 వేల టన్నులు పంటదిగుబడితో జాతీయ స్థాయిలో 12.95శాతం వాటాతో మధ్యప్రదేశ్ మూడవ స్థానంలో ఉండగా, కర్ణాటక 1775.79వేల టన్నుల పంట దిగుబడి, 9.16శాతం వాటాతో మూడవ స్థానంలో నిలిచింది. ఇక ఆ తర్వాత స్థానాల్లో గుజరాత్ , ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రా, చత్తిస్‌గఢ్ ,బీహార్ రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ , హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ , జార్ఖండ్ రాష్ట్రాల్లో టామాటా పంట సాగవుతున్నా పంట దిగుబడి నామమాత్రంగానే ఉంది.
కేంద్రం ప్రోత్సాహం కరువు!
టమాటా పంట సాగులో కేంద్ర ప్రభత్వం నుంచి ఎటు వంటి ప్రోత్సాహం లభించటం లేదు. టమాటా పంట సాగు దేశంలో జూదంలా మారింది. ధరలు పెరిగితే ఆ సీజన్‌లో టామాటా రైతుకు జాక్‌పాట్ తగిలినట్టే. మార్కెట్లో ధరలు పడిపోతే రైతుల పెట్టుబడి అంతా తుడిచిపెట్టకుపోయి నెత్తిన గుడ్డేసుకోవాల్సివస్తోంది. కిలో టామాటాకు రూపాయిక కూడా లభించటం లేదు. పొలంలో కోత కూలి ఖర్చులు కూడా దండగే అని టామాటా కాయలు కోయకుండా పొలం మీదే వదిలిపెడుతున్నారు. మార్కెట్‌కు తీసుకుపోతే రవాణా చార్జీలు కూడా లభించని పరిస్థితుల్లో రోడ్ల వెంటే టన్నుల కొలది టమాటాలు పారబోసిన సందర్భాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో కళ్లకు కడుతుంటాయి. టామాట ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలని రైతులు దశాబ్దాల తరబడి కొరుతూ వస్తున్నా కేంద్రం నుంచి ఉలుకూ పలుకూ లేకుండా పోయింది.
ధరయంత్రణలో విఫలం
కూరగాయలు పాలు వంటివి నిత్యావసర సరుకుల జాబితాలో ఉన్నప్పటికీ వాటి ధరలు రైతులకు నష్టాలు నషాలానికంటేంతగా కనిష్ట స్థాయికి పడిపోకుండా , వినియోగదారులకు కంటనీరు పెట్టించేంతగా గరిష్ట స్థాయికి పెరిగిపోకుండా వాటి ధరలను నియంత్రించాల్సిన ప్రధాన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైనే ఉంది. ధరల సంక్షోభం తలెత్తకుండా పంటల సాగు ,ఉత్పత్తి , రవాణ తదితర ముందస్తు ప్రణాళికతో రాష్ట్రాలకు ,తద్వారా రైతులకు దిశా నిర్దేశం చేయాల్సిన కేంద్రం ఆ బాధ్యను మరిచిపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. నిత్యావసర ధరల నియంత్రణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది కాదని, టామాటా ధరల పెరుగుదల పాపాం.. నియంత్రణలో వైఫల్యం కేంద్రానిదే అని ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య బహిరంగంగానే ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ఇతర కూరగాయల ధరలు కూడా టమాటా బాటలోనే పయనిస్తున్నాయి.
ప్రధాన నగరాల్లో టామాటా ధరలు
దేశంలోని అన్ని ప్రాంతాల్లో టమాటా ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుల ఉన్నాయి. ఆదివారం వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో టామాటా ధరల మార్కెట్‌ను పరిశీలిస్తే కేరళలోని తిరువనంతపురం, సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో అత్యధికంగా కిలో రూ.130 ఉండగా , దేశరాజధాని ఢిల్లీలో రూ.120, ఆర్ధిక రాజధాని ముంబైలో రూ.108, కలకత్తాలో రూ.100,చెన్నైలో 117, బెంగూళూరులో రూ.90, హైదరాబాద్‌లో రూ.98, ఆమరావతిలో రూ.50 చొప్పున విక్రయాలు జరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News