ప్రతిపక్షాలకు ఓటు వేస్తే ఆ పార్టీల నేతల కుటుంబాలు బాగుపడతాయని, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే ప్రజలు క్షేమంగా వుంటారని ప్రధాని నరేంద్ర మోడీ భోపాల్ సభలో మంగళవారం నాడు ప్రకటించారు. ప్రతిపక్షాలన్నీ అవినీతిపరులతో నిండిపోయి వున్నాయని విమర్శించారు. రానున్న లోక్‌సభ ఎన్నికలకు, మధ్యప్రదేశ్‌లో ఈ సంవత్సరాంతంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఆ విధంగా ఆయన తన పార్టీ తరపున ప్రచార శంఖాన్ని పూరించారు. దేశంలో నేడున్న వాస్తవ పరిస్థితిని గమనిస్తే ప్రజలు, వారి కుటుంబాలు భారతీయ జనతా పార్టీ హయాంలో ఎంత ఆనందంగా వున్నారో సమగ్రంగా అవగాహన అవుతుంది. ఇంటింటి కూరగాయ టమాటా ధర కిలో రూ.100 దాటి అమ్ముతున్నది. ఇది ఏ ఒక్క రాష్ట్రానికో, నగరానికో పరిమితం కాలేదు. దేశమంతటా ఒకే విధంగా టమాటా ధర మండిపోతున్నది. రాజధాని ఢిల్లీలోనైతే మరింత ఘాటుగా వుందని సమాచారం. ఒక్క టమాటాయే కాదు, అన్ని కూరగాయల ధరలూ మితిమించిపోయాయి. బీన్స్, చిక్కుడు, పచ్చిమిర్చి తదితరాల ధరలు పట్టపగ్గాలు లేకుండా పరుగెడుతున్నాయి.
ఈ ధరలతో సామాన్య కుటుంబాలు ఎలా బతకగలుగుతాయనే యోచన చేయకుండా తమ పాలనలో ప్రజలు సుభిక్షంగా వుంటారని మోడీ ఎలా అనగలుగుతున్నారో, ఆయనలో ఏ కోశాన అయినా మానవీయ ఆలోచన మెదిలే అవకాశముందో లేదో తెలియడం లేదు. ఇంతగా సాగుతున్న ధరల విజృంభణ వెనుక కారణాలేమిటో ప్రజలకు ప్రధాని మోడీ ప్రభుత్వం చెప్పగలదా! సాధారణంగా కనీస ధర కూడా పలకని నేపథ్యంలో రైతులు కుప్పలు కుప్పలుగా రోడ్డు మీద పారేసే టమాటా ఇప్పుడిలా ఎందుకు పేట్రేగిపోతున్నది? వాతావరణ పరిస్థితుల వల్లనే ఈ కూరగాయలకు ఇంత డిమాండ్ పెరిగిపోయిందనేది కొంత వరకు వాస్తవమే. టమాటా గత మార్చిలో కిలో రూ. 5 10 అమ్మింది. ఏప్రిల్‌లో రూ. 5 15 కాగా, మేలో దారుణంగా పడిపోయి కిలో రెండున్నర రూపాయలకు కూడా లభించింది. ఇంతలోనే వంద ఆపైకి చేరుకొని సాధారణ ప్రజలు కొని తినే అవకాశం లేని దుస్థితిని కలిగిస్తున్నది. ఒక్క ఉల్లి, బంగాళా దుంపలు మినహా మిగతా కూరగాయలన్నింటి ధరలూ విపరీతంగా పెరిగిపోయాయి. కిలో బీన్స్ రూ. 120140 అమ్ముతున్నాయి.
క్యారెట్ రూ. 100, క్యాప్సికమ్ రూ. 80 అంటే కూరగాయల మార్కెట్‌లోకి అడుగు పెట్టే సాహసాన్ని సామాన్యులు చేయగలరా? ధరలిలా పెరిగిపోతున్నప్పుడు ద్రవ్యోల్బణాన్ని అరికడతానని రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ ప్రగల్భాలు పలుకుతున్నారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి దించుతానని ఆయన ప్రకటించారు. 2024 లో అది 5.1 శాతం వద్ద వుంటుందని, ఆ తర్వాత దానిని 4 శాతానికి దించడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి రిజర్వు బ్యాంకు చేసే ప్రయత్నాలేవీ గతంలో ఫలించలేదు. ఇక ముందు ఫలించే అవకాశాలు దాదాపు లేవు. ప్రభుత్వం పని కట్టుకొని దొంగ నిల్వలను అరికట్టగలిగినప్పుడే ధరలు భూమి మీదికి వస్తాయి. టమాటా ఏడాదికి రెండు సార్లు పండుతుంది. ఖరీఫ్‌లో 89 లక్షల హెక్టార్లలో సాగయ్యే టమాటాను రబీ సీజన్‌లో 5 లక్షల హెక్టార్లలో పండిస్తారు. నిల్వ వుంచడానికి వీల్లేని ఈ పంటకు ధర కిలో 50 పైసలకు కూడా పడిపోయిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ఈ స్థాయికి చేరుకోడానికి వేరే కారణాలేవైనా వున్నాయా? శీతల గిడ్డంగుల్లో నిల్వ వుంచడం ద్వారా ధరను కావాలని మండిస్తున్నారా తెలుసుకోవలసి వుంది. ఈ ఏడాది ప్రారంభంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోడానికి ఆహార ధరల పెరుగుదలే కారణమని తెలుస్తున్నది.
అయితే ఇంధన ధరలు పరిమితంగా వుండడం వల్ల ద్రవోల్బణం కూడా అదుపులో వుంటుందని చెబుతున్నారు. ఎన్నికలు చేరువలో వున్నందున ధరలను అదుపులోకి తీసుకు రావడానికి పాలకులు ప్రయత్నించాలి. అయితే అందులో ప్రధాని మోడీ ప్రభుత్వం ఇంత వరకు విజయవంతమైన దాఖలాలు లేవు. కరోనా దేశ ప్రజలను కాల్చుకు తిన్న రోజుల్లో కూడా వారికి ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోడానికి బదులు రైల్వే తదితర రంగాలను ప్రైవేటుకు చవకగా ధారాదత్తం చేయడానికే కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. ప్రజలు కరోనాతో బాధపడుతున్నప్పుడు తమ చర్యలకు నిరసన ఎదురు కాదనే ధైర్యంతో విచ్చలవిడి ప్రైవేటైజేషన్‌కు పాలకులు పాల్పడ్డారు. అటువంటి పాలకులు ఇప్పుడు ధరలను తగ్గిస్తారని, తగ్గించగలరని ఆశించలేము. టమాటా, తదితర కూరగాయల ధరలు ఇప్పట్లో తగ్గవని వెలువడుతున్న జోస్యాలు మరింత భయపెడుతున్నాయి. వచ్చే నెల, నెలన్నర వరకు టమాటా ధరలు దిగిరావంటున్నారు.