ముంబయి: ఇటీవలి కురిసిన భారీ వానల కారణంగా కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పెరిగిన టొమోటో ధరలు మరో రెండు నెలలపాటు కిందికి దిగిరావు అని క్రిసిల్ పరిశోధన సంస్థ శుక్రవారం తెలిపింది. టొమాటోను అత్యధికంగా పండించే కర్ణాటకలో పరిస్థితి చాలా ఘోరంగా ఉందని, మహారాష్ట్రలోని నాసిక్ నుంచి కర్ణాటకకు కాయగూరలను పంపించడం జరుగుతోందని తెలిపింది. సాధారణ స్థాయికన్నా అత్యధిక వానలు కర్ణాటకలో (సాధారణం కన్నా 105 శాతం అధికం), ఆంధ్రప్రదేశ్‌లో (సాధారణం కన్నా 40 శాతం అధికం), మహారాష్ట్రలో (సాధారణం కన్నా 22 శాతం అధికం)గా కురియడంతో చేతికొచ్చిన పంట సర్వనాశనమైపోయింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో ఈ రాష్ట్రాలే కూరగాయలను సప్లయ్‌చేయడంలో కీలకంగా వ్యవహరిస్తుంటాయి.
నవంబర్ 25 నుంచి ధరలు 142 శాతం పెరిగాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ పంట జనవరి నాటికి మార్కెట్‌లోకి వచ్చే వరకు మరో రెండు నెలలపాటు పెరిగిన ధరలు అలాగే ఉండి దిగకపోవచ్చని క్రిసిల్ పరిశోధన సంస్థ తెలిపింది. ప్రస్తుతం కిలో టొమాటో ధర రూ. 47గా ఉంది. కొత్త పంట మార్కెట్‌లోకి రావడం మొదలయ్యాక 30 శాతం దిగొచ్చని కూడా తెలిపింది. సెప్టెంబర్‌తో పోల్చినప్పుడు ఉల్లి ధర 65 శాతం పెరిగింది. మహారాష్ట్రలో ఆగస్టులో తక్కువ వానలు కురియడమే ఉల్లి కొరతకు కారణమని తెలిపింది. అయితే మరో 10 నుంచి 15 రోజుల్లో హర్యానా నుంచి తాజా ఉల్లి మార్కెట్‌లోకి వస్తాయని దాంతో ఉల్లి ధర దిగొస్తుందని కూడా తెలిపింది. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, గుజరాత్‌లలో అత్యధిక వర్షపాతం నమోదయిన కారణంగా మరో రబీ పంట అయిన ఆలుగడ్డల ధర కూడా బాగా పెరిగిపోయింది. ఇలాగే వానలు అత్యధికంగా పడుతుంటే మరో రెండు నెలలపాటు కూరగాయల ధరలు దిగిరాకపోవచ్చని సమాచారం.