లక్నో: సమాజ్‌వాది కార్యకర్తలు వారణాసిలో శనివారం పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టొమాటో అధిక ధరలకు గుర్తుగా టొమాటో ఆకారంతో ఉన్న కేక్‌ను కట్ చేసి ప్రజలకు టొమాటో పంపిణీ చేశారు. అమేథీ జిల్లాలో వరిధాన్య విత్తనాలతో పంటపొలంలో హెచ్‌బిడి అఖిలేశ్ జీ అని రాశారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, బహుజన్ సమాజ్ అధినేత్రి మాయవతి అఖిలేశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
వారణాసిలో ఈ వేడుకలను నిర్వహించిన పార్టీ కార్యకర్త ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేయాల్సి ఉందని, కానీ అవి ఎంతో ఖరీదైనవని పేర్కొన్నారు. అందువల్ల కిలో రూ.120 ధర పలికే టొమాటోలను పంపిణీ చేశామని చెప్పారు. గ్రామాల్లో చపాతీలతో టమోటో చెట్నీ వాడుతుంటారని, కానీ అవి కూడా మన ప్లేటు నుంచి లాక్కోవడమౌతోందని అజయ్ ఫౌజీ అనే కార్యకర్త వ్యాఖ్యానించారు. రూ. 250 గ్రాముల వంతున 50 నుంచి 60 కుటుంబాలకు టొమాటో పంపిణీ చేయడమైందని చెప్పారు. సమాజం లోని ప్రతివర్గం సంక్షేమం కోసం అఖిలేశ్ యాదవ్ పోరాటం చేస్తుంటారని, అందువల్ల అమేథీ లోని రైతులు, కార్మికులు అఖిలేశ్ యాదవ్ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారని చెప్పారు.