ధరలు పాతాళానికి పతనం
15 కిలోల బాక్స్ ధర రూ. 40
ఖర్చులు పోగా రైతు చేతికి రూ.10
మనతెలంగాణ/హైదరాబాద్: మొన్నటిదాక పంట సాగు చేసిన రైతులకు కాసుల వర్షం కురిపించిన టమాటా ఇపుడు అదే రైతులకు కన్నీళ్లు తెప్పిస్తొంది. గత రెండు రోజులుగా టమాటా ఉత్పత్తులు మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. డిమాండ్‌కు మించి సరుకు టమాటా కొనుగోలు కేంద్రాలకు వస్తుండటంతో ఒక్కసారిగా ధరలు పాతాళానికి పతనం అయ్యాయి. వ్యాపారులు చెప్పినంత ధరకు విక్రయించలేక ఇటు పొలం నుంచి మార్కెట్ల దాక తెచ్చిన సరుకును బొట్లకు విక్రయించలేక రైతుల కన్నీటి పర్యంతం అవుతున్నారు. మార్కెట్లలో ధరలు పెరిగినప్పుడు సరుకును క్రమబద్ధంగా మార్కెట్లకు చేరవేసి ధరలను నియంత్రించాల్సివుండగా ఈ అంశంలో ఏమాత్రం పట్టించుకోని ప్రభుత్వాలు ఇప్పుడు కూడా ధరలు పతనమవుతుంటే చోద్యం చూడటం తప్ప జోక్యం చేసుకోవటం లేదు. రైతులు తెస్తున్న టమాటా సరుకును కొనుగోలు చేస్తున్న వ్యాపారులు 15కిలోల బాక్స్‌కు రూ.40కి మించి ధర పెట్టడం లేదు. రైతులు పొలంలో టమాటా కోత కూలీ కింద 15 కిలోలకు కూలీగా 12రూపాయలు చెల్లిస్తున్నారు. రవాణా ఖర్చు కింద రూ.10, మార్కెట్‌లో టామాటా సరుకు అమ్మిపెట్టినందుకు బ్రోకర్ కమీషన్‌గా బాక్సుకు రూ.6 ,మార్కెట్‌లో టామాటా బాక్సు ఎత్తి దించి నందుకు రూ.2 రైతులే చెల్లించాల్సివస్తోంది.దీంతో బాక్సు టమాటాలకు పొలంలో కోత కూలీ నుంచి మార్కట్‌లో హమాలీ కూలీదాక మొత్తం రూ.30 చెల్లించాల్సివస్తోంది. ఇక ఆరుగాలం శ్రమంచి టామాటాలు పండించిన రైతుకు 15కిలోల టామాటాలను విక్రయిస్తే వ్యాపారులనుంచి అందిన మొత్తంలో చివరకు 10 రూపాయలు మాత్రమే మిగులుతోంది. కిలో టామాటాలు పండించి విక్రయిస్తే రూపాయిన్నరకు మించి దక్కటం లేదు. ఇది రైతుకు మార్కెట్లో ఆ పూట భోజనం ఖర్చుకు కూడా సరిపోవటం లేదంటున్నారు.
ఈ కష్టమంతా మార్కెట్‌వ్యూహం లేనందుకేనా !
టమాటా సాగు విస్తీర్ణం ..మార్కెట్ వ్యూహాలు లేకుండా గుడ్డిగా సాగుచేయటం వల్లనే రైతులకు ఈ సమస్యలు వచ్చిపడుతున్నాయన్న అభిప్రాయాలు మార్కెటింగ్ శాఖ అధికారుల నుంచి వ్యక్తమవుతున్నాయి. టామాటా సాగులో పంట కాలం 120రోజులు ఉంటుంది.అందులో మొక్క నాటిన తర్వాత నుంచి 60రోజుల్లో పంట కాపుకు వస్తుంది. అయితే జులై రెండవ వారంలో నాటిన టమాటా పైర్లు ఇప్పుడు కాపుకు వస్తున్నాయి. అయితే ఈ సారి పంట సాగు విస్తీర్ణం భారీగా పెరిగిపోయింది. అంతకు ముందు వేసవిలో సాగు చేసిన టమాటా పంట మార్కెట్‌కు వచ్చే నాటిని టమాటా ధరలు క్రమేపి పెరుగుతూ వచ్చాయి. ఆగస్ట్ రెండవ వారానికి మార్కెట్‌లో 15కిలోల బాక్సు టమాటా ధరలు రూ. 2000 పలికాయి.
దక్షిణాది రాష్ట్రాల్లో టామాట సాగుకు పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా సాగు చేసిన టమాటా విస్తీర్ణం లక్షన్నర ఎకరాలకు మించి పోయింది. పొరుగున ఉన్న కర్ణాటకలోనూ పంట సాగు అంచనాలకు మించి జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ సారి టమాటా సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఉత్తరాదిరాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకుంది. దేశవ్యాప్తంగా కొత్తగా వస్తున్న టమాటా కాపు మార్కెట్లను అనూహ్యంగా ముంచెత్తుతోంది. గ్రేటర్ హైదరాబాద్ నగరానికే రోజు 30కి పైగా లారీల టామాటా లోడు చేరుతోంది. పంట వినియోగదారుల అవసరాలకు మించి మార్కెట్లకు చేరుతుండటంతో వ్యాపారులు పంటకొనుగోలులో రైతుకు చుక్కులు చూపుతున్నారు. కిలో టమాటాలు రూ.200 పైగా అమ్మిన చోటనే ఇప్పుడు అదే టమాటాలు కిలో రూ.1.50కి విక్రయించాల్సిరావటం పూలమ్మిన చోట కట్టెలమ్మిన పరిస్థితిని తలపిస్తోంది. కోత కూలీ కూడా దక్కకపోవటంతో రైతులు ఆవేదనతో రోడ్ల పక్కన రాసులుగా టామాటాలను పారబోసి కంట నీరు పెట్టి ఇంటిముఖం పడుతున్నారు.