Thursday, November 14, 2024

ఆత్మ విశ్వాసమే అఫ్గాన్ బలం

- Advertisement -
- Advertisement -

Tomorrow match between Afghanistan vs Scotland

స్కాట్లాండ్‌తో నేడు ఢీ

షార్జా: టి20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా సోమవారం అఫ్గానిస్థాన్, తొలి సారిగా ప్రపంచకప్ సూపర్12కు అర్హత సాధించిన స్కాట్లాండ్‌తో తలపడనుంది. క్రికెట్‌లో పసికూన అయినా అఫ్గానిస్థాన్ అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ప్రపంచకప్ కోసం అఫ్గానిస్థాన్ సన్నాహం ఏ మాత్రం సాఫీగా జరగలేదు. ఓ వైపు తాలిబన్లు అధికారాన్ని హస్తగతం చేసుకోవడంతో నెలకొన్న పరిస్థితుల కారణంగా క్రికెటర్లు పెద్దగా ప్రాక్టీస్‌కు నోచుకోలేదు. మరో వైపు జట్టు ఎంపిక వివాదాలు ముసురుకున్నాయి. జట్టును ప్రకటించిన తర్వాత స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కెప్టెన్సీనుంచి తప్పుకొన్నట్లు ప్రకటించడం పెద్ద దెబ్బ అయింది. దీంతో జట్టులో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. చివరికి వెటరన్ ఆల్‌రౌండర్ మహమ్మద్ నబీ కెప్టెన్ పగ్గాలు చేపట్టాడు. ఈ వివాదాలన్నీ తట్టుకొని ప్రపంచకప్‌కు సిద్ధమైన అఫ్గాన్ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు జరిగిన రెండు వార్మప్ మ్యాచ్‌లలో తమ సామర్థమేమిటో చాటి చెపింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడినప్పటికీ ఆ తర్వాతి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్‌పై విజయం సాధించడం ద్వారా తమను తక్కువగా అంచనా వేయొద్దన్న హెచ్చరిక చేసింది. మొదటినుంచి కూడా అఫ్గానిస్థాన్ బలం బౌలింగే.

బలమైన బౌలింగ్ జట్టుగా అది తన సత్తా చాటుతూనే వస్తోంది. బ్యాట్స్‌మన్ గనుక రాణిస్తే ఏ జట్టునైనా ఓడించగల మని ఆ జట్టు గతంలో అనేక సందర్భాల్లో నిరూపించుకుంది. ఆ జట్టు బ్యాటింగ్ అంతా కూడా ఓపెనర్లు హజరతుల్లా జజాయ్, మహ్మద్ షహజాద్‌లపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. వారిద్దరూ గనుక రాణిస్తే నజ్‌బుల్లా, కెప్టెన్ నబీలు చివర్లో బ్యాట్ ఝళిపించే అవకాశం ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే స్పిన్ త్రయం రషీద్, నబీ, ముజీబ్ జద్రాన్‌లు ప్రపంచంతో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ను కూడా ఇబ్బంది పెట్టగల సత్తా ఉన్న వారే. ఐపిఎల్‌లో షార్జా సిచ్ స్లో బౌలరలకు సహకరించిన తీరును గమనిస్తే వరల్డ్ కప్ కోసం కొత్తగా వేసిన పిచ్‌పై కూడా వారు రాణించే అవకాశం ఉంది.

జోరు మీదున్న స్కాట్లాండ్

మరో వైపు దాని ప్రత్యర్థి స్కాట్లాండ్ ప్రిలిమినరీ రౌండ్‌లో మొత్త మూడు మ్యాచ్‌లలోను విజయం సాధించి మొక్కవోని ఆత్మ విశ్వాసంతో సూపర్12లోకి అడుగు పెట్టింది. బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లో స్కాట్లాండ్ విజయం సాధించిన తీరు ఆ జట్టు పట్టుదల ఏమిటో తెలియ జేసింది. ఏ మాత్రం ఆశలు లేని స్థితినుంచి అద్భుత విజయం సాధించిన తీరు వారి పోరాట పటిమకు అద్ద పడుతుంది. కొత్త బంతి బౌలర్లు బార్డ్లీ వీల్, జోష్ దావేలు ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు అద్భుతంగా రాణించగా, ఎడంచేతి వాటం స్పిన్నర్ మార్క్ వాట్ మిడిల్ ఓవర్లలో పొదుపుగా బౌల్ చేయడం ద్వారా సత్తా చాటాడు. ఒమన్‌పై విజయం తర్వాత సూపర్12 బెర్త్‌ను ఖరారు చేసుకున్న ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వాట్ ఈ టోర్నమెంట్‌లో తమ వ్యూహం ఏమిటో స్పష్టం చేశాడు.

తాము సంచలన విజయాలు నమోదు చేసే అవకాశాలు లేక పోలేదన్నాడు. ప్రపంచంలో అత్యుత్తమ వన్డే టీమ్ అయిన ఇంగ్లండ్‌ను, బలమైన జట్టు బంగ్లాదేశ్‌ను ఓడించిన తాము మిగతా వాటిపైన ఎందుకు అలాంటి సంచలనాలు నమోదు చేయలేమని వాట్ ప్రశించాడు. విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్‌లాంటి మేటి బ్యాట్‌మెన్‌ను కట్టడి చేయడానికీ తన వద్ద వ్యూహాలు సిద్ధంగా ఉన్నాయని ధీమాగా చెప్పాడు. మరి ఈ రెండు జట్లులో దేనిది పైచేయి అవుతుందో వేచి చూడాలి మరి.

ఉభయ జట్లు

అఫ్గానిస్థాన్ : రషీద్ ఖాన్, రహమ్మతుల్లా గుర్బాజ్, హజరతుల్లా జజాయ్, ఉస్మాన్ ఘనీ, అసర్ అఫ్ఘాన్, మహమ్మద్ నబీ( కెప్టెన్), నజీబుల్లా జద్రాన్, హష్మతుల్లా షాహిది, మహమ్మద్ షాజాద్, ముజీబుర్ రెహ్మాన్, కరీమ్ జనత్, గుల్బదీన్ నయీబ్, నవీన్ ఉల్ హక్, హమీద్ హస్సన్, ఫరీద్ అహ్మద్.

స్కాట్లాండ్: కైల్ కోట్జర్( కెప్టెన్), రిచీ బెరింగ్టన్, డైలాన్ బడ్జ్, మాథ్యే క్రాస్, జోష్ దేవీ, అల్స్‌డైర్ ఇవాన్స్. క్రిస్ గ్రీవ్స్, మిఖాయెల్ లీస్క్, మాక్ లియోడ్, జార్జ్ మున్సే, సఫ్యాన్ షరీఫ్, హంజా తాహిర్, క్రెగ్ వాలెస్, మార్క్ వాట్, బ్రాడ్లీ వీల్.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News