రేపు ఇంగ్లండ్‌తో కీలక పోరు
అబుదాబి: తొలి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓటమి పాలైన బంగ్లాదేశ్‌కు బుధవారం ఇంగ్లండ్‌తో జరిగే పోరు సవాల్‌గా మారింది. నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి బంగ్లాదేశ్‌కు నెలకొంది. ఇక వెస్టిండీస్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో చిరస్మరణీయ విజయాన్ని అందుకున్న ఇంగ్లండ్ ఈ పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి నాకౌట్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకోవాలనే పట్టుదలతో ఉంది. విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పోయిన విషయం తెలిసిందే.
ముఖ్యంగా స్పిన్నర్లు మోయిన్ అలీ, ఆదిల్ రషీద్‌లు అసాధారణ బౌలింగ్‌ను కనబరిచారు. టైమల్ మిల్స్,జోర్డాన్, వోక్స్‌లు కూడా పొదుపుగా బౌలింగ్ చేశారు. ఇక మోయిన్ ఆరంభంలోనే కీలకమైన వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును ఆత్మరక్షణలో పడేశాడు. ఇక ఆదిల్ రషీద్ అయిదే కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 2.2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన రషీద్ రికార్డు స్థాయిలో నాలుగు వికెట్లను పడగొట్టాడు. దీంతో విండీస్ అవమానకర రీతిలో కేవలం 55 పరుగులకే ఆలౌటైంది. ఇక ప్రత్యర్థి ఉంచిన స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
సమరోత్సాహంతో..
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ సమరోత్సాహంతో బరిలోకి దిగుతోంది. బంగ్లాదేశ్‌పై కూడా ఘన విజయం సాధించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇంగ్లండ్ సమతూకంగా ఉంది. కానీ విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా నాలుగు వికెట్లను కోల్పోవడం కాస్త ఆందోళన కలిగించే అంశమే. ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాల్సిన బాధ్యత బ్యాట్స్‌మెన్‌పై ఉంది. ఓపెనర్లు జాసన్ రాయ్, జోస్ బట్లర్‌లు జట్టుకు కీలకంగా మారారు. ఈ మ్యాచ్‌లో ఇద్దరు మెరుగైన ఆరంభాన్ని ఇవ్వక తప్పదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. విధ్వంసక బ్యాటింగ్‌కు ఇద్దరు మరో పేరుగా ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరిలో ఏ ఒక్కరూ చివరి వరకు నాటౌట్‌గా నిలిచినా బంగ్లా బౌలర్లకు కష్టాలు ఖాయం.
ఇక జానీ బెయిర్‌స్టో, మోయిన్ అలీ, లివింగ్‌స్టోన్, కెప్టెన్ మోర్గాన్, డేవిడ్ మలాన్, వోక్స్ తదితరులతో ఇంగ్లండ్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. కానీ ఇటీవల కాలంగా కెప్టెన్ మోర్గాన్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నాడు. ఇది జట్టును కలవరానికి గురిచేస్తోంది. ఐపిఎల్‌లో కూడా మోర్గాన్ పెద్దగా ప్రభావం చూపలేక పోయాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచక తప్పదు. బౌలింగ్‌లో మాత్రం ఇంగ్లండ్‌కు తిరుగే లేదని చెప్పాలి. ఫాస్ట్ బౌలింగ్‌తో పాటు పటిష్టమైన స్పిన్ విభాగం జట్టుకు అందుబాటులో ఉంది. తొలి మ్యాచ్‌లో స్పీడ్‌స్టర్లు వోక్స్, జోర్డాన్, మిల్స్‌లతో పాటు స్పిన్నర్లు మోయిన్, రషీద్‌లు రాణించారు. ఈసారి కూడా అదే జోరును కనబరచాలనే పట్టుదలతో ఉన్నారు.
పరీక్షలాంటిదే..
మరోవైపు ఇంగ్లండ్‌తో పోరు బంగ్లాదేశ్‌కు సవాల్ వంటిదేనని చెప్పాలి. కిందటి మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించినా లంక చేతిలో ఓటమి తప్పలేదు. దీంతో ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్ బంగ్లాదేశ్‌కు పరీక్షగా తయారైంది. సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్‌లోనూ గెలవక తప్పదు. అయితే ప్రపంచకప్ ఫేవరెట్‌లలో ఒకటిగా భావిస్తున్న ఇంగ్లండ్‌ను ఓడించాలంటే బంగ్లాదేశ్ అసాధారణ ఆటను కనబరచక తప్పదు. ఓపెనర్లు లిటన్ దాస్, నయీంలతో పాటు షకిబ్, ముష్ఫికుర్ రహీం, కెప్టెన్ మహ్మదుల్లా తదితరులు మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచక తప్పదు. అంతేగాక బౌలర్లు కూడా సత్తా చాటక తప్పదు. అప్పుడే ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.