దుబాయి: వరుస ఓటములతో ఇప్పటికే సెమీ ఫైనల్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకున్న టీమిండియా బుధవారం జరిగే కీలక మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి తిరిగి ఆత్మవిశ్వసాన్ని పెంచుకోవాలనే పట్టుదలతో భారత్ ఉంది. అయితే కిందటి మ్యాచ్‌లో పాకిస్థాన్ వంటి బలమైన జట్టును ఓడించినంత పని చేసిన అఫ్గాన్‌తో పోరు భారత్‌కు అంత తేలికేం కాదనే చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అఫ్గాన్ సమతూకంగా కనిపిస్తోంది. దీంతో ఏమాత్రం నిర్లక్షంగా ఆడినా టీమిండియా ఖాతాలో మరో ఓటమి చేరడం ఖాయం. పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల చేతుల్లో అవమానకర రీతిలో పరాజంయ పాలైన భారత్‌కు మిగిలిన మ్యాచుల్లో గెలిచినా పెద్ద ప్రయోజనం ఉండక పోవచ్చు. అయితే మిగిలిన మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో సముచిత స్థానాన్ని దక్కించుకోవాలని భారత్ భావిస్తోంది.
తేలికేం కాదు..
ఇక అఫ్గానిస్థాన్‌తో పోరు టీమిండియాకు అంత తేలికేం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు అఫ్గాన్‌లో కొదవలేదు. రషీద్, ముస్తఫిజుర్, ముజీబ్, నబి తదితరులతో అఫ్గాన్ బౌలింగ్ బలంగా ఉంది. ఎంతటి పెద్ద బ్యాటింగ్ లైనప్‌ను అయినా కుప్పకూల్చే సత్తా ఈ బౌలర్లకు ఉంది. దీంతో వీరిని ఎదుర్కొని భారీ స్కోరు సాధించడం టీమిండియా అంత సులువు కాదనే చెప్పాలి. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, కెఎల్.రాహుల్‌లు ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. కిందటి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా దించినా పెద్దగా ఫలితం కనిపించలేదు. దీంతో ఈసారి రోహిత్‌నే ఓపెనర్‌గా దించాలని జట్టు యాజమాన్యం యోచిస్తోంది. కాగా, ఈ మ్యాచ్‌లోనైనా ఓపెనర్లు జట్టుకు శుభారంభం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలిత్నా తారుమారు చేసే సత్తా ఉన్న రోహిత్, రాహుల్‌లు తమ మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే టీమిండియాకు మెరుగైన స్కోరు సాధించడం కష్టం కాదు.
ఇక కెప్టెన్ కోహ్లి కూడా తన బ్యాట్‌కు పని చెప్పాలి. తొలి మ్యాచ్‌లో కోహ్లి అర్ధ సెంచరీతో అలరించాడు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తున్నాడు. యువ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లలో ఎవరికీ చోటు లభిస్తుందో ఇంకా తేలలేదు. ఇషాన్‌కు మరో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక బౌలింగ్ విభాగంలో అశ్విన్‌ను తుది జట్టుకు ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుణ్ చక్రవర్తి రెండు మ్యాచుల్లోనూ విఫలమైన విషయం తెలిసిందే. దీంతో అతనికి మరో ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదనే చెప్పాలి. మహ్మద్ షమిను తప్పించి భువనేశ్వర్‌ను దించే అవకాశాలున్నాయి. హార్దిక్‌కు మరోసారి చోటు ఖాయంగా కనిపిస్తోంది. శార్దూల్, బుమ్రా, జడేజాలు కూడా ఈ మ్యాచ్‌లో ఆడడం దాదాపు ఖాయం.
గెలుపే లక్ష్యంగా..
మరోవైపు అఫ్గాన్ కూడా ఈ మ్యాచ్‌లో గెలుపే లక్షంగా బరిలోకి దిగుతోంది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడి రెండింటిలో గెలిచిన అఫ్గాన్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. పాకిస్థాన్‌కు గట్ట పోటీ ఇవ్వడం అఫ్గాన్‌కు పెద్ద ఊరటనిచ్చే అంశం. భారత్‌పై కూడా మెరుగైన ఆటను కనబరచాలనే పట్టుదలతో కనిపిస్తోంది. సంచలన ఆటకు మరో పేరుగా చెప్పుకునే అఫ్గాన్‌ను తక్కువ అంచనా వేయలేం. తనదైన రోజు ఎంత పెద్ద జట్టునైనా మట్టి కరిపించే సత్తా అఫ్గాన్‌కు ఉంది. దీంతో భారత్‌కు ఈ మ్యాచ్ సవాల్ వంటిదేనని చెప్పక తప్పదు.