Friday, November 22, 2024

హైదరాబాద్ రాత మారేనా?

- Advertisement -
- Advertisement -

Tomorrow match between SRH vs RCB

రేపు బెంగళూరుతో పోరు

అబుదాబి: వరుస ఓటములతో ఐపిఎల్ సీజన్14లో అట్టడుగు స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బుధవారం జరిగే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. సన్‌రైజర్స్ ఇప్పటికే ప్లేఆఫ్‌కు దూరమైంది. మరోవైపు బెంగళూరు ఇప్పటికే నాకౌట్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. అయితే హైదరాబాద్‌ను ఓడించడం ద్వారా పాయింట్ల పట్టికలో మరింత మెరుగైన స్థానాన్ని ఖాయం చేసుకోవాలనే లక్షంతో బెంగళూరు కనిపిస్తోంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో చాలెంజర్స్ విజయం సాధించి ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. ఇక మిగిలిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి టాప్2లో నిలువాలనే పట్టుదలతో కోహ్లి సేన ఉంది. ఇక హైదరాబాద్ కనీసం చివరి రెండు మ్యాచుల్లోనైనా గెలిచి కాస్తయిన పరువును నిలబెట్టుకోవాలని భావిస్తోంది. అయితే సన్‌రైజర్స్ ఆటను చూస్తుంటే ఈ మ్యాచ్‌లో గెలవడం కష్టంగానే కనిపిస్తోంది. బౌలర్లు బాగానే రాణిస్తున్నా బ్యాటింగ్ వైఫల్యం హైదరాబాద్‌కు ప్రధాన సమస్యగా మారింది. బ్యాటింగ్‌లో ఏ ఒక్కరూ కూడా రాణించలేక పోతున్నారు. కెప్టెన్ విలియమ్సన్‌తో సహా ఇతర బ్యాట్స్‌మెన్‌లు అందరూ తేలిపోతున్నారు.

ఓపెనర్లు జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహాలు శుభారంభం అందించలేక పోతున్నారు. రాయ్ ఒక్క మ్యాచ్‌లోనే రాణించాడు. మిగతా రెండింటిలో ఘోరంగా విఫలమయ్యాడు. ఇక మరో ఓపెనర్ సాహా వరుసగా రెండు మ్యాచుల్లో డకౌటయ్యాడు. వీరిద్దరి వైఫల్యం జట్టును వెంటాడుతోంది. కనీసం చివరి మ్యాచుల్లోనైనా ఓపెనర్లు మెరుగైన ఆరంభాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక కెప్టెన్ విలియమ్సన్ అత్యంత చెత్త బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నాడు. జట్టును ముందుండి నడిపించలేక పోతున్నాడు. విలియమ్సన్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్నాడు. అతని వైఫల్యం సన్‌రైజర్స్‌కు ప్రతికూలంగా మారింది. ఒక యువ ఆటగాళ్లు ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్‌లు కూడా రాణించలేక పోతున్నారు. సమద్ కాస్త బాగానే ఆడుతున్నా భారీ స్కోర్లు మాత్రం నమోదు చేయలేక పోతున్నాడు. ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ కూడా తన స్థాయికి తగ్గ ఆటను కనబరచడంలో వైఫల్యం చవిచూస్తున్నాడు. రషీద్ ఖాన్ కూడా బ్యాట్‌తో ప్రభావం చూపలేక పోతున్నాడు. ఇలా ప్రతి ఆటగాడు తేలిపోతుండడంతో స్వల్ప లక్ష్యాలను సయితం హైదరాబాద్ ఛేదించలేక చతికిల పడుతోంది. కనీసం ఇకపై జరిగే మ్యాచ్‌ల్లోనైనా బ్యాట్స్‌మెన్ తమ బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే చివరి రెండు పోటీల్లోనూ హైదరాబాద్‌కు పరాజయాలు తప్పక పోవచ్చు.

అగ్రస్థానమే లక్షంగా..

మరోవైపు బెంగళూరు ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇప్పటికే ప్లేఆఫ్ బెర్త్ ఖాయం కావడంతో ఇక అగ్రస్థానంపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్న చాలెంజర్స్ ఎలాగైనా టాప్2లో నిలువాలనే పట్టుదలతో ఉంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో కోహ్లి సేన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. మిగిలిన రెండు మ్యాచుల్లో సమరోత్సాహంతో దిగేందుకు ఇది దోహదం చేస్తుందనడంలో సందేహం లేదు. కెప్టెన్ కోహ్లితో పాటు దేవ్‌దుత్ పడిక్కల్, మాక్స్‌వెల్ ఫామ్‌లో ఉండడం బెంగళూరుకు కలిసి వచ్చే అంశం. కిందటి మ్యాచ్‌లో మాక్స్‌వెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సీజన్‌లో అత్యంత నిలకడైన ఆటను కనబరుస్తున్న మాక్స్‌వెల్‌పై జట్టు ఈసారి కూడా భారీ ఆశలు పెట్టుకుంది. డివిలియర్స్ కూడా కిందటి మ్యాచ్‌లో బాగానే ఆడాడు. అతను తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే బెంగళూరుకు ఎదురే ఉండదు. బౌలింగ్‌లో కూడా విరాట్ సేన చాలా బలంగా ఉంది. హర్షల్ పటేల్, గార్టన్, సిరాజ్, చాహల్ తదితరులతో ఈ విభాగం పటిష్టంగా ఉన్న విషయం తెలిసిందే. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉన్న బెంగళూరుకు ఈ మ్యాచ్‌లో గెలుపు అసాధ్యమేమీ కాదని చెప్పక తప్పదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News