Friday, November 22, 2024

ఫైనల్ బెర్త్ ఎవరిదో?

- Advertisement -
- Advertisement -

Tomorrow Qualifier-1 between CSK vs DC

ఆత్మవిశ్వాసంతో ఢిల్లీ, ఫేవరెట్‌గా ధోనీ సేన

దుబాయి: ఐపిఎల్ సీజన్14 తుది దశకు చేరుకుంది. ఇప్పటికే లీగ్ దశ మ్యాచ్‌లకు తెరపడింది. ఇక మిగిలింది నాకౌట్ మ్యాచ్‌లే. ఆదివారం క్వాలిఫయర్1 పోరు జరుగనుంది. ఇందులో లీగ్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఇందులో గెలిచే జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టుకు మరో ఛాన్స్ ఉంటుంది. ఓడిన జట్టు క్వాలిఫయర్2లో ఎలిమినేటర్ విజేతతో అమీతుమీ తేల్చుకుంటుంది. ఇక సోమవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతాయి. ఇందులో గెలిచే టీమ్ క్వాలిఫయర్2కు అర్హత సాధిస్తోంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి వైదొలుగుతుంది. ఇక ఆదివారం జరిగే మ్యాచ్‌కు చెన్నై, ఢిల్లీ జట్లు సమరోత్సాహంతో సిద్ధమయ్యాయి. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో ఈ మ్యాచ్‌లో ఎవరూ గెలుస్తారో ముందే ఊహించడం కష్టంగా మారింది.

ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు చేరుకోవాలనే పట్టుదలతో రెండు జట్లు ఉన్నాయి. ఢిల్లీ కిందటి సీజన్‌లో కూడా ఫైనల్‌కు చేరుకుంది. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే లక్షంతో పోరుకు సిద్ధమైంది. ఇక మహేంద్ర సింగ్ నేతృత్వంలోని చెన్నై కూడా ఫైనల్‌కు చేరడమే లక్షంగా బరిలోకి దిగుతోంది. లీగ్ దశలో ఢిల్లీ పది విజయాలు సాధించగా, చెన్నై 9 విజయాలతో రెండో స్థానంలో నిలిచింది. బెంగళూరు కూడా 9 విజయాలు సాధించినా మెరుగైన రన్‌రేట్ కలిగివుండడంతో సిఎస్‌కె రెండో స్థానాన్ని దక్కించుకుంది.

కాగా, సిఎస్‌కె లీగ్ దశలో ఆడిన చివరి మూడు మ్యాచుల్లోనూ ఓటమి చవిచూసింది. ఇది ధోని సేనకు కాస్త ప్రతికూల అంశంగానే చెప్పాలి. ఇక బెంగళూరుతో జరిగిన కిందటి మ్యాచ్‌లో ఢిల్లీ కడా పరాజయం పాలైంది. అయితే చాలెంజర్స్ బ్యాట్స్‌మన్ శ్రీకర్ భరత్ ఆఖరి బంతికి కొట్టిన చిరస్మరణీయ సిక్సర్ వల్లే ఢిల్లీకి ఓటమి ఎదురైంది. లేకుంటే ఈ మ్యాచ్‌లో కూడా ఢిల్లీ కచ్చితంగా గెలిచేదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. సిఎస్‌కె మాత్రం చివరి మూడు మ్యాచుల్లో ఘోర పరాజయాలను మూటగట్టుకుంది. రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్ కింగ్స్‌లతో జరిగిన పోరుల్లో సిఎస్‌కె పరాజయం పాలైంది.

ఓపెనర్లే కీలకం..

ఇక ఈ మ్యాచ్‌లో చెన్నైకి ఓపెనర్లు డుప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్‌లు కీలకంగా మారారు. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత వీరిపై నెలకొంది. ఇద్దరు అద్భుత ఫామ్‌లో ఉండడం సిఎస్‌కెకు కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. వీరిలో ఏ ఒక్కరూ నిలదొక్కుకున్నా భారీ స్కోరు ఖాయం. రుతురాజ్ ఈ సీజన్‌లో ఇప్పటికే ఓ సెంచరీతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో కూడా అతనిపై జట్టు భారీ ఆశలే పెట్టుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన రుతురాజ్ విజృంభిస్తే ఢిల్లీ బౌలర్లకు కష్టాలు ఖాయం. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో డుప్లెసిస్ 76 పరుగులతో అలరించాడు. ఈసారి కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. అయితే సీనియర్లు సురేశ్ రైనా, ధోని, ఉతప్ప, మోయిన్ అలీ తదితరులు ఆశించిన స్థాయిలో బ్యాట్‌ను ఝులిపించలేక పోతున్నారు. ఇది జట్టుకు ప్రతికూలంగా మారింది. రైనా తన స్థాయికి తగ్గ ఆటను కనబరచడంలో విఫలమవుతున్నాడు.

అతని వైఫల్యం జట్టును వెంటాడుతోంది. ఉతప్ప కూడా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక పోతున్నాడు. రాయుడు బాగానే ఆడుతున్నా అతని బ్యాటింగ్‌లో నిలకడ కనిపించడం లేదు. ఈ మ్యాచ్‌లో రాయుడు జట్టుకు చాలా కీలకంగా మారాడు. ఒక కెప్టెన్ ధోని ఈ సీజన్‌లో పూర్తిగా నిరాశ పరిచాడు. ఏ మ్యాచ్‌లోనూ ధాటిగా ఆడలేక పోయాడు. అతని బ్యాటింగ్‌లో మునుపటి జోష్ ఉండడం లేదు. ఈసారైనా బ్యాట్‌కు పనిచెబుతాడా అనేది సందేహమే. అయితే జడేజా జోరుమీదుండడం చెన్నైకి అతి పెద్ద ఊరటగా చెప్పొచ్చు. బ్యాట్‌తో, బంతితో చెలరేగి పోతున్నాడు. కీలకమైన క్వాలిఫయర్ పోరులో కూడా జట్టు జడేజాపై భారీ ఆశలు పెట్టుకుంది. బ్రావో, దీపక్ చాహర్, శార్దూల్‌లతో బౌలింగ్ కూడా బలంగా ఉంది. వీరు బ్యాట్‌తోనూ సత్తా చాటగల సత్తా కలిగినవారే కావడం చెన్నైకి కలిసి వచ్చే అంశం. ఇలా బ్యాటింగ్ బౌలింగ్‌లో సమతూకంగా ఉన్న సిఎస్‌కె ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

గెలుపే లక్షంగా..

మరోవైపు లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఫైనల్‌కు చేరడమే లక్షంగా పెట్టుకుంది. ఆదివారం సిఎస్‌కెతో జరిగే మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. లీగ్ దశలో చెన్నైను ఓడించడం ఢిల్లీకి కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రిషబ్ పంత్ సేన సమతూకంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. అయితే కీలక సమయాల్లో ఒత్తిడికి తట్టుకోలేక చేతులెత్తేస్తుండడం ఢిల్లీకి ప్రతికూలంగా తయారైంది. ఓపెనర్లు ధావన్, పృథ్వీషాలు ఈ మ్యాచ్‌లో మరోసారి చెలరేగేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరు అద్భుత ఫామ్‌లో ఉన్నారు. ఈసారి కూడా శుభారంభం అందించాలన పట్టుదలతో ఉన్నారు. శ్రేయస్ అయ్యర్, కెప్టెన్ రిషబ్ పంత్, హెట్‌మెయిర్, రిపాల్ పటేల్, అక్షర్ పటేల్, అశ్విన్‌లతో బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలింగ్‌లోనూ ఢిల్లీ బాగానే కనిపిస్తోంది. రబడా, అవేశ్ ఖాన్, అశ్విన్, నోర్జె, అక్షర్ పటేల్ తదితరులు నిలకడైన ప్రదర్శన చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా రాణించాలనే పట్టుదలతో ఉన్నారు. ఇక ఇటు ఢిల్లీ అటు చెన్నైలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో ఈ పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News