Saturday, December 21, 2024

సముద్ర గర్భంలో పేలిన అగ్ని పర్వతం…

- Advertisement -
- Advertisement -

Tonga volcano eruption

ఆదివారం నుంచి ప్రమాద పరిస్థితి తగ్గుముఖం
63,000 అడుగుల ఎత్తున ఆవరించిన బూడిద, పొగ
అయినా ఇంకా నిఘా విమానాలు వెళ్లలేని పరిస్థితి

సుకులోఫాలో : దక్షిణ పసిఫిక్ సముద్రం లోని ద్వీపకల్పం టోంగా సమీపంలో శనివారం భారీ అగ్నిపర్వతం బద్దలై వివిధ దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసే ప్రమాద పరిస్థితి ఎదురైనప్పటికీ ఆదివారం నాటికి ఆ ప్రమాద హెచ్చరిక కాస్త తగ్గుముఖం పట్టడం ప్రారంభమైంది. అయితే చిన్న ద్వీపకల్ప దేశమైన టోంగాలో బూడిద, పొగ 63,000 అడుగుల ఎత్తున అవరించి ఉండడంతో నష్టాన్ని అంచనా వేయడానికి న్యూజిలాండ్ నుంచి నిఘావిమానాల రాకపోకలకు వీలుపడడం లేదు. సోమవారం విమానాలు పంపించి నష్టాన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తామని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్‌డెర్న్ చెప్పారు. టోంగా రాజధాని సుకులోఫాలోకి 65 కిమీ దూరంలో సముద్ర గర్భంలో ఉన్న అగ్నిపర్వతం (టోంగా హుంగా హాపై) శనివారం ఒక్కసారిగా బద్దలవ్వడంతో టోంగా వ్యాప్తంగా పొగ, బూడిద ఎగిసి పడ్డాయి. సముద్ర గర్భం నుంచి బయటకొచ్చిన బూడిద 20 కిమీ వరకు ఎగిసిపడ్డట్టు టోంగా జియోలాజికల్ సర్వేసంస్థ తెలియజేసింది.

అగ్నిపర్వతం పేలుడు శబ్దాలు 8 నిమిషాల పాటు వినిపించినట్టు పేర్కొంది. మరోవైపు పేలుడు ధాటికి సముద్రం అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో టోంగాతోపాటు జపాన్, పిజీ, హవాయి, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, చిలీ, అలస్కాసహా యూఎస్ పశ్చిమ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. కెనడా లోని బ్రిటిష్ కొలంబియాకు కూడా అక్కడి ప్రభుత్వం సునామీ హెచ్చరికలు చేసింది. తీరప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా సూచించింది. అగ్నిపర్వత విస్ఫోటనం … భూకంప తీవ్రతతో పోలిస్తే రిక్టర్ స్కేలుపై 5.8 గా ఉంటుందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. విస్ఫోటనం ధాటికి జపాన్ ఫసిఫిక్ కోస్టల్ ప్రాంతంలో అలలు 1.2 మీటర్ల ఎత్తు ఎగిసిపడ్డాయని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. టోంగాకు 2,300 కిమీ దూరంలో ఉన్న న్యూజిలాండ్‌పై కూడా దీని ప్రభావం పడింది. అలలకు అక్కడి తీర ప్రాంతంలో ఉన్న పడవలు ధ్వంసమయ్యాయి. అప్రమత్తమైన అక్కడి అధికారులు తీరప్రాంతంలో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News