న్యూఢిల్లీ : వెల్లియన్‌గిరి కొండ దిగువన సరైన పర్యావరణ అనుమతి లేకుండా భవనాల నిర్మాణంపై జగ్గీ వాసుదేవ్ సారథ్యంలోని ఈశా ఫౌండేషన్‌కు తమిళనాడు కాలుష్య నివారణ బోర్డు (టిఎన్‌పిసిబి) జారీ చేసిన నోటీసులను రద్దు చేసిన మద్రాసు హైకోర్టు ఉత్తర్వులపై జోక్యానికి సుప్రీం కోర్టు శుక్రవారం నిరాకరించింది. కోయంబత్తూరు వెల్లియన్‌గిరి కొందలో నిర్మించిన ఈశా ఫౌండేషన యోగా, ధ్యాన కేంద్రంపై నిర్బంధ చర్య ఏదీ ఉండరాదని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సూర్య కాంత్; ఎన్ కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. కాలుష్య నియంత్రణ బోర్డు జారీ చేసిన పర్యావరణ నిబంధనలు, ఆదేశాలు అన్నిటినీ యోగ, ధ్యాన కేంద్రం పాటిస్తుందని బెంచ్ తెలియజేసింది.
యోగ, ధ్యాన కేంద్రాన్ని విస్తరించే పక్షంలో సముచిత ప్రాధికార సంస్థ ముందస్తు అనుమతి తీసుకోనున్నట్లు బెంచ్ తెలిపింది. అయితే, ఈ ఉత్తర్వు అక్రమ నిర్మాణం క్రమబద్ధీకరణకు ఆనవాయితీని సృష్టించబోదని, కేసు విలక్షణ వాస్తవాలు, పరిస్థితుల దృష్ట్యా ఈ ఉత్తర్వు జారీ చేయడమైందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కోయంబత్తూరులో ఈశా ఫౌండేషన్ ఏర్పాటు చేసినవి విద్య కేటగరీ కిందనకు వస్తాయని పేర్కొంటూ హైకోర్టు 2022 డిసెంబర్ 14న టిఎన్‌పిసిబి నోటీసును కొట్టివేసింది. 2021 నవంబర్ 19న బోర్డు జారీ చేసిన నోటీసును హైకోర్టు కొట్టివేసి, ఈశా ఫౌండేషన్ పిటిషన్‌ను అనుమతించింది. ముందస్తు పర్యావరణ అనుమతి లేకుండా వెల్లియన్‌గిరి కొండ దిగువన భవనాల నిర్మాణంపై బోర్టు సంజాయిషీ నోటీస్ జారీ చేసింది.