రష్యా, ఉక్రెయిన్ దేశాలు సహా 73 దేశాల దౌత్యవేత్తలు మహాకుంభ మేళా ‘సంగం’లో పుణ్యస్నానం ఆచరించడానికి ఇక్కడికి వస్తున్నారు. వారు ఫిబ్రవరి 1న రాబోతున్నారని కుంభ్‌మేళా అధికారి విజయ్ కిరణ్ ఆనంద్ ధ్రువీకరించారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ఉత్తర్‌ప్రదేశ్ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. అందులో అమెరికా, జపాన్, రష్యా, ఉక్రెయిన్, జర్మనీ, నెదర్‌లాండ్స్, కెమెరూన్, కెనడా, స్విట్జర్లాండ్, స్వీడెన్, పోలాండ్, బోల్వియా దేశాలకు చెందిన దౌత్యవేత్తలు రానున్నారని స్పష్టం చేసింది.
ఆ లేఖ ప్రకారం వారంతా ఓడలో సంగం నోస్ వరకు వెళతారు, తర్వాత ‘సంగం’ వద్ద పుణ్య స్నానం చేస్తారు. ఆ తర్వాత వారు అక్షయవత్, బడే హనుమాన్ మందిరం సందర్శిస్తారు. ఆ తర్వాత డిజిటల్ మహాకుంభ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ వద్ద మహాకుంభ్ గురించి అవగాహన చేసుకోనున్నారు. వివిధ దేశాల దౌత్యవేత్తల కుంభ్‌మేళా అనుభవం సునాయాసంగా ఉండేందుకుగాను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.