Monday, December 23, 2024

అభివృద్ధిలో అగ్రస్థానం – అప్పుల్లో చివరిస్థానం

- Advertisement -
- Advertisement -

అప్పులు చేసిన రాష్ట్రాల్లో 23వ స్థానంలో తెలంగాణ
అభివృద్ధి చేసిన రాష్ట్రాల్లో అగ్రస్థానంలో తెలంగాణ

మన తెలంగాణ / హైదరాబాద్:  రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించడంలో, ఆర్థికాభివృద్ధిని సాధించడంలో దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్రం అత్యధికంగా అప్పులు చేసిన రాష్ట్రాలలో మాత్రం 23వ స్థానంలో కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం అప్పులు కేవలం 27.1 శాతానికి తగ్గిపోయాయి. అదే విధంగా రాష్ట్రం విలువ (జిఎస్‌డిపి) 13.27 లక్షల కోట్లకు పెరిగిందని అధికారిక లెక్కలు స్పష్టంచేశాయి. అదే విధంగా 2014లో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం (ఒక్కొక్కరి సంపాదన) కేవలం 1,24,104 రూపాయలు ఉండగా ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్కొక్కరి సంపాదన 3,17,115 రూపాయలకు పెరిగింది. తలసరి ఆదాయాలను గణనీయంగా పెంచిన రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో కొనసాగుతోందని ఆర్ధికమంత్రిత్వశాఖ రికార్డులు స్పష్టంచేస్తున్నాయి. దీనికితోడు తెలంగాణ రాష్ట్రంలో పేదరికం 13.18 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గిపోయిందని అధికారిక గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. గత ఆర్ధిక సంవత్సరంలో (2022-23) రాష్ట్ర అప్పులు జిఎస్‌డిపిలో 28 శాతం ఉండగా ఈ ఏడాది ఆచీతూచీ అడుగులు వేయడంతో ఆ అప్పులు పెరగకపోగా 27.1 శాతానికి తగ్గిపోయాయని ఆర్ధిక మంత్రిత్వశాఖ లెక్కలు స్పష్టంచేస్తున్నాయి.

ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం ఏటా 3.5 శాతం వరకూ అప్పులు చేయవచ్చు. ఈ లెక్కన ఏ రాష్ట్రమైనా జిఎస్‌డిపిలో 20 శాతానికి మించకుండా అప్పులు చేయాల్సి ఉంటుంది. కానీ బిజెపి పాలిత రాష్ట్రాలన్నీ ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితులను దాటిపోయి 30 శాతం నుంచి మొదలు కొని ఏకంగా 53 శాతం వరకూ అప్పులు చేశాయి. దేశంలోని 28 రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాలూ అప్పులు చేయగా, అందులో తెలంగాణ రాష్ట్రంలో 23వ స్థానంలో చివరి నుంచి అయితో స్థానంలో నిలిచింది. మిగతా 22 రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోయినప్పటికీ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ప్రతి వారం నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొనే అవకాశాలు ఇస్తూ అతి తక్కువగా అప్పులున్న తెలంగాణ రాష్ట్రానికి మాత్రం అనుమతులు ఇవ్వకుండా వేధిస్తూనే ఉందని కొందరు సీనియర్ అధికారులు వివరించారు.

అంతేగాక 2023-24వ ఆర్ధిక సంవత్సరం ముగింపు దశకు చేరుకునే నాటికి అత్యధికంగా అప్పులు చేసిన రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్ 53 శాతం అప్పులతో అగ్రస్థానంలో కొనసాగుతోందని కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ స్టాటిస్టిక్స్ తెలిపాయి. పంజాబ్ రాష్ట్రం 46.8 శాతం అప్పులతో రెండో స్థానంలో ఉంది. నాగాలాండ్ 41.6 శాతంతో మూడో స్థానంలో ఉండగా మణిపూర్ 40 అప్పులతో నాలుగో స్థానంలో ఉంది. మేఘాలయ 39.9 శాతం అప్పులతో అయిదో స్థానంలో ఉంది. హిమాచల్‌ప్రదేశ్ 39 శాతం, త్రిపుర 38 శాతం, బీహార్, మిజోరాం 37.8 శాతం, పశ్చిమ బెంగాల్ 37.7 శాతం, రాజస్థాన్ 36.8 శాతం, కేరళ 36.6 శాతం, ఆంధ్రప్రదేశ్ 33.3 శాతం, గోవా 32.2 శాతం, ఉత్తర్‌ప్రదేశ్ 32.1 శాతం, సిక్కిం 31.5 శాతం, మధ్యప్రదేశ్ 30.4 శాతం, ఉత్తరాఖాండ్ 28.2 శాతం, జార్ఖండ్ 27 శాతం, తమిళనాడు 25.6 శాతం, హర్యానా 25.5 శాతం, అస్సాం 24.4 శాతం, తెలంగాణ 23.8 శాతం, ఛత్తీస్‌గఢ్ 23.8 శాతం, కర్ణాటక 23 శాతం, మహారాష్ట్ర 18.2 శాతం, గుజరాత్ 14.9 శాతం, ఒడిషా 13.1 శాతానికి అప్పులు చేరతాయని ఆ గణాంకాలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్రం అప్పులు వాస్తవానికి ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి కేవలం 27.1 శాతం మాత్రమే ఉన్నాయని, కానీ ఈ ఏడాది ఎన్నికల ఖర్చులు అదనంగా రావడంతోనే బడ్జెటేతర వ్యయం అనుకోకుండా పెరిగిందని, అందుకే ఆర్‌బిఐ నుంచి బాండ్ల వేలం నుంచి రుణాల రూపంలో నిధులను సేకరించాల్సి వచ్చిందని, అందుకే ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసేనాటికి రాష్ట్ర అప్పులు 23.8 శాతానికి చేరతాయని తాజాగా ఆర్ధికశాఖ నిర్వహించిన అధ్యయనాల్లో వెల్లడయ్యిందని పలువురు సీనియర్ అధికారులు వివరించారు.

ఖజానాపైన ఈ అప్పులు పెద్దగా భారం పడకపోయినప్పటికీ ఉన్న కొద్దిపాటి అప్పులను కూడా తగ్గించుకొంటూ వస్తున్నామని వివరించారు. ఒకవైపు కొత్తగా ప్రజలపై ఎలాంటి అదనపు పన్నుల భారాన్ని మోపకుండా, చార్జీలు పెంచకుండా, ఇతరత్రా ఫీజులు పెంచకుండా తెలంగాణ రాష్ట్రం సిద్దించక ముందున్న పన్నుల విధానాన్నే కొనసాగిస్తూ సమర్ధవంతమైన పరిపాలనా విధానాలతో ఎక్కడా లూపోల్స్ లేకుండా పటిష్టంగా పన్నుల వసూళ్ళ కార్యక్రమాన్ని చేపట్టడంతోనే ఖజానాకు ఆదాయం పెరుగుతోందని ఆ అధికారులు వివరించారు. తెలంగాణ ప్రజలు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, పారిశ్రామికవేత్తలు, ఐటి కంపెనీలు, ఫార్మా కంపెనీలు, వాణిజ్య వర్గాలు నిజాయితీగా పన్నులు చెల్లించడంతోనే జిఎస్‌టి ఆదాయం పెరిగిందని వివరించారు. ఎక్కడా లూప్‌హోల్స్ లేకుండా పన్నుల విధానాన్ని పర్‌ఫెక్ట్‌గా అమలు చేయడంలో కమర్షియల్ ట్యాక్స్ విభాగం సమర్దవంతంగా పనిచేసిందని ఆ అధికారులు వివరించారు. అంతేగాక కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో ఎకనమిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఇఐయు)ను నెలకొల్పడం మూలంగా పన్నుల ఆదాయం పెరిగిందని వివరించారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగం నుంచి ఊహించిన దానికంటే ఎక్కువగానే ఆదాయం వచ్చిందని, భూముల మార్కెట్ వ్యాల్యూ (విలువ) హేతుబద్దీకరించడం (రేషనలైజేషన్)తో రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగిందని వివరించారు. ఇదిలా వుండగా నాన్-ట్యాక్స్ రెవెన్యూ విభాగంలో కూడా అనేక సంస్కరణలు చేపట్టడంతో మరింత ఆదాయం పెరిగిందని ఆ అధికారులు వివరించారు.

గనులు, మినరల్స్ విభాగంలో రాయల్టీలు, సీనరేజిల వసూళ్ళల్లో ఎక్కడా లూప్‌హోల్స్ లేకుండా వసూలు చేయడంతో ఆదాయం పెరిగిందని వివరించారు. రాష్ట్రంలోని గనుల వేలంలో హేతుబద్దీకరణను చేపట్టడం మూలంగా ముఖ్యంగా బొగ్గు, గ్రానైట్, ఇసుక తదితర గనుల కేటాయింపుల్లో బహిరంగ వేలం పాటలను నిర్వహించడం మూలంగా కూడా ఆదాయం పెరిగిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం కొట్టిన దొంగదెబ్బకు డీలా పడిపోకుండా ప్రభుత్వ పాలనలో ఖర్చులను తగ్గించుకుంటూ, రాష్ట్రంలో అమలులో ఉన్న అభివృద్ధి-సంక్షేమ పథకాలకు నిధులను ఖర్చు చేశామని వివరించారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆసరా పెన్షన్లు, రైతుబంధు, దళితబంధు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తులను ఇస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ఆ పథకాలకు నిధులను ఖర్చు చేస్తున్న విధానాలు, ఆర్ధిక క్రమశిక్షణ పాటిస్తున్న వైనం, ఆర్ధిక వనరుల సమీకరణకు అనుసరిస్తున్న విధానాలను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్.బి.ఐ) కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కీర్తించిందని వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News