హైదరాబాద్: కరోనా వైరస్ బారిన పడిన మావోయిస్ట్ అగ్రనేత వినోద్ మృతి చెందాడు. సీనియర్ మావోయిస్టు నేత వినోద్ కరోనా కారణంగా అతని శరీరంలో ఇన్ఫెక్షన్ తీవ్రత పెరగడంతో మరణించినట్లు దంతెవాడ ఎస్‌పి అభిషేక్ పల్లవ్ వెల్లడించారు. వినోద్ దక్షిణ ప్రాంతీయ కమిటీలో కీలకంగా వ్యవహరించారు. పలు కీలక దాడులకు సంబంధించి వినోద్‌పై చాలా కేసులున్నాయన్నారు. అతనిపై పదిహేను లక్షల రివార్డ్ ఉందని, ఎన్‌ఐఏ నుంచి రూ.5 లక్షలు, ఛత్తీస్‌ఘట్ పోలీసుల నుంచి రూ.10 లక్షల రివార్డు ఉందని తెలిపారు. జీరం అంబుష్, ఎమ్మెల్యే బిమా మండవి మృతి వెనకాల వినోద్ మాస్టర్ మైండ్‌గా వ్యవహరించారని, వినోద్ దర్షి ఘాటి ఊచకోతకు సూత్రధారిగా ఉన్నారని అధికారులు తెలిపారు.
అప్పటినుంచి ఎన్‌ఐఏకి మోస్ట్ వాంటెడ్‌గా వినోద్ ఉన్నారని వివరించారు. ఇటీవల కాలంలో కరోనా బారిన పడి పలువురు కీలక మావో నేతలు మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా కరోనా మావోల శిబిరాల్లో కలకలం రేపుతోంది. ఇటీవల మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ చనిపోయారు. కేంద్ర కమిటీలో కీలక సభ్యుడిగా ఉన్న ఆయన కరోనాతో అనారోగ్యంతో మరణించారు. దీంతోపాటు పలువురు సభ్యులు కూడా చనిపోయినట్లు పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఈ ఘటన మరిచిపోక ముందే మరో అగ్రనేత వినోద్ మరణించడం మావోలకు కరోనా సవాలుగా మారింది.