Thursday, January 23, 2025

లద్ధాఖ్‌లో చైనా లడాయి దూకుడు

- Advertisement -
- Advertisement -

Top US General On Chinese Infra Build-Up Near Ladakh

అమెరికా సైనికాధికారి ఆందోళన
కళ్లు మూసుకుంటే ముప్పే
కీలక ప్రాంతంలో వంతెన నిర్మాణం
రాదార్లతో సైనిక కదలికలకు చర్యలు
సంఘటితంగా ప్రశ్నించాల్సిందే
ప్రాంతీయ స్థాయిలో అస్థిరత డ్రాగన్ పనే

న్యూఢిల్లీ : లద్ధాఖ్ సమీపంలో చైనా సైనిక సాధనాసంపత్తి , కార్యకలాపాలు ముమ్మరం కావడం పట్ల అమెరికా ఉన్నత స్థాయి సైనికాధికారి ఆందోళన వ్యక్తం చేశారు. చైనా దూకుడు ఇప్పటికైనా కొందరికి కనువిప్పు కావాల్సి ఉందని యుఎస్ ఆర్మీ పసిఫిక్ దళాల నేత జనరల్ ఛార్లె స్ ఎ ఫ్లిన్ స్పందించారు. ప్రత్యేకించి ఈ ప్రాంతంలో చైనా వంతెన నిర్మాణం ఇక్కడి ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీస్తుందని తెలిపారు. లద్ధాఖ్ ప్రాంతంలో తరచూ చైనా సైనిక కవ్వింపు చర్యలు భారత్‌కు విషమ పరిస్థితిని తెచ్చిపెడుతున్నాయి. అక్కడ పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని అమెరికా సైనిక జనరల్ తెలిపారు. చైనా అక్కడ దుందుడుకు ధోరణితో ఉంది. ఎప్పటికప్పుడు తన చర్యలతో పరిస్థితిని అస్థిరపరుస్తోందని అన్నారు. హిమాలయ పర్వత ప్రాంతాలలో చైనా అత్యంత వ్యూహాత్మకంగానే తన మౌలిక సదుపాయాలను పటిష్టం చేసుకొంటోందని వ్యాఖ్యానించారు. దీనిని ఎవరైనా చూస్తూ ఉండజాలరని అన్నారు. అత్యంత కీలకమైన పాంగాంగ్ సో సరస్సు ప్రాంతంలో రెండో వంతెన నిర్మాణం, రాదార్ల నిర్మాణాలు , ఏకంగా సరిహద్దులలోనే చైనా గ్రామాల ఏర్పాటు వంటి అంశాలను అమెరికా జనరల్ ప్రస్తావించారు. భారతదేశం తరచూ ఈ విషయాలపై ఫిర్యాదు చేస్తూ ఉన్నా చైనా పట్టించుకోవడం లేదన్నారు.

రోజురోజుకీ అక్కడ విస్తరిస్తోన్న సైనిక కార్యకలాపాలు ప్రత్యేకించి పశ్చిమ రంగంలోని సైనిక ప్రాంతంలో జరుగుతున్న చైనా దూకుడు విన్యాసాలు తీవ్రస్థాయిలో కలవరానికి దారితీస్తున్నాయని అన్నారు. అక్కడ చైనా ఈ విధంగా ఎందుకు వ్యవహరిస్తోందనేది తెలియాల్సి ఉందని కొందరు జర్నలిస్టులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సైనికాధికారి తెలిపారు. చైనా ఎప్పటికప్పుడు తన సైనిక ఆయుధ పాటవాన్ని అన్ని విధాలుగా పటిష్టపర్చుకొంటోందన్నారు. చైనా ధోరణి పూర్తిగా అభ్యంతరకరం, విద్వేషపూరితం అని, ప్రాంతీయ సమగ్రతను అస్థిరపర్చే తంతుగా మారిందన్నారు. చైనా ఘర్షణాయుత వైఖరితో భారత ఉపఖండ ప్రాంతానికి ముప్పు తెచ్చిపెడుతుందని, ఏ విధంగానూ మేలు చేయదని అన్నారు. ప్రస్తుత దశలో సంఘటితంగా చైనా దూకుడుకు కళ్లెం వేయాల్సి ఉందని, ఆద్యంతం తప్పుడు విధానాలతో సాగుతోన్న చైనా సైనిక విధానాలను నిలువరించాల్సి ఉందని స్పష్టం చేశారు. చైనా ఎందుకిలా చేస్తోందని అడగాల్సిన అవసరం ఉందన్నారు.

అక్టోబర్‌లో భారత్ అమెరికాల సైనిక విన్యాసాలు

ఎతైన పర్వత ప్రాంతాలలో సైనిక పాటవాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు భారత్ అమెరికాలు సంయుక్త విన్యాసాలను ఈ ఏడాది అక్టోబర్‌లో చేపట్టాలని నిర్ణయించాయి. యుద్ధ అభ్యాసం పేరిట హిమాలయాలలో 9వేల నుంచి 10వేల అడుగుల ఎతైన ప్రాంతాలలో , మంచుశిఖరాలలో శిక్షణ కార్యక్రమాలు సాగుతాయి. అయితే ఏ ప్రాంతంలో ఇవి నిర్వహిస్తారనేది నిర్థిష్టంగా తెలియచేయలేదు. అల్సాకాలో అత్యంత శీతల పరిస్థితులలో తట్టుకునేందుకు సైనిక శిబిరాలను ఏర్పాటు చేసుకుంటాయి. అత్యంత ఎతైన పర్వత ప్రాంతాలలో తీవ్రస్థాయి హిమపాతాలు, శీతల వాతావరణంలో సైనిక కార్యకలాపాల విషయంలో ఇప్పటివరకూ చైనాదే పైచేయిగా ఉంటూ వస్తోంది. దీనిని తట్టుకునేందుకు ప్రత్యేకించి హిమాలయాల ప్రాంతాలలో చైనా దొంగచాటు దెబ్బలను వమ్ముచేసేందుకు భారతదేశం అమెరికాతో సంయుక్త సైనిక విన్యాసాలను తలపెట్టింది. నూతన సాంకేతిక పరిజానం, వైమానిక వనరుల వినియోగాలు, విమానాల దాడులు, వాస్తవికత, తక్షణ సమయానుకూల స్పందనలు, సమాచార వినిమయాలు, వ్యూహాత్మక స్పందనలు వంటి అంశాలపై ఇరుదేశాల పరస్పర సహకారం సాగుతుందని అమెరికా సైనిక జనరల్ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News