మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలని కొన్ని మితవాద సంస్థలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, ఆ అంశాన్ని అనవసరంగా లేవనెత్తారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) సీనియర్ నేత సురేశ్ ‘భయ్యాజీ’ జోషి సోమవారం అన్నారు. విశ్వాసం ఉన్న వారు మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఉన్న సమాధి కట్టడాన్ని సందర్శిస్తారని ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు నాగ్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. కాగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్‌ఎస్) చీఫ్ రాజ్ థాకరే ఆదివారం ఔరంగజేబ్ సమాధిపై మతపరమైన ఉద్రిక్తతను రెచ్చగొట్టే ప్రయత్నాలను ఖండించారు, చరిత్రను కులం, మతాల కోణం నుండి చూడకూడదన్నారు. చారిత్రక సమాచారం కోసం ప్రజలు వాట్సాప్ ఫార్వార్డ్‌లపై ఆధారపడొద్దని ఆయన సూచించారు.
మొఘల్ పాలకుడు ‘శివాజీ’ అన్న ఆలోచనను చంపాలనుకున్నాడు, కానీ విఫలమై మహారాష్ట్రలో మరణించాడని కూడా థాకరే అన్నారు. ‘మనకు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆదర్శం(రోల్ మోడల్), ఆయన అఫ్జల్ ఖాన్ సమాధిని నిర్మించారు. ఇది భారత దేశ ఔదర్యానికి, అందరినీ కలుపుకుపోయే గుణానికి ప్రతీక. సమాధి(ఔరంగజేబ్‌ది) అలాగే ఉంటుంది. ఎవరైనా అక్కడికి వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చు’ అని ఆర్‌ఎస్‌ఎస్ మాజీ ప్రధాన కార్యదర్శి అయిన సురేశ్ భయ్యాజీ జోషి తెలిపారు. ఇదిలావుండగా అఫ్జల్ ఖాన్ బీజాపూర్ జనరల్ అని, ఛత్రపతి శివాజీ అనుమతి లేకుండా ఆయన సమాధిని ప్రతాప్‌గఢ్ కోట సమీపంలో నిర్మించి ఉండేవారు కాదని ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్ థాకరే తెలిపారు.