Wednesday, January 22, 2025

దంచి కొడుతున్న వానలు

- Advertisement -
- Advertisement -
  • కుంటలు, చెరువుల్లోకి నీరు
  • అప్రమత్తమైన సంగారెడ్డి జిల్లా యంత్రాంగం

సంగారెడ్డి బ్యూరో: రెండు రోజులుగా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. ఈ వానల కారణంగా ఎలాంటి నష్టం కలగకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొవడానికి సిద్ద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.

జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో కంట్రోల్ రూంను కూడా ఏర్పాటు చేశారు. అల్ప పీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న ఈ వానలు అన్నదాతల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. ఆది, సోమవారాల్లో సంగారెడ్డి, కంది, పుల్కల్, చౌటకూర్, ఆంథోల్, రాయికోడ్, వట్‌పల్లి, మునిపల్లి, జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్‌కల్, నారాయణఖేడ్, కంగ్టి, కల్హేర్, మనూర్, నాగలిగిద్ద, సిర్గాపూర్ తదితర మండలాల్లో వానలు కురిశాయి. దీంతో అనేక ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, వాగులు నీటితో కళ కళలాడుతున్నాయి. ఒక్కోసారి చిరు జల్లులు, ఒక్కో సారి పెద్ద చినుకులు పడుతున్నాయి. ఎ

డ తెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా కంగ్టి మండలంలో 13 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. అదే విధంగా సంగారెడ్డి,కొండాపూర్, తదితర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి.డ్రైనేజీలు పొంగిపొర్లాయి. ప్రధాన రహదారితోపాటు బైపాస్ రోడ్డు, రాజం పేట రోడ్డు, మల్కాపూర్, కొత్లాపూర్ రోడ్లు, ఇతర రోడ్లన్నీ వాన నీటితో నిండిపోయాయి.

ఇక గ్రామీణ ప్రాంతాల్లో కురుస్తున్న వానల కారణంగా పంట చేలకు ప్రాణం వచ్చింది. కొద్ది రోజులుగా ఎలాంటి వానలు లేకపోవడంతో పత్తి చేలు బాగా దెబ్బతిన్నాయి. వరి చేలకు కూడా నీటి ఎద్దడి నెలకొంది. రైతులు ఆవేదన చెందుతున్న సమయంలో ఈ వర్షాలు కొంత ఆశలు రేకెత్తించాయి. ఏపుగా పెరగాల్సిన పత్తి చేలు కురుచగా మారిన తీరు ఇంత కాలం రైతులకు ఆవేదన కలిగించింది. ఈ సారి పత్తి పంట కూడా దారుణంగా పడి పోయే ప్రమాదమున్నదని అంటున్నారు. ఇతర పప్పు దినుసుల చేలు కూడా ఆశాజనకంగా లేవు.

వ్యవసాయం సరిగ్గా లేకుంటే అటు రైతులు నష్టపోవడమే కాకుండా,అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. పంటలు సమృద్దిగా లేకుంటే అన్నదాతకు ఆదాయం తగ్గుతుంది. ఉత్పత్తులు సరిగా లేని పక్షంలో పంటల ధరలు కూడా పెరుగుతాయి. తద్వారా మార్కెట్‌లో బియ్యం, పప్పులు, ఇతర ఉత్పత్తుల ధరలు కూడా పెరిగే ప్రమాదముంది. ఇదిలా ఉంటే రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా సంగారెడ్డి, జహీరాబాద్, ఆంథోల్, నారాయణఖేడ్ డివిజన్ల పరిధిలోని కుంటలు, చెరువుల్లోకి నీరు చేరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. పుల్కల్ మండలం ఇసోజిపేట వద్ద సింగూరు నుంచి వచ్చే పెద్ద కాలువకు గండి పడింది.

దీంతో నీరంతా వృధాగా పోతుంది. వెంటనే గ్రామస్థులు సమాచారం అందించడంతో ఇరిగేషన్ అధికారులు, స్థానిక సిబ్బంది గండి పడిన ప్రాంతానికి చేరుకున్నారు. గండి పూడ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News