వరదలు, కొండచరియలు విరిగి పడి 42 మంది మృతి
కొలబాట (ఫిలిప్పీన్స్): దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని మగ్యుండానావో ప్రావిన్స్‌లో కుండపోత వర్షాల కారణంగా సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో కనీసం 42 మంది మృతి చెందగా, మరో 16 మంది గల్లంతయినట్లు అధికారులు తెలిపారు. మరికొందరు ఇళ్ల పైకప్పులపై చిక్కుకు పోయారని కూడా వారు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది హటాత్తుగా సంభవించిన వరదల్లో కొట్టుకు పోవడం కొండచరియలు విరిగిపడ్డం కారణంగా శిథిలాల కింద చిక్కుపడి చనిపోయారని మాజీ గెరిల్లాల నేతృత్వంలో ప్రభుత్వం నడుస్తున్న ఈ ప్రావిన్స్ అధికారి ఒకరు చెప్పారు. మృతుల సంఖ్య ఇంకా పెరగదని తాను ఆశిస్తున్నానని, అయితే తాము ఇంకా చేరుకోని ప్రాంతాలు చాలా ఉన్నాయని ఆయన చెప్పారు. గురువారం రాత్రి అసాధారణ స్థాయిలో కురిసిన భారీ వర్షాలకు నదులు ప్రమాదస్థాయిలో పొంగి ప్రవహించాయని ఆయన చెప్పారు. స్థానిక అధికారులు అందించిన సమాచారాన్ని బట్టి దాతు ఒడిన్ సిన్సువట్ పట్టణంలో కొండచరియలు విరిగిపడి 27 మంది చనిపోగా, దాతు బ్లాసిన్సువట్ పట్టణంలో 10 మంది, ఉపి పట్టణంలో ఐదుగురు చనిపోయారని ఆయన చెప్పారు. మరో 16 మంది జాడ తెలియడం లేదని తెలిపారు.