ఉత్తర గోవాలో బుధవారం కలాంగుటె బీచ్ సమీపంలో అరేబియా సముద్రంలో ఒక టూరిస్ట్ పడవ పల్టీ కొట్టగా ఒక వ్యక్తి మరణించినట్లు, మరి 20 మందిని రక్షించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన మధ్యాహ్నం సుమారు 1.30 గంటలకు సంభవించిందని వారు తెలిపారు. ‘పడవ పల్లీ కొట్టిన అనంతరం 54 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. మరి 20 మందిని రక్షించి చికిత్స కోసం సమీపంలోని ఒక ఆసుపత్రికి తరలించారు’ అని పోలీస్ సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు.
ఇద్దరు ప్రయాణికులు మినహా తక్కిన వారు అందరూ లైఫ్ జాకెట్లు ధరించారని ఆయన తెలిపారు. ప్రయాణికుల్లో పిల్లలు, మహిళలు ఉన్నారని, పిల్లలో ఆరు సంవత్సరాలవారు ఉన్నారని ఆయన చెప్పారు. తీరానికి సుమారు 60 మీటర్ల దూరంలో పడవ మునిగిపోయిందని, ఫలితంంగా ప్రయాణికులు అందరూ సముద్ర జలాల్లో పడ్డారని ప్రభుత్వ నియుక్త ప్రాణ రక్షణ సంస్థ దృష్టి మెరైన్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.