Thursday, January 23, 2025

యూట్యూబర్ల విష ప్రసారాలు

- Advertisement -
- Advertisement -

Toxic broadcasts of YouTubers

ఛానల్ ప్రసారాల్లో దేశ భద్రతకు, మత సామరస్యతకు విఘాతం కలిగే అబద్ధ సమాచారం అధికంగా ఉంటోంది. దేశంలో ఎమర్జెన్సీ పెడుతున్నారని, పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటించారని ఇలాంటి అసంబద్ధ వీడియోలు అందులో ప్రసారం అవుతున్నాయి. ఛానళ్ల పేర్లు కూడా ప్రజలు నమ్మే రీతిలో ఉంటాయి. సర్కారీ బాబు, న్యూస్ 23 హిందీ, భారత్ మౌసమ్, డిజి గురుకుల్ ఇలా దేశీయ ఛానళ్ల మాదిరే ఉంటాయి. కొన్ని చానళ్ళు దేశంలో ప్రసారమవుతున్న హిందీ, ఇంగ్లిష్ టివి ఛానళ్ల లోగోలను, న్యూస్ రీడర్లను తెరపై ఉంచి తమ కథనాలను వినిపిస్తుంటాయి. ఫలానా రాష్ట్రంలో ఒక జాతి, మతానికి చెందిన వారిని ఊచకోత కోస్తున్నారని ఎక్కడిదో, ఎప్పడిదో క్లిప్పింగ్ పెట్టి వార్తలు చదివినట్లు వినిపిస్తారు.

ఈ రోజుల్లో యూ ట్యూబ్ ఛానల్ సృష్టించడం చిటికలో పని. మనం చూసే యూ ట్యూబ్ తెరపైనే అన్ని వివరాలు ఉంటాయి. వీడి యో అప్లోడ్ చేయడం, లైవ్‌ని టెలికాస్ట్ చేయడం అంతేకాక ఏకంగా మీ పేరు మీద లేదా కోరిన టైటిల్‌తో యూ ట్యూబ్ ఛానల్ ఆరంభించడం క్షణాల్లో పూర్తి చేయొచ్చు. మీరు పెట్టే సమాచారానికి యూ ట్యూబ్ లింక్ కూడా ఉంటుంది. దాని ద్వారా లేదా చూసేవాళ్ళు టైటిల్ సెర్చ్ ద్వారా చూడాలనుకున్న దాన్ని తేలిగ్గా చేరవచ్చు. సముద్రమంత సమాచారం, ఆకాశమంత వైశాల్యమున్న యూ ట్యూబ్ ఈ భూమ్మీద ఇంటర్ నెట్ సౌలభ్యమున్న మూల మూలలా అందుబాటులోకొస్తుంది.
సీనియర్ జర్నలిస్టులు, సామాజికవేత్తలు జనాల్లో తమ పేరుకున్న పరిచయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏకంగా సొంత పేరుపైనే యూ ట్యూబ్ ఛానల్ ను మొదలుపెట్టి తమ విశ్లేషణలను, ప్రసంగాలను అందులో పెడుతుంటారు. చూసేవారు, లైకు కొట్టేవారు, కామెంట్ పెట్టేవారు, వారి వీడియోలను చూడాలనుకుంటే సబ్ స్క్రైబ్ చేసేవాళ్ళు పెరిగితే ఆయా వ్యాఖ్యాతల సత్తాకు ఓ గుర్తింపు లభించినట్లు. ఆయా విశ్లేషకుల ప్రసంగాలు, వ్యాఖ్యానాలు ఆసక్తిపరులకు చేరి వారాశించిన సామజిక ప్రయోజనం ఒనగూరే అవకాశం కూడా ఉంది. ఇలా మన దేశంలో అన్ని భాషల్లోనూ వ్యాఖ్యాతల సొంత యూ ట్యూబ్ చానళ్ళు జనాదరణతో కొనసాగుతున్నాయి. రాజకీయాలే కాకుండా ఆరోగ్యం, విద్య, మదుపు, వంటలు ఇలా ఎన్నో రంగాలకు చెందినవారు సొంత యూ ట్యూబ్ ఛానల్‌ను నడుపుతున్నారు. యూ ట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రాంలో చేరితే వీరికి శ్రమకు తగ్గ నగదు ఆదాయం కూడా లభిస్తుంది. 12 నెలల కాలం లో 4 వేల గంటల సమయం పాటు ఛానల్‌కు దర్శించేవారు లభిస్తే లేదా ఒక వేయి మంది సబ్ స్క్రైబ్ అయితే ప్రకటనల్లో వచ్చే ఆదాయంలో కొంత పొందే అర్హత వస్తుంది.
యూ ట్యూబ్ ఛానళ్లలో ఇదంతా ప్రయోజనాలు కూర్చే పార్శ్యమైతే మరో వైపు వాటి దుర్వినియోగం ప్రమాదకరంగామారి ద్రోహకారక ఛానళ్ల నియంత్రణ ఇప్పుడు ప్రభుత్వాలకు తలకు మించిన భారమైపోయింది. తమ చట్టాలకు ఈ ఛానల్ విరుద్ధంగా పని చేస్తుందని ఆయా దేశాలు ఫిర్యాదు చేస్తే తప్ప యూ ట్యూబ్ వాటి తొలగింపుపై స్వయం నిర్ణయం తీసుకోదు. దీని ఆసరాగా దేశంలో అంతర్గతంగా, బయటి దేశాల నుండి తప్పుడు వార్త ప్రచారాలతో పెద్ద ముప్పు వాటిల్లుతోంది.
ఇలాంటి నష్ట నివారణ చర్యగా జనవరిలో కేంద్ర ప్రభుత్వం అధికారిక సమాచార సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో 35 ఛానళ్ల ప్రసారాలను నిలిపివేయమని యూ ట్యూబ్‌ను కోరింది. కోరిన ప్రకారం ఆయా ఛానళ్ల తెరలు నలుపు చేయబడ్డాయి. ఇవన్నీ పాకిస్తాన్ కేంద్రంగా నడుస్తున్నట్లు గుర్తింపబడ్డాయి. వీటిలో 14 చానళ్ళు అప్నీ దునియా నెట్‌వర్క్ వి కాగా, 13 తల్హా ఫిలిం నెట్‌వర్క్‌కు చెందినవిగా పేర్కొన్నారు. వీటి మూలాలు పాకిస్తాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. తిరిగి ఈ నెల 24న మరో 22 యూ ట్యూబ్ ఛానళ్ల పేర్లను బ్యూరో నిలుపుదలకు వినతి పంపింది. వాటి ప్రసారాలు కూడా ఆగిపోయినట్లు తెలుస్తోంది. వీటిలో 18 మన దేశంలోంచే నడుస్తున్నవి కాగా, 4 పాకిస్తాన్‌కు చెందినవిగా గుర్తించారు. ఈ రకంగా ఇప్పటి వరకు మొత్తం 75 ఛానళ్ల దాకా తొలగింపుకు గురయ్యాయి.
మన దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021 ప్రవేశపెట్టే దాకా వార్తా ప్రసారాలన్నీ కేంద్ర సమాచార శాఖ పరిధిలో వచ్చేవి. ఆ శాఖ అనుమతితోనే పత్రికల ప్రచురణ, ప్రసారాలు ప్రజల ముందుకొస్తాయి. సాంకేతిక ఉధృతి వల్ల ఇప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండానే మరో దేశంలో ఉన్నవాడు లేదా సంస్థ మన దేశానికి సంబంధించిన ఎలాంటి సమాచారాన్నైనా గాలిలోకి వదిలేయవచ్చు. పేరు, చిరునామా, ఆధార్ కార్డు వివరాలు చెప్పకుండానే, చట్టపర విధానాలను ఆచరించకుండానే మన ఇంట్లోకి వచ్చి కబుర్లు చెప్పవచ్చు. అయితే ఐటి రూల్స్ ప్రకారం దేశంలో ప్రసారమవుతున్న ప్రతి యూ ట్యూబ్ ఛానల్ రూల్ 18 ప్రకారం అనుమతి తీసుకోవాలి. నిర్వాహకుల పూర్తి వివరాలు పొందుపరచాలి. అయితే అవేమి లేకుండానే ఈ రూల్స్ కి విరుద్ధంగా ఎన్నో యూ ట్యూబ్ ఛానళ్ల ప్రసారాలు దేశంలో సాగుతున్నాయి. వాటి నియంత్రణ, తొలగింపు డిసెంబర్ 2021 నుండే మొదలైంది.
ప్రధానంగా అనధికారిక ఛానల్ ప్రసారాల్లో దేశ భద్రతకు, మత సామరస్యతకు విఘాతం కలిగే అబద్ధ సమాచారం అధికంగా ఉంటోంది. దేశంలో ఎమర్జెన్సీ పెడుతున్నారని, పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటించారని ఇలాంటి అసంబద్ధ వీడియోలు అందులో ప్రసారం అవుతున్నాయి. ఛానళ్ల పేర్లు కూడా ప్రజలు నమ్మే రీతిలో ఉంటాయి. సర్కారీ బాబు, న్యూస్ 23 హిందీ, భారత్ మౌసమ్, డిజి గురుకుల్ ఇలా దేశీయ ఛానళ్ల మాదిరే ఉంటాయి. కొన్ని చానళ్ళు దేశంలో ప్రసారమవుతున్న హిందీ, ఇంగ్లిష్ టివి ఛానళ్ల లోగోలను, న్యూస్ రీడర్లను తెరపై ఉంచి తమ కథనాలను వినిపిస్తుంటాయి. ఫలానా రాష్ట్రంలో ఒక జాతి, మతానికి చెందిన వారిని ఊచకోత కోస్తున్నారని ఎక్కడిదో ఎప్పడిదో క్లిప్పింగ్ పెట్టి వార్తలు చదివినట్లు వినిపిస్తారు. రోజు చూసే ఛానల్ లోనే వార్త వస్తున్నట్లు సామాన్య వీక్షకులు భ్రమించే అవకాశముంది. వీటిలో ఒకటైన సర్కారీ అప్ డేట్స్ ఛానల్ ప్రధాని మోడీ దేశంలో పాన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.15000 ఇస్తున్నారని, ఆధార్ కార్డు ఆధారంగా అందరి బ్యాంకు ఖాతాల్లో ప్రధాని రూ. 50 వేలు వేస్తున్నారని, అంతేకాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న యువత కేంద్ర ప్రభుత్వం నుండి నిరుద్యోగ భృతి కింద నెలకు రూ. 5 పొందవచ్చని చెబుతూ కింది కామెంట్లలో మీ వివరాలు పెట్టండని సూచన ఉంటుంది. ఈ మాయ తెలియని వందలాది మంది తమ పేరు, ఊరు, వివరాలు కామెంట్ల రూపం లో పెడుతున్నారు. ఆ వివరాల ఆధారంగా ఆయా వ్యక్తులను పలకరించి ఎలాంటి మోసానికైనా ఒడిగట్టవచ్చు. దేశంలో అనుమతిలేని, నకిలీ వస్తువుల అమ్మకాలు కూడా వీటి ద్వారా సాగుతున్నాయి.
ఇప్పటికే రద్దు చేసిన ఛానళ్లకు కోటి 20 లక్షల సబ్ స్క్రైబర్లు ఉండగా వీటిని చూసినవారు విశ్వ వ్యాప్తంగా 260 కోట్ల మంది ఉన్నారు. ఇంకా ప్రభుత్వ నిఘాకు చిక్కనివి ఎన్నున్నాయో, వాటిని నమ్మి మోసపోతున్నవారు ఎందరున్నారో లెక్కేయడం కష్టమే. నిషేధానికి గురైన ప్రతి ఛానల్‌కు కోట్లలో వీక్షకులు ఉండడం మరో ప్రమాదకర అంశం. పాకిస్తాన్‌కు చెందినట్లు చెబుతున్న ఎఆర్‌పికి 4.4 కోట్లు, ఎల్‌డిసి న్యూస్‌కు 6 కోట్లు, భారత్ మౌసమ్ కు 7 కోట్లు, ఆర్‌జెజోన్ 6కు 12 కోట్లు ఇలా చానళ్లను చూసేవారున్నారు. దుష్ప్రచారాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు, సంస్థలను తెచ్చినా దొంగలు కొత్త వేషాల్లో ప్రవేశిస్తూనే ఉంటారు. విచిత్రమేమిటంటే నిషేధిత ఛానళ్ల ప్రసారాలను మన దేశంలో యధావిధిగా చూసేందుకు కూడా మార్గాలు కనుక్కోబడ్డాయి. వీడియో యూఆర్‌ఎల్‌లో చిన్న మార్పు చేసిన లింక్‌ను పొందితే ఆ లింక్ ద్వారా వాటిని చూడవచ్చు, ఇతరులకు పంపవచ్చు.
విశ్వవ్యాప్తమైన ఇంటర్‌నెట్ వ్యవస్థను గుప్పిట్లో పట్టడం ఎవరి తరమూ కాని రోజులివి. అలాంటి ఛానళ్లలో వస్తున్న సమాచారాన్ని గుడ్డిగా నమ్మకుండా, ఆవేశంగా, అనవసరంగా ఇతరులకు పంచకుండా ఉంటే దేశానికి ఎంతో మేలు చేసినట్లే. ఇప్పటికే మన దేశంలో పని కట్టుకొని కొన్ని పార్టీల విధేయులు అదే పనిగా ఫేక్ న్యూస్ పంచిపెడుతుండగా ఇవి చాలవన్నట్లు బయటి దేశాల ఛానళ్ల విష ప్రచారం తోడవుతోంది. రెండు దేశ శాంతి భద్రతలకు ముప్పు తెచ్చేవే. వీటిలో కొన్ని ప్రభుత్వాలకు దొరకకపోవచ్చు, కొన్నింటిని అవే సృష్టించవచ్చు. అందుకోసం ఈ రోజుల్లో సామాన్య ప్రజానీకానికి సైతం వార్తల్లో సత్యాసత్యాలపై కనీస వివేచన అవసరం. ఈ దిశగా పౌరజ్ఞానం పెరిగేలా ప్రభుత్వాలు, ప్రజా సంఘాలు కృషి చేయవలసిన కాలమచ్చింది.

బి.నర్సన్
9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News