హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో విష వాయువు లీక్‌కావడంతో 150మంది అస్వస్థతకు గురయ్యారు. సీడ్స్ దుస్తుల ఫ్యాక్టరీలో రసాయన వాయువు లీకేజీ కారణంగా దాదాపు 150మందికి పైగా మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురై వాంతులు, వికారంతో స్పృహ తప్పి పడిపోయారు. ఫ్యాక్టరీ ప్రాంగణంలోనే కొందరికి ప్రథమ చికిత్స అందించగా మరి కొందరని ఫ్యాక్టరీ బస్సులు, కార్లు, అంబులెన్సుల్లో అచ్యుతాపురం, అనకాపల్లిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు.పెద్ద సంఖ్యలో మహిళలు వాంతులు, వికారంతో ఆర్తనాదాలు చేశారు. బి షిఫ్ట్‌లో ఫ్యాక్టరీలో దాదాపు 4వేల మంది కార్మికులు పనిచేస్తుండగా వారిలో 150 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. కాగా మే నెల మొదటి వారంలో కూడా ఇదే ఫ్యాక్టరీలో రసాయన వాయువు లీకై పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురైన విషయం విదితమే. సీడ్స్ దుస్తుల కంపెనీ, సమీపంలోని పోరస్ లాబ్‌ను దాదాపు వారం రోజుల పాటు మూసివేసి ప్రభుత్వ యంత్రాంగం విచారణ జరిపింది. హైదరాబాద్‌లోని ఐఐసిటి సహా ఇతర అధికారులతో రసాయన వాయువు లీకేజీపై నివేదికలు తీసుకున్న ప్రభుత్వం వాటిని ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదని కార్మికులు పేర్కొంటున్నారు.