Thursday, November 14, 2024

కాంగ్రెస్ సీనియర్‌లకు టిపిసిసి చెక్?

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ సీనియర్‌లకు టిపిసిసి చెక్ ?
సిఎం రేసులో ఉన్న వారికి ఎంపిలుగా అవకాశం
ఈసారి ముఖ్యమంత్రి పదవికి పోటీ లేకుండా చక్రం తిప్పిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు
అధిష్టానంతో ఒప్పించి, మెప్పించిన టిపిసిసి
మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం పదవి కోసం పోటీ పడే సీనియర్ నాయకులను ఎలాగైనా ఈసారి ఎంపిగా పోటీ చేయించాలన్న కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన చాలావరకు సఫలం అయ్యింది. రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయకుండా, గత ఎన్నికల్లో మాదిరిగానే సిఎం పదవికి తానే అర్హుడినంటూ పార్టీని సీనియర్‌లు ఓడించే అవకాశం ఉందని గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం చాలామంది సీనియర్‌లకు ఎంపితో పాటు కేంద్రంలో అధికారంలోకి వస్తే కచ్చితంగా మంత్రి పదవులు ఇస్తామని ఆశచూపినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈసారి అసెంబ్లీ వద్దనుకొని పార్లమెంట్‌కు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు.

రానున్న రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తమకు రాష్ట్రం నుంచి ఎలాగైనా కేంద్రమంత్రి పదవి దక్కుతుందన్న ఆశతో చాలామంది సీనియర్‌లు ఎంపిగా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. అందులో భాగంగా ఇప్పటికే పలువురు ఆ పార్టీ సీనియర్ నాయకులు తమ పిల్లలకు అసెంబ్లీ టికెట్ ఇప్పించే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే ఇదే విషయమై అధిష్టానంతో మాట్లాడుకొని వారి నుంచి హామీ తీసుకున్న తరువాతే సీనియర్ నాయకులంతా ఎంపిగా పోటీ చేయాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. దీంతోపాటు రాష్ట్రంలోనూ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తమవంతు కృషి చేస్తామని కూడా వారంతా అధిష్టానానికి హామీ ఇచ్చినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే సీనియర్‌లంతా ఎంపిగా పోటీ చేస్తే రానున్న రోజుల్లో సిఎం పదవి కోసం పోటీ కూడా చాలా వరకు తగ్గించవచ్చని అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది.

రాష్ట్రస్థాయి కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొనని సీనియర్‌లు…
గత రెండు ఎన్నికల్లో చేసిన తప్పులు ఈసారి పునరావృతం కాకూడదన్న ఉద్ధేశ్యంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా, కాస్త ముందుగానే క్లారిటీ ఇవ్వాలని భావిస్తోంది. ఈ ప్రక్రియలో కొంత భాగం అప్పుడే పూర్తయ్యింది. అయితే కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎప్పుడూ ముందుండే కొందరు సీనియర్ నేతలు ఈ సారి టికెట్ కోసం దరఖాస్తు చేసుకోకుండా టిపిసిసి కూడా చక్రం తిప్పినట్టుగా తెలిసింది. ఇలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా టిపిసిసి సీనియర్‌లకు అధిష్టానంతో చెప్పించిందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎంపిగా పోటీ చేయాలనుకునే కొందరు సీనియర్లు రాష్ట్రస్థాయి టిపిసిసి కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదని తెలుస్తోంది.

టిపిసిసి గడువులోగా స్పందించని సీనియర్‌లు
మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, పిసిసి మాజీ అధ్యక్షుడు వి.హన్మంతరావు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి వంటి సీనియర్లు ఈసారి ఎంపిగా పోటీ చేయాలన్న ఆసక్తి చూపుతున్నట్టుగా తెలిసింది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని టిపిసిసి ఇచ్చిన గడువు ముగిసినా ఇలాంటి వారి నుంచి ఎలాంటి దరఖాస్తులు రాలేదు. మరోవైపు పార్టీ కార్యక్రమాల్లోనూ నిత్యం భాగస్వాములయ్యే కిసాన్ కాంగ్రెస్ నేత కోదండరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జి. నిరంజన్, టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి లాంటి వారి కూడా టికెట్ కోసం దరఖాస్తు చేసుకోకపోవడం గమనార్హం.
సీనియర్ నేతలకు సంకేతాలు
తెలంగాణలో తాము అధికారంలోకి వస్తేఆ తరువాత సీనియర్లను పార్లమెంట్‌కు పంపేందుకు లైన్ క్లియర్ అవుతుందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు సీనియర్ నేతలకు సంకేతాలు కూడా ఇచ్చిందని అందుకు తగ్గట్టుగానే సీనియర్ నేతలంతా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News