ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు..
బిజెపిలో నలుగురు, బిఆర్‌ఎస్‌లో ముగ్గురు మూడుముక్కలాట
ఆయా పార్టీల్లో కుర్చీల గొడవెక్కువ
అధ్యక్ష కుర్చీ కోసం బిజెపి, బిఆర్‌ఎస్‌లో అంతర్గత పోరు..
కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు ఎడముఖం, పెడముఖం
కవిత, కెటిఆర్‌లు కుర్చీ కోసం కొట్లాడుకుంటున్నారు
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 80 శాతం స్థానాలు గెలుపొందుతాం
అభ్యర్థుల ఎంపికకు సర్వే నిర్వహిస్తాం
అన్ని పదవుల్లో సామాజిక న్యాయం పాటిస్తున్నాం
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ మనుగడ సాధించడం కష్టం
మనతెలంగాణ ఇంటర్వూలో టిపిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్: విధ్వంసం నుంచి వికాసం వైపు మా పాలన కొనసాగుతోంది. తెలంగాణ పదేళ్ల విధ్వంస పాలన నుంచి పునర్ వికాసం వైపు కాంగ్రెస్ పాలనలో పయనిస్తున్నాం. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రేవంత్, భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బిఆర్‌ఎస్, బిజెపిలు కుట్రలు చేస్తున్నాయి. బిజెపిలో నలుగురు, బిఆర్‌ఎస్‌లో ముగ్గురు మూడుముక్కలాట ఆడుతున్నారు. వారి పార్టీలోనే కుర్చీల గొడవ ఎక్కువయ్యింది. అధ్యక్ష కుర్చీ కోసం బిజెపి, బిఆర్‌ఎస్‌లో అంతర్గత పోరు ఎక్కువయ్యింది. బిజెపిలో ఎవడి గోల వాడిదే అన్నట్టుగా మారింది. కేంద్రమంత్రులైన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు ఎడముఖం, పెడముఖంగా పార్టీలో తిరుగుతున్నారు. వారు ప్రజల బాగోగులను పట్టించుకోవడం లేదు. ఇక ఈటల రాజేందర్, డికె అరుణలు రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పోట్లాడుకుంటూ బిజెపి కేడర్‌ను గందరగోళ పరుస్తున్నారు.
బిఆర్‌ఎస్‌లోనూ అదే పరిస్థితి
బిఆర్‌ఎస్‌లోనూ అదే పరిస్థితి. ఆ పార్టీలో కుర్చీ కోసం మూడు ముక్కలాట జరుగుతోంది. ఇప్పటికే కవిత ఆ కుర్చీ కోసం ఆశతో ఎదురుచూస్తుండగా, కెటిఆర్ తనకే ఆ కుర్చీ దక్కాలని వ్యూహాలు రూపొందిస్తున్నారు. వారిద్దరు కొట్లాడుకుంటే మధ్యలో తనకు లాభం అవుతుందని హరీష్‌రావు ఆశగా ఉన్నారు. అన్న కెటిఆర్‌ను తప్పించి కుర్చీ ఎక్కేందుకు కవిత తహతహ లాడుతుండగా అదును కోసం హరీష్‌రావు ఎదురు చూస్తున్నారు. ఇలా రెండు పార్టీల్లో ఎవరికీ వారే కుర్చీల కోసం కోట్లాడుకుంటూ ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని టిపిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు.
టిపిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ శనివారం ‘మనతెలంగాణ దినపత్రిక’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా అనేక విషయాలను ‘మనతెలంగాణ’తో ఆయన పంచుకున్నారు. కష్టపడే వారికి పదవులు దక్కుతాయని, తనకు మంత్రి పదవి మీద ఆశలేదని, పిసిసి అధ్యక్ష పదవిని తాను ఊహించలేదని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఏఐసిసి, సిఎం రేవంత్, డిప్యూటీ సిఎం భట్టిల తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పార్టీకి పునర్‌వైభవం తీసుకొస్తానన్నారు. ఇలా పలు విషయాలను ఆయన ‘మనతెలంగాణ’తో పంచుకున్నారు.
18.1 శాతానికి నిరుద్యోగం తగ్గుముఖం
ఏడాదిగా సిఎం రేవంత్ చొరవతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 55 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చింది. తెలంగాణలో నిరుద్యోగ శాతం తగ్గుముఖం పట్టింది. ఈ విషయాన్ని కేంద్ర గణాంక శాఖ సర్వే లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక వెల్లడించింది. (2023లో 22.9 శాతం నిరుద్యోగ శాతం ఉంటే 2024లో అది 18.1 శాతానికి) తగ్గుముఖం పట్టింది. జీఎస్‌డిపి వృద్ధిలోనూ దేశంలోనే తెలంగాణ టాప్‌లో ఉంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికను సర్వే నిర్వహిస్తాం
కాంగ్రెస్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 80 శాతం స్థానాలు గెలుపొందాలని లక్షంగా పెట్టుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపిటిసి, జెడ్పీటిసి, మన్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ కార్పొరేటర్లు అభ్యర్థుల ఎంపికను సెలక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతిలో ఎంపిక చేస్తాం. ఎటువంటి సిఫార్సులకు తావులేకుండా ప్రజల్లో పలుకుబడి ఉన్న అభ్యర్థులకు, కాంగ్రెస్ చేసిన సేవలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేయాలనుకుంటున్నాం. పార్టీలో పదవులు కావాలన్న, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలన్న నాయకులు, కార్యకర్తలు గాంధీభవన్ చుట్టూ తిరగడం మానేసి ప్రజలతో మమేకం కావాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు సర్వే నిర్వహించి ప్రజల్లో పలుకుబడి ఉన్న వారికి మాత్రమే టికెట్ కేటాయిస్తాం. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది.
టిపిసిసికి త్వరలోనే కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తా
తెలంగాణ ప్రదేశ్ కమిటీకి త్వరలోనే కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తాం. ఏఐసిసి నాయకులు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, కెసి వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలు, పార్టీకి చెందిన సీనియర్ నాయకులతో సంప్రదించి అందరికి ఆమోద యోగ్యమైన కమిటీని నియమిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ 80 శాతం గెలుపొందే లక్ష్యంగా కాంగ్రెస్‌ని సన్నద్ధం చేయడానికి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ కేంద్రాలను , జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో పర్యటిస్తా.
పొలింగ్ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు శిక్షణా శిబిరాలు
కాంగ్రెస్ సిద్ధాంతాలు, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం కోసం పొలింగ్ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు శిక్షణ శిబిరాలను సంక్రాంతి తర్వాత నిర్వహిస్తాం. ఈ కార్యక్రమాలు ఉగాది వరకు కొనసాగుతాయి. పార్టీ పదవుల కావాలన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలన్న నాయకులు, కార్యకర్తలు కేవలం సోషల్ మీడియాతో పాటు ప్రజలతోనూ మమేకం అవ్వాలి. కాంగ్రెస్ అనుబంధ సంఘాలైన యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, మహిళ కాంగ్రెస్, బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఇతర అనుబంధ విభాగాలను కూడా త్వరలోనే ప్రక్షాళన చేసి వాటిని మరింత బలోపేతం చేస్తాం. పార్టీ పదవుల్లో, ఇతర పదవుల్లో కాంగ్రెస్ కచ్చితంగా సామాజిక న్యాయం పాటించి బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలకు అన్ని సామాజిక వర్గాల వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తాం.
కులగణన సర్వే నివేదిక ఆధారంగా స్థానిక ఎన్నికల్లో….
కాంగ్రెస్ సిద్దాంతం, లౌకిక వాదం పార్టీ. అన్ని కులాలు, మతాలను గౌరవిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ సామాజిక వర్గాన్ని, మతాన్ని కించపరచదు. ఇటువంటి కార్యక్రమాలకు ఏ ఒక్క నాయకుడు పాల్పడినా అతను ఏ స్థాయిలో ఉన్న పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఊపేక్షించదు. కఠినంగా చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. రాహుల్‌గాంధీ ఆలోచనల మేరకు ఈ సర్వేను విజయవంతంగా పూర్తి చేస్తాం. కులగణన సర్వే నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు సీట్లను కేటాయిస్తాం. సుమారుగా 42 శాతానికి పైగానే ఈసారి బిసిలకు పదవులు దక్కుతాయి.
ప్రతిపక్ష హోదాను బిఆర్‌ఎస్ కాపాడుకోలేక పోయింది….
బిఆర్‌ఎస్ పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు 39 సీట్లను ఇచ్చి గౌరవించారు. కానీ, ఆ పార్టీ నాయకులు ప్రతిపక్ష హోదాను కాపాడుకోలేదు. దీంతో సంవత్సరంలోపే ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఆ పార్టీలో నిరంతరం కుర్చీల కోసం జరిగే పోరాటంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తి చెందుతున్నారు. దీంతో వారు కాంగ్రెస్‌లో చేరాలని ఊవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే పలువురు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు.
కెటిఆర్ అరెస్టు అంశం గవర్నర్ వద్ద పెండింగ్‌లో….
కెటిఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై పసలేని ఆరోపణలు చేస్తూ ఆ పార్టీని మరింత పలుచన చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ మనుగడ సాధించడం కష్టం. బిఆర్‌ఎస్‌కు బిజెపితో ఉన్న లోపాయికారి ఒప్పందం గురించి ప్రజలకు తెలియడంతో ఆ పార్టీకి రానున్న ఎన్నికల్లో మరింత గడ్డుకాలమే. కెటిఆర్ నన్ను అరెస్టు చేయి అని అంటున్నారు. ఆయనకు అరెస్టు కావడం అంత ఉత్సాహానిస్తుందా. ఇప్పటికే ఆయన అరెస్టు గురించి గవర్నర్ అనుమతిని కోరాం. ప్రస్తుతం ఆ అంశం పెండింగ్‌లో ఉంది.
తమిళనాడు ఎంపిలు కేంద్రంతో కొట్లాడి…
తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి పార్టీలకు అతీతంగా పోరాడుతామని సిఎం, డిప్యూటీ సిఎంలు అనేకమార్లు బిఆర్‌ఎస్, బిజెపి నాయకులకు పిలుపునిచ్చినా వారు స్పందించడం లేదు. తమిళనాడులో పార్టీలకు అతీతంగా అక్కడి ఎంపిలు కేంద్రంతో పోరాడి నిధులు తెచ్చుకోవడం వల్లే ఆ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోంది.
కొన్ని జిల్లాల డిసిసి అధ్యక్షులను మార్చుతాం
కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ ఇస్తున్న పదవుల్లో అన్ని కులాలకు, మతాలకు సమన్యాయం పాటిస్తున్నాం. పిసిసి అధ్యక్షుడి ఎంపిక నుంచి కార్పొరేషన్ చైర్మన్‌ల వరకు సమానంగా ఈ పదవులను కేటాయించాం. రానున్న రోజుల్లోనూ పిసిసి విస్తరణతో పాటు కార్పొరేషన్ పదవులు అదే రీతిన సమానంగా పదవుల పంపకాలను చేపడుతాం. డిసెంబర్ నెలాఖరు లేదా జనవరిలోపు పిసిసిని పునర్ వ్యవస్థీకరించడంతో పాటు కొన్ని జిల్లాల డిసిసి అధ్యక్షులను మార్చుతాం.
మంత్రివర్గ విస్తరణపై అధిష్టానందే తుది నిర్ణయం
మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అధిష్టానం, సిఎం రేవంత్‌రెడ్డిలు దృష్టి సారించారు. అది కూడా త్వరలోనే జరిగే అవకాశం ఉంది. అన్ని జిల్లాలకు అందులో బెర్తు దక్కవచ్చు. మంత్రివర్గ విస్తరణ స్థానిక సంస్థల తరువాతనా ఇప్పుడా అన్నది అధిష్టానం నిర్ణయిస్తుంది. దీంతోపాటు కార్పొరేషన్ పదవులు, డైరెక్టర్ పోస్టులను కూడా పంపిణీ చేస్తాం. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నా. నాకు మంత్రిపదవిపై ఎలాంటి ఆశలేదు. పిసిసి అధ్యక్ష పదవి కాంగ్రెస్ పార్టీలో సిఎం తరువాత అంత ప్రాముఖ్యత కలిగి ఉది. ఇది నా జీవితంలో పిసిసి అధ్యక్షుడిగా ఎంపిక అవుతానని నేను ఎప్పుడూ ఊహించలేదు.
మర్రి చెన్నారెడ్డి నుంచి చాలా నేర్చుకున్నా….
గతంలో పిసిసి అధ్యక్షుడిగా చేసిన వారిలో మర్రి చెన్నారెడ్డి అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నుంచి చాలా నేర్చుకున్నా. ఆయన ముద్ర నాపై ఉంటుంది. మిగతా వారి నుంచి నేను నేర్చుకున్నా, కానీ, ఆయనంటే నాకు ప్రత్యేక అభిమానం. ఇక సిఎంగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డికి ప్రస్తుత సిఎం రేవంత్‌రెడ్డికి దగ్గరి పోలికలు ఉన్నాయి. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షుడిగా పనిచేయడం సంతోషంగా ఉంది.
ఎన్ని గొడవలు ఉన్నా ఎన్నికలు వచ్చేసరికి అందరం కలిసికట్టుగా…
పార్టీలో గ్రూపు తగాదాలు సహజం. ఇది జాతీయ పార్టీ. ఎన్ని గొడవలు ఉన్నా ఎన్నికలు వచ్చేసరికి అందరం కలిసికట్టుగా పనిచేసి విజయానికి కృషి చేస్తాం. సిఎం రేవంత్‌రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జిల్లాలో గ్రూపు తగాదాలపై దృష్టి సారించి కొంతమేర వాటిని అరికట్టారు. ప్రస్తుతం తాను కూడా అందరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగు తున్నాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 80 శాతం పంచాయతీలను గెలవాలన్న కృతనిశ్చయంతో కేడర్‌ను సిద్ధం చేస్తున్నాం. ప్రజల నుంచి ప్రభుత్వం పాలనపై 50 శాతం చాలా బాగుందని ఫీడ్‌బ్యాక్ వచ్చింది. మరో 20 శాతం మంది ప్రజలు బాగుందని ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. రానున్న నాలుగేళ్లలో దానిని 100 శాతానికి తీసుకెళతాం.
హైడ్రాను దూరదృష్టితో…
హైడ్రాను దూరదృష్టితో సిఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు. హైదరాబాద్ క్యాపిటల్ సిటీ. ఇక్కడకు పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రమలు వచ్చినప్పుడు వాటికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలను కల్పించాలి. అప్పుడే మనకు పెట్టుబడులు వస్తాయి. ఎవరికీ వారే ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే పరిశ్రమలను ఎక్కడ నెలకొల్పాలి. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములను భారీగా కబ్జా చేశారు. అందుకే వాటి స్వాధీనానికి ప్రభుత్వం కృషి చేస్తోంది.