రేవంత్‌రెడ్డి అహంకారంపై
కాంగ్రెస్ అధిష్టానానికి దాసోజు బహిరంగ లేఖ
హైదరాబాద్ : టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. రైతులకు మూడు గంటల కరెంట్ చాలనీ అవమానించడం, రాష్ట్ర ప్రజలను కించపరిచేలా కులాల పేరుతో దూషిస్తున్న రేవంత్‌రెడ్డి అహంకారంపై కాంగ్రెస్ అధిష్టానానికి దాసోజు బహిరంగ లేఖ రాశారు. అగ్రకులానికి చెందిన రేవంత్ అన్ని కులాలను తక్కువ చేసి మాట్లాడడంలో రాష్ట్రంలోని బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఆగ్రహంతో ఉన్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. చిల్లర రాజకీయాల కోసం ప్రతిపక్షాలను, పేదలను హీనమైన పదజాలంతో దుర్భాషలాడడంతో పాటు అందరిని కించపరచడం భారత జాతీయ కాంగ్రెస్ కొత్త ఆచారమా..? అని దాసోజ్ ఆ లేఖలో ప్రశ్నించారు.
లేఖలోని వివరాలు ఇలా…
తెలంగాణ ప్రజలను అవమానించడం, బాధపెట్టడం, బెదిరించడం, నీచంగా మాట్లాడమని, కించపరిచే పదజాలంతో బాధపెట్టమని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏదైనా ప్రత్యేక లైసెన్స్ ఇచ్చారా..? ఒకవైపు మహిళా విభాగం కార్యదర్శిగా ట్రాన్స్‌జెండర్ మహిళ అపర్ణా రెడ్డిని నియమించినట్లు ఏఐసిసి చెబుతోంది. అయితే టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ మాత్రం తెలంగాణకు చెందిన ట్రాన్స్‌జెండర్‌లను తన రాజకీయ చర్చల్లోకి లాగి దుర్భాషలాడుతున్నాడు. యాదవులను పేడ పిసుకుంటారని కించపర్చడం, దొమ్మర్లను, వంశరాజులను హేళన చేయడం, మిగతా కులాలను చులకన చేయడం రేవంత్‌కు అలవాటుగా మారింది. గొల్ల కురుమలు, బిసిలను, ఎస్సీలను, ఎస్టీలను ఇలా ఏ కులాన్ని పడితే ఆ కులాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. ఇలాంటి బాధ్యతారహితమైన రాజకీయ నాయకుడిని సంఘం నుంచి బహిష్కరించాలి. రేవంత్‌రెడ్డి తన అగ్రకుల అహంకారాన్ని బయటపెట్టుకున్నారని యావత్ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అగ్ర కులస్తుడనే పొగరుతో బిసి కులస్తులను అవమానపరుస్తున్నాడు. రేవంత్‌రెడ్డి ఓ దుష్టుడు, చరిత్రహీనుడు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 , ఆర్టికల్ 21, భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 504, అలాగే లింగమార్పిడి వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) చట్టంలోని సెక్షన్ 18డి 2109ని రేవంత్ రెడ్డి ఉల్లంఘిస్తున్నాడు. పేదలను తూలనాడే ఈ అగ్రకుల ఆధిపత్య అహంకారం ఎందుకు?
తన ఇటీవల అమెరికా పర్యటనలో 3 ఎకరాల భూమి ఉన్న పేద రైతులకు 3 గంటల కంటే ఎక్కువ కరెంట్ ఇచ్చే అవసరం లేదని ఆయన అర్ధం లేకుండా మాట్లాడారు. అయితే ఆయన మూర్ఖపు, అవమానకరమైన వ్యాఖ్యలతో తెలంగాణ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా, అతని మూర్ఖత్వం, మతిస్థిమితం లేని ప్రవర్తనను ఖండించారు.
ప్రజలను తప్పుదోవ పట్టించేలా…
24 గంటల విద్యుత్ గురించి అందులో అవినీతి అంటూ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా తెలంగాణ ప్రభుత్వంపై బురదజల్లడానికి రేవంత్ తప్పుడు కథనాన్ని ప్రారంభించాడు. అబద్ధాలతో ప్రజల మనసు గెలవలేం అనే విషయం మూర్ఖుడైన రేవంత్ అర్ధం చేసుకోలేక పోతున్నాడు.ట్రాన్స్‌జెండర్ వర్గాన్ని, వివిధ బిసి కులాలను అవమానించేలా రేవంత్ మాట్లాడడం ఇది మొదటిసారి కాదు. అంతకుముందు కూడా చాలాసార్లు ఇలాగే మాట్లాడాడు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే , సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎందుకు రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే సహిస్తున్నారు..? రాజకీయ సంస్కృతిని నాశనం చేసే రాబంధుగా రేవంత్ రెడ్డి మారిన విష యాన్ని ఏఐసిసి ఎందుకు గుర్తించడం లేదు? ఎందుకు నియంత్రిచడం లేదు? చిల్లర రాజకీయాల కోసం ప్రతిపక్షాలను, పేదలను హీనమైన పదజాలంతో దుర్భాషలాడడం, అందరిని కించపరచడం భారత జాతీయ కాంగ్రెస్ కొత్త ఆచారమా?
ఇతర పేద వర్గాలను అవమానిస్తూ తక్కువ స్థాయికి…
సిఎం కెసిఆర్ పాలనలో సమాజంలోని ప్రతి వర్గం ఎంతో గౌరవంగా ఉంది. ఎలాంటి కులం, మతం, లింగం విభేదాలు, వివక్షత లేకుండా కెసిఆర్ గౌరవిస్తున్నారు. అన్ని కులాల వారిని మతాలవారిని ప్రోత్సహిస్తూ వారి అభివృద్ధికి చేయూత ఇస్తున్నాడు. ఇది చూసి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నేర్చుకోవాలి. ముఖ్యమంత్రి కెసిఆర్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ప్రాచీ రాథోడ్, రూత్ జాన్ పాల్ కొయ్యాల వైద్యులుగా నియమించి ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీని గౌరవించారని దయచేసి గమనించండి. అదే సమయంలో మీ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మీ పార్టీ చిల్లర రాజకీయాల కోసం ట్రాన్స్‌జెండర్ సమాజాన్ని, దొమ్మర, వంశరాజులు, యాదవులు, గౌడలు మొదలైన వారితో సహా సమాజంలోని ఇతర పేద వర్గాలను అవమానిస్తూ తక్కువ స్థాయికి దిగజార్చుతున్నాడు. రేవంత్ నోటికి అడ్డూ అదుపులేదు. అవతలి వ్యక్తులను, వారి వయసును, వారి కులాలను ఏమాత్రం లెక్కచేయకుండా అవమానిస్తున్నాడు.
రేవంత్‌కు మర్యాద, సభ్యత, సంస్కారం లేదు
రేవంత్‌కు ఓ మర్యాద, సభ్యత , సంస్కారం లేదు. ఇలాంటి వ్యక్తి తెలంగాణ రాజకీయాలకు అవమానకరం. పార్టీని దుర్వినియోగం చేయడమే కాకుండా, డబ్బులు వసూల్ చేస్తూ, తన అనుచరుల చేత ఇతర పార్టీల నాయకులు, వ్యాపారవేత్తలను బెదిరిస్తున్నాడు. రేవంత్ ఓ మానసిక రోగి అతడిని క్వారంటైన్‌లో ఉంచాలి. నేర చరిత్ర ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డిని టిపిసిసి అధ్యక్షుడిగా నియమించి భారత జాతీయ కాంగ్రెస్ తప్పు చేసింది.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని భావిస్తే రేవంత్ ఆకతాయి ప్రవర్తనను కాంగ్రెస్ పార్టీ ఆమోదించకపోతే, ఏ రాజకీయ పార్టీకి నాయకుడిగా ఉండే కనీస అర్హత లేని రేవంత్ రెడ్డిని వెంటనే అధ్యక్ష పదవినుంచి తొలగించి, ట్రాన్స్‌జెండర్‌లు, వెనుకబడిన తరగతులు, ఇతర వర్గాలకు బేషరతుగా క్షమాపణలు చెప్పే విధంగా చర్యలు చేపట్టాలి.
రేవంత్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి
రేవంత్ తన రాజకీయ ప్రసంగాలలో తోటి మనుషులు అనే కనీస ఇంగితం లేకుండా, ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీని, బిసి కులాలను కించపరిచి, అవమానించేలా మాట్లాడినందుకు చట్ట ప్రకారం తగిన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులకు, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు, రాష్ట్ర బిసి కమిషన్‌లకు జాతీయ మానవ హక్కుల సంఘానికి, జాతీయ ఓబిసి కమిషన్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను. బాధ్యతారహితమైన రేవంత్ రెడ్డి వంటి రాజకీయ నాయకుడ్ని సంఘం నుంచి బహిష్కరించాలని కోరుతున్నాను. అదేవిధంగా అమాయక ప్రజలను పేదలను చట్ట వ్యతిరేకంగా అవమానిస్తూ, వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బదీస్తున్న రేవంత్ పార్లమెంటు సభ్యత్వం కూడా రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇట్లు
ధన్యవాదాలతో డా దాసోజు శ్రవణ్, బిఆర్‌ఎస్ పార్టీ పేరుతో ఆయన లేఖ రాశారు.