బిఆర్‌ఎస్ పాలనలో, కాంగ్రెస్
హయాంలో వచ్చిన పెట్టుబడులపై
చర్చకు సిద్ధమా? తెలంగాణ
రైజింగ్ విజన్ ఓ గేమ్ ఛేంజర్
పిసిసి సారథి మహేశ్
మన తెలంగాణ/హైదరాబాద్ : పెట్టుబడులు రావాలంటే కాం గ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని దావోస్ వేదికగా మరోసారి ఇది రుజువైందని టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో వచ్చిన పెట్టుబడులు ఏడాది కాం గ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడులపై చర్చకు బిఆర్‌ఎస్ సిద్ద మా? అని ఆయన సవాల్ చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంచుకు న్న ‘తెలంగాణ రైజింగ్ 2025 విజన్‘ రాష్ట్రానికి గేమ్ చేంజర్‌గా మారిందన్నారు. దావోస్‌లో తెలంగాణ పెవిలియన్ వద్ద పెట్టుబడులు పెట్టడానికి ప్రముఖ కంపెనీలు పెద్ద ఎత్తున క్యూ కట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత రికార్డు స్థాయిలో లక్షా 78 వేల 950 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో రూ.25,750 కోట్ల పెట్టుబడులు రాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో రూ.2 లక్షలకుపైగా పెట్టుబడులు తీసుకొచ్చిందన్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో పెట్టుబడులు నాలుగు రెట్లు పెరిగాయన్నారు.
దావోస్‌లో 16 సంస్థల పెట్టుబడుల ఒప్పందంతో యువతకు 50 వేలకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ముందు చూపుతూ రీజనల్ రింగ్‌రోడ్డు నిర్మాణం, నగరంలో మెట్రో విస్తరణకు అధిక ప్రాధాన్యతనివ్వడం కూడా తెలంగాణలో పెట్టుబడులకు కంపెనీలు ఆసక్తి చూపాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సరళతర పారిశ్రామిక విధానంతో పాటు ఇటీవల ప్రకటించిన క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ ప్రపంచ పారిశ్రామిక వేత్తల దృష్టిని ఆకర్షించిందన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కీలకంగా ఉందన్నారు. భారీగా పెట్టుబడులు రావడంతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ‘భూం’ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఫోర్త్ సిటీలోకి పెట్టుబడులు రాబోతున్నాయని గేమ్ ఛేంజర్‌గా తెలంగాణ మారబోతోందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అంటే అభివృద్ధి, సంక్షేమమని, రూ.7 లక్షల కోట్లు అప్పు చేసిన కెసిఆర్, ఫాంహౌస్‌కు పరిమితం అయ్యారన్నారు. కెసిఆర్ పదేళ్ల పాలనలో వచ్చిన పెట్టుబడులు రూ.25 వేల కోట్లే అని, రెండేళ్లలోనే లక్షా 78 వేల కోట్లు తెచ్చింది తమ ప్రభుత్వమని ఆయన ఉద్ఘాటించారు. కళ్లు ఉండి చూడలేని పార్టీ ప్రతిపక్షం అని ఆయన మండిపడ్డారు.
తమ కమిటీకి మూడో కన్ను ఉంది
పటాన్ చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వర్సెస్ కాటా శ్రీనివాస్ వర్గాల మధ్య రచ్చపై పిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సిఎం రేవంత్ రెడ్డి ఫొటో విషయంలో మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడిన వ్యాఖ్యలతో పాటు క్యాంపు కార్యాలయంపై దాడి ఘటనపై కూడా పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలిస్తుందన్నారు. తమ కమిటీకి మూడో కన్ను కూడా ఉందని అన్ని చూస్తున్నామని ఆయన చెప్పారు. ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన చోట పాత, కొత్త నేతల మధ్య ఇబ్బంది ఉన్నమాట వాస్తవమని ఆయన అంగీకరించారు. మూడు రోజుల్లో క్లారిటీ వస్తుందని, పార్టీ కార్యకర్తల పై కేసులు పెట్టే అంశంపైనా కమిటీ పరిశీలిస్తుందన్నారు. ఇబ్బందిని తొలగించేందుకు పార్టీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. పార్టీ నియమించిన కమిటీ నివేదిక ఇచ్చాక దానిపై ఏ చర్య తీసుకోవాలో అది తీసుకుంటామన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడిన అంశాలను కూడా పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. కమిటీ పరిశీలన తర్వాత సరైన నిర్ణయం తీసుకుంటామని పిసిసి చీఫ్ వెల్లడించారు.
గ్రామ సభల విషయంలో అపోహలు వద్దు
గ్రామ సభల విషయంలో అపోహలు వద్దని పిసిసి అధ్యక్షుడు స్పష్టం చేశారు. నిజమైన పేద వారికే లబ్ది కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, యూత్ కాంగ్రెస్ గొడవలో ఉన్న వారికి షోకాజు నోటీసులు ఇచ్చామన్నారు. కచ్చితంగా తగిన చర్యలు ఉంటాయని పిసిసి అధ్యక్షుడు తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక పైన కసరత్తు మొదలైందన్నారు. జాబితాను రెడీ చేసి హై కమాండ్‌కు పంపిస్తామన్నారు. త్వరలో అభ్యర్థిని ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. వచ్చే బుధవారం నుంచి మంత్రులతో ముఖాముఖీ ఉంటుందని, బిజీ షెడ్యూల్ వల్ల కొన్ని రోజులు గ్యాప్ వచ్చిందని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.