Saturday, December 21, 2024

జిఒ 29తో రిజర్వుడ్ అభ్యర్థులకు నష్టం జరగదు

- Advertisement -
- Advertisement -

ఇది నా హామీ..నా భరోసా విపక్షాల ట్రాప్‌లో పడకండి ఇంటర్ విద్యార్థుల ప్రాణాలు తీసి,
గ్రూప్ పేపర్లు అంగట్లో అమ్మిన బిఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పండి ఉద్యోగాలు ఊడదీయడమే తప్ప
ఉద్యోగాలు ఇవ్వని బిజెపికి విమర్శించే హక్కు లేదు పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన గ్రూప్-1 మెయిన్స్ వివాదంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఆదివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగులు విపక్షాల ట్రాప్‌లో పడొద్దని సూచించారు. జీవో నెం 29పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, జీవో నెం 29తో రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు ఎలాంటి నష్టం జరగదని క్లారిటీ ఇచ్చారు. ఎందరో నిపుణులతో చర్చలు జరిపిన తర్వాతే జీవో నెం 29 తీసుకువచ్చామని స్పష్టం చేశారు. జీవో నెం 29తో విద్యార్థులకు నష్టం లేదని తెలుసుకున్నాకే ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నానని అన్నారు. గ్రూప్-1 విషయంలో విపక్షాలది అనవసర రాద్ధాంతం అని, అభ్యర్థులను తప్పుదోవ పట్టించి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కై అభ్యర్థులను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని, అందులో భాగంగానే నిరుద్యోగుల జీవితాలతో రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌కు ఫక్తు రాజకీయాలే కావాలనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్-1 పరీక్షలు ఇప్పుడు వాయిదా పడితే మళ్లీ ఎప్పుడు జరుగుతాయో తెలియదని.. పరీక్ష రాసేందుకు వేల మంది అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఏ ఒక్క అభ్యర్థికి అన్యాయం జరగనివ్వమని భరోసా ఇస్తున్నాం. సీఎం, మంత్రులతో మాట్లాడాకే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఒక్కసారి గ్రూప్-1 నిర్వహించిన పాపాన పోలేదని, ఇప్పుడు నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ పట్టుమని 70 వేల ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు.

ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైంది : ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఏమైందో బీజేపీ నేతలు చెప్పాలని మహేశ్‌కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. గత పదేళ్లలో బిజేపీ ప్రభుత్వం ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలన్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బిజేపీ ప్రభుత్వం ఎంతమంది ఉద్యోగాలు ఊడగొట్టిందో తమ వద్ద లెక్క ఉందన్నారు.

ప్రధాని మోడీ ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేసి లక్షల మంది ఉద్యోగాలు పోగొట్టారని విమర్శించారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఒక్కసారి కూడా గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వలేదన్నాని, కనీసం 70 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని, ఇంటర్ ఫలితాలను తప్పుల తడకగా ఇచ్చి వందలాది మంది విద్యార్థుల చావులకు కారణమైందన్నారు. కానీ 10 నెలలు కూడా పూర్తి కాని కాంగ్రెస్ ప్రభుత్వం 50 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేసిందని, పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను జిరాక్స్ సెంటర్లలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని, ప్రస్తుతం చర్చనీయాంశమైన జీవో 29ను ఫిబ్రవరి నెలలో ఇచ్చారన్నారు.

విపక్షాలు ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదు : అభ్యర్థులను తప్పుదోవ పట్టించి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. పరీక్షలు తరచూ వాయిదా పడితే అభ్యర్థులకు మంచిది కాదని, 563 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ ఫిబ్రవరిలో విడుదలైందని, నిరుద్యోగులను ఇబ్బంది పెట్టొద్దని పోలీసులను కోరారు. రాజకీయ నేతల కుట్రపూరిత ఉచ్చులో విద్యార్థులు పడొద్దని, ఎవరిపైనా లాఠీఛార్జ్ చేయవద్దని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నానని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News