Tuesday, November 5, 2024

కాంగ్రెస్ బండి నడపడం రేవంత్‌కు ఏ మేర సాథ్యం..!?

- Advertisement -
- Advertisement -

రేవంత్ దూకుడు ఆయనకు ప్లస్సా.. మైనస్సా..??

TPCC President Revanth reddy

 

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ బండి నడపడం రేవంత్‌కు ఏ మేర సాధ్యం? అనేది.. ఇప్పుడు అందర్నీ తొలిచేస్తున్న ప్రశ్నగా ఉంది. టిపిసిసి అధ్యక్షుడిగా నియమితుడైన రేవంత్‌రెడ్డి వరుసగా కాంగ్రెస్ సీనియర్లను కలుస్తున్నారు. అయితే వారిలో హృదయపూర్వకంగా అభినందించిన వారు తక్కువేనని చెప్పాలి. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, ఒకసారి నియామకం జరిగాక ఎవరు పదవిలోకి వచ్చినా సహకరించాలని ఇలా మాట్లాడిన వారే ఎక్కువ. మరీ బయటపడి వ్యతిరేకత వెళ్లగ్రక్కిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఢిల్లీ హైకమాండ్ నుంచి అక్షింతలు పడ్డాక మౌనముద్ర దాల్చారు తప్పించి మనసు మార్చుకున్నట్లు అనిపించలేదు. తమవారినే గాక బయటి సీనియర్లనూ కలుస్తున్న రేవంత్ కొందరిని పార్టీలోకి ఆకర్షిస్తారని అనుకుంటుంటే.. ఇలాంటి అయిష్టులు బయటికి వెళతారా అన్నది కూడా ఒక ఊహాగానంగా వినవస్తోంది.

ప్రభుత్వంపైన, టిఆర్‌ఎస్‌పైన రేవంత్ సంధిస్తున్న బాణాలకు అధికార పార్టీ కూడా ధీటుగానే జవాబిస్తోంది. ఉత్తమ కుమార్ పోయి ఉత్తర కుమారుడు వచ్చాడని గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కెసిఆర్ నుంచి గుంజుకోవాల్సిన సమయం వచ్చిందని రేవంత్ అంటే.. ఇదేమైనా మూటా అని ఎంఎల్‌ఎ దానం నాగేందర్ జవాబిచ్చారు. తాను కాంగ్రెస్‌లో చేరతాననే ఊహాగానాలను కూడా ఖండించారు. రేవంత్ బిజెపిపైనే విమర్శల జడివాన కురిపిస్తున్నా.. సహజంగా కేంద్రీకరణ అంతా టిఆర్‌ఎస్ ప్రభుత్వంపైనే ఉంటోంది. అదే క్రమంలో తాను దూకుడుగానే వుంటానని పదునుగా మాట్లాడతాను గానీ అసభ్యంగా మాట్లాడబోనని రేవంత్ వివరించారు. కాగా కాంగ్రెస్ బిఫారంపై గెలిచి పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపాలని గుండెల్లో గునపం గుచ్చాలని ఆయన ఇంటర్వూలో చెప్పడం రకరకాల వ్యాఖ్యలకు దారితీసింది. ఫిరాయింపుదారులకు సంబంధించి అనర్హత చట్టం ఉంది. దానిని సభాపతులు సకాలంలో వినియోగించని మాట నిజమే. అయినా ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తాజాగా కూడా తీర్పునిచ్చింది. ఆ మాటకొస్తే రేవంత్ స్వయంగా టిడిపి నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చారు. అలాంటి వ్యక్తి ఏకంగా రాళ్లతో కొట్టి చంపడం వంటి మాటలు వాడటం ఎలా చెల్లుతుంది? అధికార పార్టీ కాకున్నా ఆ సమయంలో టిడిపి కన్నా కాంగ్రెస్‌కే అవకాశం ఎక్కువన్న అంచనా అందుకు కారణమని అందరికి తెలుసు. నిజంగానే ఆయన ఆశ ఫలించి 2018 శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయినా.. 2019 ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు.

వచ్చినప్పట్నించీ పార్టీలో చురుకుగా పనిచేస్తూ తనకంటూ ఒక అనుచరవర్గాన్ని మీడియా సోషల్ మీడియా పునాదిని పెంచుకున్నారు. అదే సమయంలో ఓటుకు నోటు కేసు ఆయనను వెంటాడుతూనే ఉంది. వీటిని పార్టీలోని ప్రత్యర్థులే ప్రస్తావిస్తున్నారు. దేశంలో కాంగ్రెస్ పరిస్థితి సరిగా లేకపోవడం ఒకటైతే.. టిపిసిసిలో సీనియర్లను దారికి తెచ్చుకోవడమే పెద్ద సవాలు అవుతోంది. కేవలం మాటల దాడికన్నా ప్రజల సమస్యలపై పోరాడటం ద్వారానూ హుజూరాబాద్ ఉప ఎన్నిక మొదటి సవాలు కాగా.. ఇక్కడ ఈటెలకే ఓట్లు పడొచ్చునని రేవంత్ ఇప్పటికే ఒప్పుకోవడంలో వాస్తవికత కనిపిస్తోంది. అదొక్కటే కాదు.. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ వంటివారి పోటీని తట్టుకోవడం ద్వారానూ కాంగ్రెస్ రేవంత్ కాంగ్రెస్‌ని నడిపించాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో రేవంత్ దూకుడు ఆయనకు ప్లస్సా.. మైనస్సా అనేదానిపై పలువురి నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం గమనార్హం. అంతేకాదు..పైకి జేజేలు పలుకుతున్నా లోలోపల కుతకుతలాడిపోతున్న కొందరు సీనియర్ల వ్యవహారశైలితో రేవంత్ ఏ విధంగా ముందుకెళ్లగలడు? అన్నదానిపై సైతం పలువురు విభిన్న అభిప్రాయాలను వ్యక్తపర్చడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News